గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 15, 2020 , 04:05:42

కొలువుల సంబురం

కొలువుల సంబురం

  • సాకారమవుతున్న ఉద్యోగార్థుల కల..
  • రంగారెడ్డి జిల్లాలో 5వేలకుపైగా నిరుద్యోగులకు లబ్ధి
  • వికారాబాద్‌ జిల్లాలో 1,581 ఖాళీలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు  
  • ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్న టీన్జీవోలు
  • విద్య, పోలీసు శాఖలో అధిక ఉద్యోగావకాశాలు 
  • పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు

రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంపై నిరుద్యోగులు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు న్నాయో లెక్కలు సేకరించి నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం ఆదేశించడంతో  అన్ని శాఖల ఉన్నతాధికారులు   ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కరోనా కలంలో  అనేకమంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ప్రకటన వారిలో ఉత్తేజాన్ని నింపింది. టీచర్‌ ఉద్యోగాల ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చన్న అంచనా నేపథ్యంలో ఆయా ఉద్యోగాల  నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనను పలు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు స్వాగతించారు. వికారాబాద్‌ జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి 1,581 ఖాళీలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో ఈ సంఖ్య ఐదు వేలకు పైగా ఉంది.తాజా ఉద్యోగ సన్నాహాలతో యువత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

వికారాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విద్యాశాఖ, పోలీస్‌శాఖతోపాటు ఇతర అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభు త్వం త్వరలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ప్రభు త్వ ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలోని ఆయా శాఖల్లోని ఉద్యోగుల ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఇటీవలే పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఖాళీలను భర్తీ చేసి న దృష్ట్యా జిల్లాలో పోలీస్‌శాఖకు సంబంధించి ఒక్క పోస్టు కూ డా ఖాళీ లేకపోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లా పంచాయతీ శాఖలో కూడా ఖాళీలను ఏడాది క్రితం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులతో భర్తీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుం డా రెవెన్యూ శాఖలో మేజర్‌గా ఖాళీలుండే వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయించేందుకు నిర్ణయించిన దృష్ట్యా జిల్లా రెవెన్యూశాఖలో చెప్పుకోదగినట్టుగా ఖాళీలు లేవు. వ్యవసాయశాఖలోనూ ఏఈవో, ఏవో పోస్టులను భారీ గా భర్తీ చేయడంతో ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్య లో ఖాళీలున్నాయి. అయితే జిల్లా లో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రా నుంది. ఆరేండ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి న ప్రభుత్వం మరోసారి ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లాలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 1581 ఖాళీలు...

జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను జిల్లా ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. అయితే జిల్లాలో అత్యధికం గా విద్యాశాఖ, జిల్లా మాతా, శిశు సంక్షేమ శాఖలో అత్యధిక ఖాళీలున్నాయి. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలకు సం బంధించి కొన్ని శాఖల నుంచి స్పష్టత రాగా మరికొన్ని శాఖల నుంచి వివరాలు రావాల్సి ఉంది. జిల్లా విద్యాశాఖలో అత్యధికంగా 817పోస్టులు ఖాళీలుండగా, వీటిలో గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్స్‌-83, స్కూల్‌ అసిస్టెంట్స్‌-257, భాషా పండితులు-67, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు-75, ఎస్జీటీలు-291, పీఈటీలు-14, పీడీలు-5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా మాతా, శిశు సంక్షేమశాఖలో 518 పోస్టులు ఖాళీలుండగా గ్రేడ్‌-1, 2 సూపర్‌వైజర్‌-30, అంగన్‌వాడీలు-228, మినీ అంగన్‌వాడీలు-253, పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖలో 11 ఖాళీలు, జిల్లా గిరిజన సంక్షేమశాఖలో 24 పోస్టు లు, సాంఘిక సంక్షేమశాఖలో 17 పోస్టులు, పశుసంవర్ధకశాఖ లో 47 పోస్టులు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 3 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 7 పోస్టులు, వ్యవసాయశాఖలో 25 పోస్టు లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 89 పోస్టులు ఖాళీలున్నాయి. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 44, తాండూరు మున్సిపాలిటీలో 44, పరిగి మున్సిపాలిటీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. అదేవిధంగా వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో వారిని ఇతర శాఖలకు కేటాయించేందుకు నిర్ణయించారు. వీఆర్వో పోస్టులు లేకపోవడంతో చాలా తక్కువ ఖాళీలున్నాయి. రెవెన్యూ శాఖలో మొత్తం 23 పోస్టులు ఖాళీలుండగా, తాసిల్దార్‌ పోస్టులు-9, డిప్యూటీ తాసిల్దార్‌-4, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు-8, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు-2 ఖాళీలున్నాయి. వీటితోపాటు నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్‌, రోడ్లు, భవనాలు, ఎక్సైజ్‌, విద్యుత్‌, వైద్యారోగ్య తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను రెండు రోజుల్లో స్పష్టత రానుంది. 

