మంగళవారం 26 జనవరి 2021
Vikarabad - Dec 06, 2020 , 02:21:26

మాజీ మంత్రి ‘కమతం’ కన్నుమూత

మాజీ మంత్రి ‘కమతం’ కన్నుమూత

  • కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం రాజకీయంగా 
  • ఉన్నత శిఖరాలు అధిరోహించిన నేత
  • సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎంపీ సంతాపం 

పరిగి : మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు కమతం రాంరెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురైన రాంరెడ్డి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 1938 నవంబర్‌ ఒకటవ తేదీన జన్మించిన ఆయన తన రాజకీయ జీవితంలో అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించడంతోపాటు ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా ఆయన పేరు సంపాదించారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

రెవెన్యూ శాఖ మంత్రిగా...

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పరిగి నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆయన 1972, 1989లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969లో ప్రభుత్వ చీప్‌విప్‌గా పనిచేసిన కమతం, 1977లో జలగం వెంగళ్‌రావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్‌, గిడ్డంగుల శాఖ మంత్రిగా, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి గా పనిచేసిన సమయంలోనే అప్పటి ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటగా డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు డైరెక్టర్‌గా రాంరెడ్డి పనిచేశారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన పరిగి నియోజకవర్గ అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. 2014లో కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతో బీజేపీలో చేరి, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల సమయంలో పరిగిలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో కమతం రాంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.  రాంరెడ్డి రాష్ట్ర రాజకీయాలలో పరిగి రాంరెడ్డిగా పేరుపొందారు. అప్పట్లో సొంత పార్టీ నాయకులంతా పరిగి రాంరెడ్డిగానే పిలిచేవారు. మరోవైపు పరిగి రాజకీయాలలో మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డిది గురుశిష్యుల బంధం. 1983 వరకు ఇరువురు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగగా, 1983 ఎన్నికల్లో హరీశ్వర్‌రెడ్డి స్వంతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాత ఇరువురు వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ గురుశిష్యుల భావంతోనే ఉన్నారు. 

‘కమతం’ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావు, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.మహేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలు  తమ సంతాపం ప్రకటించారు.  


logo