శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 06, 2020 , 02:21:21

భూ దస్త్రం.. భద్రంగా

భూ దస్త్రం.. భద్రంగా

2016కు ముందు పైళ్ల డేటా మొత్తం ధరణి పోర్టల్‌లోకి డీపీఎస్‌ఎం సైట్‌లోని దస్ర్తాలు అప్‌లోడ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైళ్లను ఆన్‌లైన్‌ చేస్తున్న మున్సిపల్‌ యంత్రాంగం వికారాబాద్‌ మున్సిపాల్టీలో పూర్తి తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాల్టీలో ముమ్మరం

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల్లోని దస్ర్తాలన్నీ ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. 2016కు ముందున్న భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్స్‌, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన దస్ర్తాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొం దుపరుస్తున్నారు. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన వివరాలన్నీ పక్కాగా ఉండేలా ధరణి పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. 2016 జూన్‌ తర్వాత డీపీఎస్‌ఎం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తూ వస్తున్న నేపథ్యంలో అంతకుముందు ఫైళ్లన్నీ మ్యానువల్‌గానే ఉన్న దృష్ట్యా అన్నింటిని డిజిటలైజేషన్‌ చేస్తున్నా రు. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్స్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ కు సంబంధించి ఫైళ్లన్నింటిని ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో పొం దుపరుస్తున్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపాలిటీల ద్వారా నిర్వహించే ప్రతీ ప్రక్రియను ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించిన దృష్ట్యా నెల రోజులుగా ఆన్‌లైన్‌ ప్రక్రియను చేపట్టారు. అయితే జిల్లాలోని వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఇప్పటికే ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి కాగా మిగతా తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో దస్ర్తాల ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

ధరణి పోర్టల్‌లో మున్సిపల్‌ డేటా...

మున్సిపాలిటీల్లోని భవన నిర్మాణ అనుమతుల దస్ర్తాలతోపాటు లే అవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన దస్ర్తాలను ధరణి పోర్టల్‌లో ఆయా మున్సిపాలిటీల టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది పొందుపరుస్తున్నారు. అయితే జిల్లాలో వికారాబాద్‌, తాండూరు మున్సిపాలిటీలుగా ఉండగా, గతంలో పంచాయతీలుగా ఉన్న పరిగి, కొడంగల్‌ పంచాయతీలు మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. పంచాయతీలుగా ఉన్న నాటినుంచి ఉన్న దస్ర్తాలన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతుల దస్త్రం ఇంటి యజమాని పేరు, ప్లాట్‌ నెంబర్‌, విస్తీర్ణం, సర్వే నెంబర్‌, కాలనీ పేరు, ఎప్పుడు అనుమతిచ్చారు, ఎన్ని అంతస్తులు తదితర వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. 

అయితే వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఇప్పటికే 2016జూన్‌కు ముందు ఉన్న ఫైళ్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చే ప్రక్రియను పూర్తి చేశారు. పరిగి మున్సిపాలిటీలో ఆన్‌ లైన్‌ ప్రక్రియ తుదిదశకు చేరుకోగా, తాండూరు, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో 50శాతం మేర వివరాలను ధరణి పోర్టల్‌ లో పొందుపర్చారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 2016 కు ముందుకు 2430 దస్ర్తాలు, 123 లే అవుట్లు, 995 ఎల్‌ఆర్‌ఎస్‌ దస్ర్తాలుండగా వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. పరిగి మున్సిపాలిటీలో 2700 దస్ర్తాలుండగా ఇప్పటివరకు 2200దస్ర్తాలను ధరణి పోర్టల్‌లో పొందుపర్చారు. తాండూరు మున్సిపాలిటీలో 3350 దస్ర్తాలుండగా ఇప్పటివరకు 50శాతం ఆన్‌లైన్‌ చేశారు. మరోవైపు 2020 మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపాలిటీల ద్వారా నిర్వహించే ప్రతీది ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహించాలనే నూతన చట్టం ప్రకారం వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. 2016 జూన్‌ తర్వాత డీపీఎస్‌ఎంలో పొందుపర్చిన డేటాను కూడా ధరణిలో పొందుపర్చనున్నారు. 

అంతేకాకుండా ఇకపై మున్సిపాలిటీల్లోని వ్యవసాయేతర భూములు, వాటి వినియోగం, ఇండ్ల నిర్మాణ అనుమతులు, యజమానుల పేర్లు, విస్తీర్ణం, చిరునామా, మొబైల్‌ నెంబర్లతోపాటు వారసుల వివరాలను ఎప్పటికప్పుడు ధరణి పోర్టల్‌లోనే పొందుపర్చే విధంగా ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. అంతేకాకుండా మున్సిపాలిటీల ద్వారా ఇచ్చే భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్‌ అనుమతులను ధరణి పోర్టల్‌ నిబంధనలకు అనుగుణంగానే మంజూరు చేయనున్నారు. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరుగకుండా పూర్తి పారదర్శకంగా ఉండేందుకుగాను ధరణి పోర్టల్‌ నిబంధనలకు అనుగుణంగా మున్సిపాలిటీల నిర్వహణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

VIDEOS

logo