గురువారం 04 మార్చి 2021
Vikarabad - Dec 20, 2020 , 00:28:40

మూల మలుపులు.. మృత్యుపాశాలు

మూల మలుపులు.. మృత్యుపాశాలు

రోడ్లకు ఇరువైపులా పొదలతో కానరాని దారులు

సూచిక బోర్డులు లేక తరచూ ప్రమాదాలు

అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలి

దోమ : మండల పరిధిలోని దోమ నుంచి పాలేపల్లి, అయినాపూర్‌ మీదుగా దాదాపూర్‌ వెళ్లే 11 కిలోమీటర్ల రహదారిలో అనేక మూల మలుపులు, రోడ్డుకు ఇరువైపులా దట్టమైన పొదలు ఉన్నాయి. అలాగే బాసుపల్లి నుంచి దోమ వెళుతున్న రోడ్డు మార్గంలో మలుపులతోపాటు రోడ్డుకు ఇరువైపులా పొదలు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మండల పరిధిలోని దొంగఎన్కేపల్లి నుంచి రాఘవాపూర్‌ వెళ్లే రోడ్డులో గత సోమవారం 7న రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. ఆయా రోడ్డు మార్గాల్లో మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఎంతో మంది ప్రమాదాల బారిన పడి అవిటివారు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గ్రహించి రోడ్డు మార్గాలో ప్రమాదాలు జరుగకుండా అరికట్టేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు, ఆటో యూనియన్‌ డ్రైవర్లు కోరుతున్నారు.


రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించాలి 

బైకని ఆనందం, అయినాపూర్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు 

దోమ నుంచి పాలేపల్లి, అయినాపూర్‌ మీదుగా వెళ్లే రోడ్డు మార్గంలో అనేక మూల మలుపులు.. వాటికి తోడుగా దట్టమైన పొదల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరుతున్నాం. మూల మలుపుల వద్ద వాహనదారులు దారి కానరాక అయోమయస్థితిలో పడిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని అయినాపూర్‌ ఆటో యూనియన్‌ తరఫున అధికారులకు విన్నవిస్తున్నాం.

సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి 

యశోద, పాలేపల్లి సర్పంచ్‌  

మండల పరిధిలో దోమ మీదుగా పాలేపల్లి, అయినాపూర్‌ రోడ్డు మార్గంలో మూల మలుపుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా మంది ప్రమాదాలబారిన పడి అవిటివారిగా మిగిలిపోయారు. దయచేసి అధికారులు బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.


VIDEOS

logo