శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 11, 2020 , 04:08:40

నూతన జీపీల్లో అభివృద్ధి పరుగులు

నూతన జీపీల్లో   అభివృద్ధి పరుగులు

  • సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం 
  • ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు
  • మారుతున్న  గ్రామాల రూపురేఖలు 

కొత్త గ్రామపంచాయతీల రూపురేఖలు మారుతున్నాయి. రెండేండ్లలోనే పాత జీపీలతో సమానంగా ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని తండాలకు మహర్దశ వచ్చింది. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 566 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 209 కొత్తగా ఏర్పాటుకాగా.. వీటిలో 98 గిరిజన తండాలున్నాయి. మరోవైపు నూతన పంచాయతీరాజ్‌ చట్టం గ్రామాలకు వరంగా మారింది. దీని ప్రకారం జిల్లావ్యాప్తంగా జీపీలన్నింటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.10కోట్లు వెచ్చిస్తున్నది. వీటితో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం కొత్త జీపీలకు కలిసొచ్చింది. దీంతో మట్టి రోడ్లు సీసీరోడ్లుగా.. మురుగుకాల్వలు సీసీ డ్రైన్‌లుగా మారాయి. ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందుతున్నది. అంతేకాకుండా ఆహ్లాదం పంచే ప్రకృతి వనాలు, గ్రామానికో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల వంటి మౌలిక వసతుల కల్పనతో పల్లెలు అభివృద్ధి బాట పట్టాయి. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకప్పుడు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గిరిజన తండాలు, అనుబంధ గ్రామాల్లో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతున్నది.  తండాలతోపాటు అనుబంధ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకొని రెండేళ్ల క్రితం గ్రామ పంచాయతీలుగా మార్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన తండాలకు, అనుబంధ గ్రామాలకు మంచి రోజులొచ్చాయి. గిరిజన తండాల ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. కేవలం రెండేళ్లలోనే పాత పంచాయతీలకు దీటుగా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి జరిగింది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్కో సమస్యపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌ అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంఅమల్లోకి తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులు వచ్చాయి. 

కొత్త జీపీల్లో అభివృద్ధి పరుగులు...

జిల్లాలో ప్రస్తుతం 566 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో రెండేళ్ల క్రితం 209 నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుకాగా, అందులో 98 గిరిజన తండాలున్నాయి. గిరిజన తండా లు, అనుబంధ గ్రామాలు.. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ  భారీగా నిధులు మంజూరు చేస్తున్నది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటికీ కలిపి నెలకు  రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిసున్నది. గతంలో గ్రామ పంచాయతీలకు గల అనుబంధ గ్రామాలతోపాటు గిరిజన తండాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు ఉండేవి కావు. వర్షాకాలం వస్తే బురద రోడ్లపైనే ప్రయాణించాల్సిన దుస్థితి  ఉండేది.  అంతేకాకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వానకాలంలో గిరిజన తండాల ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడేవారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులన్నింటినీ కేవలం గ్రామ పంచాయతీల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేసేవారు. అనుబంధ గ్రామాలైన తండాల అభివృద్ధికి ఒక్కపైసా కూడా ఖర్చు చేసేవారు కాదు. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన అనంతరం సమస్యలన్నీ తీరి అభివృద్ధిలోకి వచ్చాయి. మండల కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రహదారులను నిర్మించారు. గ్రామ పంచాయతీలోని ప్రతీ కాలనీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు. కొత్త గ్రామాలకు తాగునీటి పైప్‌లైన్‌ వేయడంతోపాటు పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య పనులతోపాటు శిధిలావస్థకు చేరిన భవనాలను తొలగించడం, ముళ్ల పొదలను తొలగించడం, తడి-పొడి చెత్తను సేకరించడం తదితర స్వచ్ఛ కార్యక్రమాలను చేపడుతున్నారు. అదేవిధంగా ప్రతీ కొత్త గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ అందజేశారు. అంతేకాకుండా సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, కూరగాయల పందిళ్లు, కల్లాలు, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతలను నిర్మించారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన ప్రతీ గ్రామ పంచాయతీకి సొంత పంచాయతీ భవనాలు ఉండాలనే ఉద్దేశంతో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో ఆస్తిపన్ను చెల్లించేందుకు గిరిజన తండాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. 

గ్రామాల్లో సమూల మార్పులు...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామల్లో సమూల మార్పులు వచ్చాయి. ఎప్పుడో పాతికేళ్ల క్రితం రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టానికి స్వస్తి పలికిన సీఎం కేసీఆర్‌ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. నూతన చట్టం ప్రకారం ప్రతినెల గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ, పల్లెప్రగతి తదితర కార్యక్రమాలను చేపడుతూ గ్రామాల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. కొత్త చట్టానికి అనుగుణంగా ప్రతి గ్రామ నర్సరీలో, ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డులు, చివరి మజిలీ గౌరవంగా నిర్వహించేందుకుగాను శ్మశానవాటికలు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలోని ఏ ఒక్క కాలనీకి అన్యాయం జరగకుండాఅభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రతినెల పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.  జిల్లాస్థాయి పంచాయతీ అధికారి నెలకు ఐదు గ్రామాల్లో అభివృద్ధి పనులను తనిఖీ చేస్తుండడంతో పనుల్లో నాణ్యతతోపాటు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి.  


VIDEOS

logo