ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలకు వచ్చే గర్భిణులకు భోజనం

- స్త్రీశిశు సంక్షేమ,వైద్యఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు
- రంగారెడ్డి జిల్లాలో మొత్తం గర్భిణులు 41,600
- వారానికి 1000-1500 మంది ఆసుపత్రులకు రాక
- ప్రభుత్వచొరువపై వెల్లువెత్తుతున్న హర్షాతిరేకాలు
ఇప్పటికే తల్లీ, పిల్లల ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గర్భిణుల కోసం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చేవారికి ఈ నెల 4 నుంచి ఆహారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 41,600 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరూ ప్రతీనెల ఆరోగ్య పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు వెళుతున్నారు. ఇలా దవాఖానలకు వచ్చేవారు ప్రతివారం దాదాపు 1000 నుంచి 1500 మంది దాకా ఉన్నట్టు అధికారులు వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ప్రతి సోమవారం, శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.. ఈ రోజుల్లో వారు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే సమయానికి భోజనం చేయలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారి ఆరోగ్యం కోసం ఈ వినూత్న కార్యక్రమం అమలుకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), 16 పట్టణ ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్సీ), 2 పీపీ యూనిట్స్, 2 సీహెచ్సీలలో ఈ ఆహారం అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల కారణంగా ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ప్రారంభించనున్న ఈ కార్యక్రమంతో మరింత ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే అవకాశం ఉంది.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్రప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు వచ్చేవారికి ‘ఆహారం’ అందించే ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ఉపకేంద్రాలు, దవాఖానల్లో వైద్యపరీక్షలు చేయించుకునే గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారం అందించే కార్యక్రమం డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 16 పట్టణ ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ), 2 పీపీ యూనిట్స్, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ఇందులో నూతనంగా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 1,380 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 220 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. రంగారెడ్డి జిల్లా స్త్రీ, శిశు, సంక్షేమ, వైద్యారోగ్యశాఖ ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గతంలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ మధ్యాహ్నం భోజనం అందించగా కరోనా నేపథ్యంలో కొద్ది నెలలుగా సరుకులను ఇంటికే పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.
వారంలో రెండు రోజులు...
ప్రతి నెలా గర్భిణులు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్ర దవాఖానలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రతి సోమ, శుక్రవారల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి దవాఖానలకు వస్తున్న గర్భిణుల్లో చాలామంది ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తీసుకోవడం లేదని అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. ఒక్కోసారి మధ్యాహ్నం వరకు వైద్య పరీక్షల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఇంటి నుంచి ఆహారం తీసుకుని గర్భిణులు ఇక్కట్లు పడుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారం అందించాలని నిర్ణయించారు.
ఆకుకూర, పప్పు, గుడ్డు..
అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులే ఆహారం తయారు చేసి దవాఖానలకు తీసుకెళ్లనున్నారు. అన్నం, ఆకుకూర, పప్పు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇవ్వనున్నారు. సిద్ధం చేసిన ఆహార పదార్థాలను దవాఖానలకు తీసుకెళ్లి వడ్డించాలని ఆదేశాలు అందాయి. దీనిపై ఇప్పటికే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య, స్త్రీ, శిశు, సంక్షేమశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం గర్బిణులు 41,600మంది ఉండగా, వారానికి 1000-1500 మంది గర్భిణులు దవాఖానలకు వస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరిస్తోంది. ఆయా దవాఖానల ద్వారా గర్భిణులు పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరందరీకీ ఆహారం అందించనున్నారు. ఏ ఆరోగ్య కేంద్రానికి ఎంతమంది గర్భిణులు పరీక్షల కోసం వస్తారనే సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఒక రోజు ముందుగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అందించే విధంగా ప్రణాళికలు రూపొదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత ఆ రెండు శాఖలపైనే ఉన్నది.
డిసెంబర్ 4 నుంచి జిల్లాలో ప్రారంభం
తాజావార్తలు
- ఓటీపీ వచ్చిందా.. రేషన్ తీసుకో..!
- వైభవంగా పెద జీయర్ స్వామి పరమ పదోత్సవం
- నిఘా కన్ను ఛేదనలో దన్ను
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్