రంగారెడ్డి జిల్లాలో 5వేలకుపైగా నిరుద్యోగులకు లబ్ధి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఎన్నో ఏండ్లుగా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురు అందించారు. ప్రభుత్వ ప్రకటనతో రంగారెడ్డి జిల్లా  వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, టీఎన్జోలు హర్షం వ్యక్తం చేస్తుండగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత తమకు ఉద్యోగం వచ్చినట్లుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల లెక్కలను సేకరించే పనిలో అధికార యంత్రాంగం పడింది. ప్రభుత్వ ప్రకటన రాగా నే అధికారులు లెక్కల సేకరణ పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? ఎన్ని పోస్టులు మంజూరవుతాయని నిరుద్యోగ  యువతలో ఆసక్తి నెలకొన్నది. కొంచెం ఆలస్యమైనా  ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ పోస్టుల ఖాళీల భర్తీ ప్రకటన చేయడం సంతోషంగా ఉన్నదని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో పోలీస్‌శాఖ, ఉపాధ్యాయులు, వ్యవసాయం, పశుసంవర్ధక, బీసీ వెల్ఫేర్‌, మున్సిపల్‌, ఎస్సీ, ఎస్టీ, సహకార, పంచాయతీరాజ్‌, ఇతర శాఖలలో ప్రస్తు తం వివిధ శాఖలల్లో ఖాళీల అంచనా వేస్తున్నారు. వాటన్నింటినీ భర్తీ చేయాలని, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్‌ జరుగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతోపాటుగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాల సేకరణలో ఉన్నారు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపుగా 5వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అంచనా. అయితే జిల్లాలో శాఖలవారీగా లెక్కలు తీయనున్నారు. 

జిల్లాలో ఖాళీలు..

వైద్య, ఆరోగ్యశాఖలో 325, వ్యవసాయశాఖలో 100, రెవెన్యూలో 75, విద్యాశాఖలో టెక్నికల్‌స్టాఫ్‌ 50, సోషల్‌ వెల్ఫేర్‌ 150, బీసీ వెల్ఫేర్‌ 130, ఎక్సైజ్‌శాఖ 90, సర్వేల్యాండ్‌ రికార్డ్సు 290, ప్లానింగ్‌శాఖ 5, సహకారశాఖ 15, పంచాయతీరాజ్‌ 180, స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు 70, సివిల్‌ సప్లయ్‌లో 20 కాగా.. ఇవే కాకుండా పోలీసుశాఖలో 1500, ఉపాధ్యాయులు 1500 చొప్పున ఖాళీలతోపాటుగా ఇతర శాఖలో ప్రస్తుతం ఖాళీల సంఖ్యను అంచనా వేస్తున్నారు. అయితే ఇది పూర్తి లెక్కలు కావు. ఇందులో ఖాళీల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చని చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వశాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. పోలీసుశాఖలో కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉండగా ఉపాధ్యాయ, వ్యవసాయ, పశుసంవర్ధక, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌, మున్సిపల్‌తోపాటు ఇతర అన్ని శాఖల నుం చి లెక్కలు తీస్తున్నారు. ఒక్కటి, రెండు రోజుల్లో ఖాళీల సంఖ్య లో పూర్తిస్థాయి స్పష్టత రానున్నది. జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఇక కోచింగ్‌ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. 

