బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Dec 09, 2020 , 06:08:01

రైతులకు మద్దతుగా..

రైతులకు   మద్దతుగా..

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్నం పెట్టే రైతన్నకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా రైతన్నలకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతోపాటు కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. వీరితోపాటు రైతులు, కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు కూడా బంద్‌కు మద్దతుగా రాస్తారోకోలు పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోనూ అన్ని రకాల వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ యూనియన్లు కూడా రైతుల బంద్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి, జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి డిపోల నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కకపోవడం గమనార్హం.    టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతోపాటు శ్రేణులు భారీగా తరలివచ్చి ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. తాండూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, పరిగి పట్టణంతోపాటు కుల్కచర్ల, గండీడ్‌ మండలాల్లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే అనంద్‌, కొడంగల్‌ పట్టణంలో ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిలు బంద్‌లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీల్లో వామపక్షాలతోపాటు కాంగ్రెస్‌ నేతలు బంద్‌లో పాల్గొని రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్‌లో రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు భారత్‌ బంద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు జిల్లా అంతటా గట్టి బందోబస్తు నిర్వహించారు. వికారాబాద్‌, తాండూర్‌, పరిగి డీఎస్పీలతోపాటు ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది బందోబస్తులోపాల్గొన్నారు. 

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుండగా ..కేంద్ర మాత్రం వాళ్ల నడ్డివిరిచే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. సన్నబియ్యానికి బోనస్‌ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ మోకాలడ్డుతున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల స్టేజీ దగ్గర హైదరాబాద్‌-బెంగుళూరు జాతీయ రహదారిపై చేపట్టిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి,  పార్టీ జనరల్‌ సెక్రటరీ కేశవరావు, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలు హాజరు కాగా...జిల్లా మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి మహేశ్వరం మండలం తుక్కుగూడ శ్రీశైలం హైవేపై రాస్తారోకో నిరసనలో పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషాన్‌రెడ్డి, చేవెళ్ల లో ఎమ్మెల్యే యాదయ్య, చేవెళ్లలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే ఆమనగల్లులో జైపాల్‌ యాదవ్‌,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని ఆరాంఘర్‌ చౌరస్తాలో జరిగిన రాస్తారోకోలో పాల్గొన్నారు. రైతులు,ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. భారత్‌ బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రైతు కోసం జిల్లాలో జనం కదిలారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు సంఘీభావం తెలిపాయి. హైకోర్టు అడ్వకేట్‌ జేఏసీ సంఘాలతో 14 వామపక్షాల పార్టీలు ఆందోళనలో పాల్గొన్నాయి. 


VIDEOS

logo