శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 10, 2020 , 04:57:47

రూ.62.20కోట్లతో చెక్‌డ్యాంలు

రూ.62.20కోట్లతో చెక్‌డ్యాంలు

  • వికారాబాద్‌ జిల్లాలోని కాగ్నా, కాకరవేణి, మూసీ నదులతోపాటు పలు వాగులపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు
  • 18 చెక్‌డ్యాంలకు అనుమతులు మంజూరు
  • జీవన్గీలో 80 శాతం, బొంరాస్‌పేట్‌లో 30 శాతం పూర్తయిన పనులు
  • మిగతా 16 చెక్‌డ్యాంలకు టెండర్లు పూర్తి

సాగునీటి వనరులను పెంపొందించడమే లక్ష్యంగా సర్కార్‌ ముందుకెళ్తున్నది. ఇప్పటికే మిషన్‌కాకతీయ పథకంలో భాగంగా చెరువులు, కుంటలను పునరుద్ధరించగా, చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతున్నది. వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా రూ.62.20కోట్లతో 18 నిర్మించేందుకు జిల్లా నీటిపారుదలశాఖ పూనుకున్నది. అయితే బషీరాబాద్‌ మండలం జీవన్గ్గీ సమీపంలో కాగ్నా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 80శాతం, బొంరాస్‌పేటలో 30శాతం పూర్తికాగా, మిగతావాటికి టెండర్లు పూర్తయ్యాయి. కాగా, ఇటీవల  వచ్చిన వరదల కారణంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులో భాగంగానే మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో సాగు నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. జిల్లాలో వ్యవసాయాధారిత ప్రజలే అధికం. పత్తి, మక్కజొన్న, వరి, కంది పంటలను అధికంగా సాగు చేస్తారు. జిల్లాలో కాగ్నా, కాకరవేణి, మూసీ, లఖ్నాపూర్‌ వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం జిలాక్లు సాగు నీరందించాలనే ఆలోచన చేయలేదు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టింది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులతోపాటు వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించి పంటలకు సాగు నీరందించడమే కాకుండా బోర్లు, బావుల్లో భూగర్భజలాలను పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే 80 శాతం రైతులు ఏడాదికి రెండు పంటలు పండించే ఆస్కారం ఉంటుంది. జిల్లాలో 1126 చెరువులు, 9 ప్రాజెక్టులున్నాయి. వీటి కింద 77,580 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లావ్యాప్తంగా సుమారు 2.25 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. మిషన్‌ కాకతీయలో 720 చెరువుల్లో రూ.250 కోట్లతో పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. 

ఈ నెలాఖరులో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం..

జిల్లాలోని కాగ్నా, కాకరవేణి, మూసీ నదులతోపాటు లఖ్నాపూర్‌ ప్రాజెక్టుతోపాటు వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని ప్రధాన వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.62.20 కోట్లతో 18 చెక్‌డ్యాంలను నిర్మించేందుకు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా, చెక్‌డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతోపాటు నిధులు విడుదల చేసింది. తాం డూరు నియోజకవర్గంలో 7, పరిగిలో 5, కొడంగల్‌లో 2, వికారాబాద్‌లో  రెండు, చేవెళ్ల నియోజకవర్గంలో రెండు చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. బషీరాబాద్‌ మండలం జీవన్గీ సమీపంలో కాగ్నా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పూర్తయ్యే సమయంలోనే భారీ వర్షాలకు కాగ్నా నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. బొంరాస్‌పేట్‌లోని కాకరవేణి ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 30 శాతం పూర్తికాగా, పెద్దేముల్‌ మండలంలోని మన్‌సాన్‌పల్లి వద్ద వరద నీటితో చెక్‌ డ్యాం పనులు ప్రారంభించినా, తదనంతరం పనులు నిలిచిపోయాయి. కాగ్నా నదితోపాటు అన్ని ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గడంతో ఈనెలాఖరులో పెండింగ్‌లో ఉన్న 16 చెక్‌డ్యాంల పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

మూసీ, కాగ్నా, కాకరవేణి నదులపై చెక్‌డ్యాంలు..

కాగ్నా, మూసీ, కాకరవేణి నదులతోపాటు లక్నాపూర్‌ ప్రాజెక్టుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు. రూ.7.02 కోట్లతో తాండూరు మం డలంలోని ఎల్మకన్నె సమీపంలోని కాగ్నా నదిపై, రూ.5.60 కోట్లతో చిట్టిఘనపూర్‌ వద్ద కాగ్నానదిపై, రూ.3.04 కోట్లతో పెద్దేముల్‌ మండలంలోని మాన్‌సాన్‌పల్లి వద్ద కాగ్నానదిపై, రూ.7.64 కోట్లతో బషీరాబాద్‌ మండలం జీవన్గీ వద్ద కాగ్నా నదిపై, రూ.8.35 కోట్లతో యాలాల మండలంలోని కోకట్‌ వద్ద కాగ్నా నదిపై, రూ.4.91 కోట్లతో బషీరాబాద్‌ మండలంలోని క్యాద్గిరా వద్ద కాగ్నా నదిపై, రూ.4.97 కోట్లతో యాలాల మం డలం గోవిందరావుపేట్‌ సమీపంలోని కాకరవేణిపై, రూ.1.80 కోట్లతో పరిగి మండలం లఖ్నాపూర్‌ వద్ద పెద్దవాగుపై, రూ.1.24 కోట్లతో చిగురాల్‌పల్లి వద్ద చిన్నవాగుపై, రూ.1.60 కోట్లతో కుల్కచర్ల మండలం అంతారం వద్ద పెద్దవాగుపై, రూ.1.37 కోట్లతో పుట్టాపహాడ్‌ వద్ద పెద్దవాగుపై, రూ.1.76 కోట్లతో నవాబుపేటు మండలం గంగ్యాడ వద్ద, రూ.1.58 కోట్లతో ముబారక్‌పూర్‌ సమీపంలోని మూసీ నదిపై, రూ.2.32 కోట్లతో బొంరాస్‌పేట్‌ వద్ద కాకరవేణి వాగుపై, రూ.2.70 కోట్లతో తుంకిమెట్ల వద్ద కాకరవేణి వాగుపై, రూ.2.79 కోట్లతో మహంతిపూర్‌ సమీపంలోని కాకరవేణి ప్రాజెక్టుపై, రూ.1.37 కోట్లతో ధారూరు మండలం దోర్నాల్‌ పెద్దవాగుపై, రూ.1.80 కోట్లతో దోర్నాల్‌ వద్ద పెద్దవాగుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు.

మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 18 చెక్‌డ్యాంల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతాం. ఇప్పటికే 3 చెక్‌డ్యాంల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బషీరాబాద్‌ మండలంలోని జీవన్గీలో కాగ్నా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులు 80 శాతం పూర్తయ్యాయి. వీలైనంతా త్వరగా మిగితావి పూర్తి చేస్తాం.  - సుందర్‌, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి 


VIDEOS

logo