43 మంది ఉద్యోగులు జిల్లాకు కేటాయింపు

జిల్లాలో రెవెన్యూశాఖలో ఖాళీగా జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు 46 ఖాళీలు ఉండగా .. 43పోస్టులు భర్తీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధికి ఈ ఉద్యోగులను ప్రభుత్వం కేటాయిచిం ది. గ్రూప్‌-4 ఫలితాలు ఇంతకుముందే రాగా సీసీఎల్‌ నుంచి జిల్లాకు సోమవారం 43 మంది కేటాయించారు. ఇందులో ఇం కా టైపిస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరిస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలని సీఎం అధికారులను ఆదేశించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

యువతకు మంచి అవకాశం

రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఒక్కసారి 50వేల ఉద్యోగాలు వేయడం వల్లన ఎం తో మంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. నేను డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాలలో ఒకటి సంపాదించుకుంటా. -శేఖర్‌ గుర్రంపల్లి , కొందుర్గు 

సీఎం కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది నా కల. త్వరలోనే  స్వరాష్ట్రంలో నా కల నెరవేరుతుందని ధీమాగా ఉంది. తెలం గాణ సర్కార్‌ ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపడం చాలా సంతోషంగా ఉం ది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నిరుద్యోగుల పాలిట కేసీఆర్‌ దేవుడు.- లక్ష్మణ్‌, విద్యార్థి, లింగారెడ్డిగూడ, షాద్‌నగర్‌రూరల్‌

సీఎం కేసీఆర్‌సార్‌కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం

ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం హర్షణీ యం. కొంతకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎంతో ఆనందదాయకం. స్వరాష్ట్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కి ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.- చిందం వెంకటేశ్‌, నిరుద్యోగి, కడ్తాల్‌ 

నిరుద్యోగుల తరుపున ధన్యవాదాలు

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న రాష్ట్రప్రభుత్వంకు కృతజ్ఞతలు. సీమాంధ్ర పాలనలో వివక్షతకు గురైన తెలంగాణ నిరుద్యోగులకు స్వరాష్ట్రంలో ఆరేండ్లల్లో లక్షకుపైగా కొలువులిచ్చిన సర్కార్‌ మరో 50వేల పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం సంతోషంగా ఉంది. తెలంగాణ సర్కార్‌కు నిరుద్యోగుల తరుపున ప్రత్యేక ధన్యావాదాలు.సుష్మ, ప్రైవేట్‌ టీచర్‌, తాండూరు

ఆశ పెరిగింది

ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం హర్షణీయం. ఇం దులో ఉపాధ్యాయ, పోలీసులకు పెద్ద పీట వేయడం సంతోషకరం. ఇప్పటికే ప్రభుత్వం సుమారు 36 వేల వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. ప్రస్తుతం 50వేల ఉద్యోగాలు కల్పించడంతో సీఎం కేసీఆర్‌ కల నెరవేరింది. - సీహెచ్‌.బాలరాజు, ప్రైవేటు ఉద్యోగి, శంకర్‌పల్లి

చిగురిస్తున్న ఆశలు

ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధికల్పించే దిశగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దశలవారీగా ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ కృషిచేయడం అభినందనీయం. - రాంచందర్‌, కులకచర్ల

గొప్ప పరిణామం

ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం హర్షణీయం. ఉద్యోగాల భర్తీకి ప్రభు త్వం గ్రిన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గొప్ప పరిణామం. ప్రభుత్వానికి నిరుద్యోగ యువకులంతా రుణపడి ఉంటారు.  - ఎండీ ఇనాయత్‌, బోడంపహాడ్‌, షాబాద్‌పెరిగిన ఆనందం

ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వేస్తామని ప్రకటించడం హర్షణీ యం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగాల మీద మళ్లీ ఆశలు పెరిగాయి. - మహేశ్‌, అమీర్‌గూడ, మొయినాబాద్‌

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా

ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. నేను డిగ్రీ పూర్తి చేశా. గతంలో ఎవరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు విడుదల చేయలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగలకు ఎం తో మేలు జరుగుతుంది. - మోత్యానాయక్‌, నంద్యాతండా, కొందుర్గు


VIDEOS

logo