శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Dec 16, 2020 , 00:01:47

సాగు అంచనా..లక్ష ఎకరాలు

 సాగు అంచనా..లక్ష ఎకరాలు

ఆశించినదాని కంటే అధికంగా మెట్ట పంటల సాగు

26,946 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం 

రైతులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో.. 

59వేల పైచిలుకు ఎకరాల్లో  వరి సాగుకు అంచనా 

పరిగి :  వర్షాలతో ఒక్కసారిగా భూగర్భ జలాలు పెరిగాయి.  చెరువులు, కుంటలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో వికారాబాద్‌ జిల్లా పరిధిలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం కూడా పెరుగనుంది. ఇప్పటికే సాగవుతున్న మెట్ట పంటల విస్తీర్ణం గత సంవత్సరం కంటే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరింత పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగిలో  పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందనే అంచనాలకు తగ్గట్లుగా ఎరువులు అందుబాటులో ఉంచేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. ఎక్కడా రైతులకు ఎరువుల కొరత లేకుండా సమయానుకూలంగా సరఫరా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది.  వికారాబాద్‌ జిల్లా పరిధిలో గత యాసంగి సీజన్‌లో 63వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.  ఈసారి యాసంగిలో ఈ పంటల సాగు విస్తీర్ణం లక్షా 2వేల ఎకరాలకు పెరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 

59వేల ఎకరాల్లో వరి సాగు అంచనా

వికారాబాద్‌ జిల్లా పరిధిలో ఈసారి యాసంగి సీజన్‌లో 59 వేల పైచిలుకు ఎకరాల్లో వరి సాగవుతున్నదని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం యాసంగిలో 35వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. 

గత సంవత్సరం నవంబర్‌ నెలలో జిల్లాలో సరాసరిన భూగర్భ జలమట్టం 12.25 మీటర్లు ఉండగా ఈసారి నవంబర్‌లో 7 మీటర్లుగా ఉన్నది. తద్వారా భూగర్భ జలమట్టం గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 4.85 మీటర్లు పెరిగింది. తద్వారా గత సంవత్సరం కంటే అధికంగా వరి పంట సాగు అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బోర్లతోపాటు చెరువుల కింద కూడా వరి సాగు పెరుగనుంది. ఈ లెక్కన ఈసారి తప్పనిసరిగా 59వేల పైచిలుకు ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నారు. మిగతా పంటలకు సంబంధించి గత యాసంగిలో జొన్న పంట 3,481 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 5,601 ఎకరాలలో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే 4,400 ఎకరాల్లో సాగు చేశారు. గత సంవత్సరం వేరుశనగ పంట 6,526 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 16,735 ఎకరాలలో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 10 వేల ఎకరాల్లో సాగు చేశారు.  శనగ పంట గత సంవత్సరం 8,441 ఎకరాలలో సాగు చేయగా, ఈసారి 15,098 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు.ఇప్పటివరకు 8,170 ఎకరాల్లో సాగు చేశారు. 

   26,946 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

జిల్లా పరిధిలో యాసంగి సీజన్‌లో సాగు చేసే పంటలకు అవసరం మేరకు ఎరువులు సరఫరాకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో ఈసారి యాసంగి సీజన్‌లో 26,946 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. ఇందులో యూరియా 10,845 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 5,810 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 2,211 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 6,464 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,616 మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు జిల్లాకు కేటాయింపులు జరిపి, అవసరం మేరకు ఆయా సమయాల్లో ఎరువులు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఏ నెలలో ఎంతమేరకు ఏయే ఎరువులు అవసరమవుతాయనేది ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు సంబంధిత సమయానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఎరువులు సరఫరా జరిగేలా చూస్తున్నారు. 

పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది 

 వర్షాలు పుష్కంగా పడటంతో చెరువులన్నీ నీటితో నిండగా, భూగర్భ జలమట్టం సైతం పెరిగింది. దీంతో జిల్లాలో గత సంవత్సరం కంటే ఈసారి యాసంగి సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు తయారు చేశాము. జిల్లాలో వరి పంట సాగు అధికంగా పెరుగుతుంది. ఎరువుల కొరత రానివ్వం.  

   - గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి


VIDEOS

logo