నియోజకవర్గానికో గ్రంథాలయం

- త్వరలోనే కొడంగల్, తాండూరు, పరిగిలో నిర్మాణం.. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
- స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశం
- వికారాబాద్ జిల్లా కేంద్రంలో రీడింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
ప్రతి నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న రీడింగ్ హాల్‌కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే పరిగి, కొడంగల్, తాండూరులో గ్రంథాలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకోసం స్థలాన్ని ఎంపికచేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ : గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు అని, యువత సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయలతో రీడింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి చెందినప్పుడే అన్ని అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలు నిర్మించి, అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. త్వరలో పరిగి, కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో కోటి రూపాయలతో గ్రంథాలయాలను నిర్మించేందుకు స్థలం పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోచింగ్ సెంటర్ విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో వస్తుందని తెలిపారు. అనంతగిరి టూరిజం అభివృద్ధి, కంపెనీల కోసం మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. జిల్లాలోని మర్పల్లిలో కంపెనీల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించామని, త్వరలో యువతకు ఉపాధి అవకాశాలు కూడా దక్కనున్నాయని తెలిపారు. కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉంటూ రైతులకు అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని ఆమె గుర్తుచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. రానున్న రోజుల్లో కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను చూస్తే మార్కెట్లను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ కానున్నాయని ఆమె తెలిపారు. ఇప్పటివరకు కోటి పుస్తకాలను కొనుగోలు చేసినట్లు, ఇంకా కొత్త పుస్తకాలను కొనుగోలు చేసి అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచు తామన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం అనిల్ అంబానీలకు వర్తించేలా చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వమని వివరించారు. అనంతరం రాష్ట్ర విద్య మౌలిక సదుపాయల కల్పన సంస్థ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే గ్రంథాలయంలో కావాల్సినన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ విద్యను మించిన ఆయుధం లేదన్నారు. గ్రంథాలయాలు మనిషికి కళ్లు లాంటివన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే వికారాబాద్‌లో జిల్లా గ్రంథాలయం ఉందన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి ఈ ప్రాంత పేద విద్యార్థుల కోసం రూ.40 లక్షలు ఖర్చుపెట్టి గ్రూప్-1 కోచింగ్ సెంటరును ఏర్పాటు చేశారన్నారు. అందులో 120 మందికి ఉద్యోగాలు సైతం పొందారని గుర్తు చేశారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. కేసీఆర్ హయాంలోనే గ్రంథాలయాల అభివృద్ధ్ది వేగంగా జరుగుతుందన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు విదేశాల్లో చదివేందుకుగాను ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు ఖర్చుపెడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శ్రీధర్, జడ్పీ వైఎస్ చైర్మన్ విజయ్‌కుమార్, డీఈవో రేణుకదేవి, జడ్పీ సీఈవో ఉషా, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుల్లపల్లి మంజుల, వైస్ చైర్మన్ షంషాద్‌బేగం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకుడు శుభప్రద్‌పటేల్, మాజీ జడ్పీటీసీ షరీఫ్, మర్పల్లి జడ్పీటీసీ మధు, కౌన్సిలర్లు నవీన్, చందర్‌నాయక్, నందు, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్,ఏసుదాస్ పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి
వికారాబాద్/మోమిన్‌పేట : ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం పీఎంజీఎస్‌వై మోమిన్‌పేట మండల కేంద్రం నుంచి మండల పరిధిలోని కోల్కుంద గ్రామం వరకు రూ.3,24 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయ ని తెలిపారు. శంకుస్థాపనకు వచ్చే ముందు మోమిన్‌పేట మండల పరిధిలోని దేవరంపల్లి గేట్‌వద్ద రోడ్డుపై కూరగాయలను విక్రయిస్తున్న రైతులతో మంత్రి మాట్లాడారు. ప్రతి రోజు కూరగాయలను విక్రయి స్తే ఏ మేరకు ఆదాయం వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. అందరికి రైతు బంధు డబ్బులు వస్తున్నా యా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మ న్ బైండ్ల విజయ్‌కుమార్, ఎంపీపీ వసంత, పీఎసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, అంజిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉన్నారు.
తాజావార్తలు
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
- సీటెట్ ఫలితాల విడుదల
- అందాల యాంకరమ్మకు అంతా ఫిదా..!