సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Dec 21, 2020 , 06:03:38

మగ్గం వర్క్‌కు మంచి గిరాకీ

 మగ్గం వర్క్‌కు మంచి గిరాకీ

  • చిల్కూరు ఎస్‌బీఐ ఆధ్వర్యంలో శిక్షణ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
  • 35 రకాల డిజైన్లలో శిక్షణ స్వయం ఉపాధికి మార్గాలు
  • వికారాబాద్‌ జిల్లా కేంద్రం ఎన్నెపల్లిలో బ్రెడ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ

వికారాబాద్‌: మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆలోచన స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. చాలా మంది మహిళలు కొద్దిగా చదువుకోగానే పెండ్లీళ్లు చేసుకుని వంటింటికే పరిమితమవుతున్నారు. మరి కొంతమంది పెద్ద చదువులు చదువుకున్నా వివాహాల అనంతరం ఉద్యోగాలు లేక ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాంటి వారు ఆర్థికంగా ఎదిగి, కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేందుకు స్వయం ఉపాధి మార్గాలు చూపుతున్నాయి కొన్ని స్వచ్ఛందం సంస్థలు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో గృహిణులు స్వచ్ఛంద సంస్థలు చూపిస్తున్న మార్గాన్ని ఎంచుకుని తమదైన శైలిలో ఉపాధి వైపు మొగ్గు చుపుతున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లిలో బ్రెడ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మగ్గం శిక్షణను నవంబర్‌లో ప్రారంభించారు. ఈ శిక్షణ నెల రోజుల పాటుగా కొనసాగుతుంది. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలోని పూడూరు మండలం చీలాపూర్‌, వికారాబాద్‌ మండలం నారాయణపూర్‌, పీలారం, ధారూరు మండలం బండమీదిపల్లి గ్రామాల నుంచే కాకుండా వికారాబాద్‌ పురపాలకలోని ఎన్నెపల్లి, రామయ్యగూడ, మధు కాలనీ నుంచి ప్రతి రోజు మహిళలు వస్తున్నారు. అలంపల్లి కాలనీ నుంచి సుమారు 35 మంది మహిళలు మగ్గం శిక్షణ కోసం వస్తున్నారంటే, వారు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

నెల రోజుల్లో 35 రకాలు..

శిక్షణ నెల రోజుల్లో 35 రకాల డిజైన్లు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు మెదక్‌ జిల్లాకు చెందిన నస్రిన్‌బేగంను స్వచ్ఛంద సంస్థ వారు నియమించారు. దీంతో మహిళలు ఇంటి వద్ద ఖాళీగా ఉండే కంటే మగ్గం శిక్షణకు వెళ్లి నేర్చుకుంటే స్వయం ఉపాధితో పాటు ఆర్థికంగా ఎదుగడానికి అవకాశం ఉంటుంది. 

మార్కెట్లో మగ్గం వర్క్‌కు డిమాండ్‌

ప్రస్తుతం మార్కెట్లో మగ్గం వర్క్‌కు మంచి గిరాకీ ఉంది. వికారాబాద్‌లో మగ్గం షాపులు వందకు పైగా ఉన్నాయి. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వికారాబాద్‌లో షాపులు అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెండ్లిళ్ల సీజన్‌ కావడంతో మహిళలు రకరకాల డిజైన్లతో కుట్టిన దుస్తులతో శుభకార్యాలకు వెళ్లాలని కోరుకుంటారు. దీంతో డబ్బులకు వెనుకాడకుండా కొత్తదనం ఉండాలని మగ్గం వేసిన బ్లవుజ్‌లను ధరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మగ్గం వర్క్‌కు భలే క్రేజ్‌ ఉంది అని చెప్పవచ్చు. 

మోడలింగ్‌ జాకెట్లు ఉపయోగిస్తున్నారు

జనరేషన్‌ మారింది. కొత్త కొత్త డిజైన్లతో కూడిన వస్ర్తాలను ధరిస్తున్నారు. శుభకార్యాలు వచ్చాయంటే చాలు వేల రూపాయలు ఖర్చు పెట్టి మగ్గం వర్క్‌ వేయించుకుంటున్నారు. అదే మగ్గం మనం నేర్చుకుంటే ఖర్చును తగ్గించుకోవచ్చు. మనమే ఇతరులకు మగ్గం వేయడానికి వీలు ఉంటుంది. చదువుకున్న కూడా ఇంట్లో ఖాళీగా ఉండలేక స్వయం ఉపాధి కోసం మగ్గం వర్క్‌ నేర్చుకుంటున్నా.    - మంజుల, బండమీదిపల్లి

టైలరింగ్‌ కన్నా.. మగ్గం డిజైన్లకే క్రేజ్‌ 

ప్రస్తుతం మార్కెట్లో టైలరింగ్‌ కన్నా మగ్గం డిజైన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఏ షాపులో చూసినా మెరుస్తున్న, చమ్కీల దుస్తులు కొంటున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు, కాని మగ్గం వర్క్‌ వేసుకున్న  వస్ర్తాలనే ధరిస్తున్నారు. అందుకే మార్కెట్‌లో ఈ వర్క్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నది. దీంతో మగ్గం నేర్చుకోవాలని అనుకున్న. నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతాను.    - అశ్విని, ఎన్నెపల్లి

త్వరగా నేర్చుకోవాలని ఉంది

ఎన్నో రోజులుగా మగ్గం వర్క్‌ నేర్చుకోవాలని అనుకున్నా. బయట ప్రైవేటుగా నేర్చుకోవాలంటే వేలల్లో ఫీజులు ఉన్నాయి. దీంతో చిల్కూర్‌ స్టేట్‌ బ్యాంక్‌ వారి సహకారంతో బ్రెడ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంలో నేర్చుకుంటున్నా. ఇక్కడ ట్రైనర్‌ బాగా నేర్పిస్తున్నది. శిక్షణతో పాటు ఉచితంగా మధ్యాహ్నం భోజనం, రెండు పూటలా టీ ఇస్తున్నారు. 35 రకాల డిజైన్లు నేర్చుకుంటున్నా.  - వైష్ణవి, ఎన్నెపల్లి కాలనీ

35 రకాల డిజైన్లు నేర్పిస్తున్నా.. 

నాలుగేండ్లుగా మగ్గం శిక్షణ ఇస్తున్నా. ప్రస్తుతం వికారాబాద్‌లోని ఎన్నెపల్లిలో 35 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నాను. ప్రతి రోజు అందరూ సెంటరుకు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఉంటున్నారు. ఇక్కడ 35 రకాల డిజైన్లు నేర్పిస్తున్నాం. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాం. ప్రతిఒక్కరూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారి అభివృద్ధిని కోరుకుంటున్నా.   - నస్రిన్‌బేగం, ట్రైనర్‌


VIDEOS

logo