సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Dec 13, 2020 , 04:25:49

తొలి ప్రాధాన్యం వారియర్స్‌కే..

తొలి ప్రాధాన్యం వారియర్స్‌కే..

కరోనా మహమ్మారిని అంతమొందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీకాల ప్రయోగాలు తుదిదశకు చేరుకొని సత్ఫలితాలిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముందుగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతగా 25వేల మందికిపైగా టీకాలు వేసేందుకు ఆదేశాలందగా.. అందుకనుగుణంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, మెడికల్‌ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపారు.  వికారాబాద్‌ జిల్లాలోనూ టీకా పంపిణీకి ముందస్తు  చర్యలను అధికారులు వేగవంతం చేశారు. అదేవిధంగా టీకాలను నిల్వ చేసేందుకు అవసరమైన డీప్‌ ఫ్రీజర్లు, వాక్‌ ఇన్‌ కూలర్లు, కోల్డ్‌ బాక్సులు, వ్యాక్సిన్‌ రవాణాకు ప్రత్యేక వాహనాలను సమకూర్చడంతో పాటు మరిన్నింటికీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ :  కొవిడ్‌-19 టీకా త్వరలో వచ్చే  అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం  సన్నాహాలు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతగా 25వేల మందికి పైగా టీకా వేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో..ఆ దిశగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రభుత్వ దవాఖానలు, మెడికల్‌ కాలేజీలలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.ప్రైవేట్‌   సిబ్బంది సమాచార సేకరణ మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రధానంగా డీప్‌ ఫ్రీజర్లు, వాక్‌ఇన్‌ కూలర్స్‌, కోల్డ్‌ బాక్స్‌లు, వ్యాక్సిన్‌ రవాణాకు ప్రత్యేక వాహనాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. 

తొలిదశలో వైద్యసిబ్బంది, పోలీసులకు...

కొవిడ్‌-19 విజృంభించిన సమయంలో ప్రజలు కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండటం కోసం రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం సేవలు అందించిన జిల్లాలోని 59 ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న 2889 మంది వైద్య సిబ్బందితో పాటు 803 ప్రైవేట్‌ దవాఖానలు, కాలేజీల్లో పనిచేస్తున్న వారికి మొదట విడుతగా టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1600 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు,ఆయాలు తదితరులకు వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
భద్రపరిచేందుకు విస్తృత ఏర్పాట్లు
టీకా రాగానే పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంఅండ్‌హెచ్‌వో,డీసీహెచ్‌ఎస్‌) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), 16 పట్టణ ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్‌సీ), 2 పీపీ యూనిట్స్‌, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ఇందులో నూతనంగా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.అలాగే 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా..1,380 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 220 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందుబాటులో ఉన్న ఐస్‌లెస్‌ రిఫ్రిజిరేటర్లు, డీప్‌ ఫ్రీజర్లను సిద్ధం చేస్తున్నారు.  పీహెచ్‌సీలు,సీహెచ్‌సీలు తదితర దవాఖానల్లో కోల్డ్‌ యూనిట్ల వివరాలను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ఇంకా అవసరమైన వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతీ పీహెచ్‌సీకి ప్రస్తుతం ఒకటి చొప్పున డీప్‌ ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 35 ఫ్రీజర్లు కావాల్సి ఉండగా, వంద కోల్డ్‌ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో 50 కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. డివిజన్‌కు ఒకటి చొప్పున ఆరు వాక్‌ ఇన్‌ కూలర్స్‌ అవసరం కాగా..డివిజన్ల నుంచి పీహెచ్‌సీలకు, ఉపకేంద్రాలకు వ్యాక్సిన్‌ రవాణాకు ప్రత్యేక వాహనాలు అవసరం ఉంది. ప్రస్తుతానికి జిల్లాలో ఇలాంటి వాహనం ఒకటే ఉంది. ఇంకా ఆరు వాహనాలు అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.  

సన్నాహాలు   చేస్తున్నాం-డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో తొలివిడుత కరోనా నివారణ టీకాలు పంపిణీ,  నిల్వకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్‌ దవాఖానలు, మెడికల్‌ కాలేజీల్లో  వివిధ స్థాయిలో పనిచేస్తున్న 25 వేల మంది వివరాలను సేకరిస్తున్నాం. ఇటీవల ప్రభుత్వ దవాఖానల వివరాల సేకరణను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం.ప్రైవేట్‌ దవాఖానలకు సంబంధించి ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రధానంగా డీప్‌ ఫ్రీజర్లు ,వాక్‌ ఇన్‌ కూలర్స్‌ , కోల్డ్‌ బాక్స్‌లు, వ్యాక్సిన్‌ రవాణాకు ప్రత్యేక వాహనాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. 

VIDEOS

తాజావార్తలు


logo