ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

- వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 119 కేంద్రాలు ఏర్పాటు
- ఇప్పటివరకు 1,761 మంది రైతుల నుంచి 6,620 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
- కస్టమ్ మిల్లింగ్‌కు 42 రైస్ మిల్లులు
- తాండూరు, పరిగి, కొడంగల్, ధారూరులోని గోదాముల్లో స్టాక్ పాయింట్లు
- స్థానికంగా ఏర్పాటు చేయడంతో కలిసొస్తున్న రవాణా చార్జీలు
- హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
వికారాబాద్ జిల్లాలో పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనేందుకు ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 1,761 మంది రైతుల వద్ద నుంచి ఇప్పటివరకు 6,620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ‘ఏ’ గ్రేడ్‌కు రూ.1,888, కామన్ రకానికి రూ.1,868లు చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 119 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ 39, పీఏసీఎస్‌లు 48, డీసీఎంఎస్ 28, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యం 4 ఏర్పాటుచేశారు. జిల్లాలో వానకాలంలో 75 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ లెక్కన జిల్లాలో 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం అధికారులు జిల్లా వ్యాప్తంగా 42 రైస్ మిల్లులను గుర్తించారు. మిల్లింగ్ తర్వాత బియ్యాన్ని తాండూరు, పరిగి, కొడంగల్, ధారూర్లలోని గోదాముల్లో భద్రపర్చనున్నారు.
పరిగి : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొంటున్నది. గత యాసంగిలో వలె ఈసారి వానకాలం పంటలను సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ అందుకు తగిన విధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరిగింది. రైతులు పంటలు పండించేందుకు అవసరమైన పెట్టుబడి దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వరకు సర్కారు రైతుల వెన్నంటి నిలుస్తుంది. ఈసారి వానకాలం పంటలకు సంబంధించి ధాన్యం కొనుగోలుకు పెద్ద సంఖ్యలో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో వానకాలంలో 75వేల ఎకరాలలో వరి పంట సాగు చేయబడింది. ఈ లెక్కన జిల్లాలో 1.59 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రతి రైతు వద్ద నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలుకు సర్కారు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 119 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ ద్వారా 39, పీఏసీఎస్‌ల ద్వారా 48, డీసీఎంఎస్ ద్వారా 28, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సర్కారు ఈనెల 15 నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేపడుతుంది.
6,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు...
వికారాబాద్ జిల్లా పరిధి లో ఏర్పాటుచేసిన 119 కొనుగోలు కేంద్రాల ద్వా రా ఇప్పటివరకు 6,620 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేయడం జరిగింది. ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1,888, కామన్ రకానికి రూ.1,868లు చెల్లిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,761 మంది రైతుల వద్ద 6,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం పంపించడం జరిగింది. ఇపుడిపుడే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతుంది. విరివిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు తమ గ్రామాలలోనే ధాన్యం విక్రయించుకునేందుకు సర్కారు అవకాశం కల్పించింది. గతంలో మండలానికి ఒకటిరెండు కేంద్రా లు ఉండడంతో అక్కడికి వెళ్లి తమకు కేటాయించిన రోజులలో ధాన్యం తీసుకువెళ్లి విక్రయించేవారు. ప్రస్తుతం తమ గ్రామంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రవాణా భారం తగ్గిందని చెప్పవచ్చు. కొద్దిగా ఆలస్యంగానే పంటచేతికి రావడంతో కొద్ది రోజులుగా కొనుగోలు ఊపందుకున్నాయి. మరో పదిహేను రోజులలో జిల్లావ్యాప్తంగా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని అధికారులు చెబుతున్నా రు. ఈసారి వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సైతం ధాన్యం కొనుగోలుకు సర్కారు ఆదేశించింది. అలాగే పీఏసీఎస్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలుతో ఆయా సంస్థల ఆర్థిక పురోభివృద్ధికి సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు చేసిన సంస్థలకు మెట్రిక్ టన్ను చొప్పున కమీషన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా మరింత బలపడడానికి ఈ కొనుగోలు కేంద్రాలు దోహదం చేస్తాయి. మరోవైపు రైతు ముంగిటకే వెళ్లి కొనుగోలుతో రైతులకు మేలు కలుగుతుంది.
42 రైస్‌మిల్లుల గుర్తింపు...
రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 42 రైస్‌మిల్లులు గుర్తించారు. ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వాహనాల్లో రైస్‌మిల్లులకు తరలిస్తారు. సంబంధిత మిల్లులలో కస్ట మ్ మిల్లింగ్ తర్వాత బియ్యాన్ని కేటాయింపబడిన గోదాములకు చేరుస్తారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా బియ్యం స్టాక్ కోసం నాలుగు గోదాములను ఎంపిక చేయడం జరిగింది. తాండూరు, పరిగి, కొడంగల్, ధారూర్లలోని గోదాములలో కస్టమ్ మిల్లింగ్ తర్వాత బియ్యం స్టాకు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి స్టాక్‌పాయింట్ల ద్వారా నేరుగా ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సరఫరాకు తరలించడం జరుగుతుంది. రైస్‌మిల్లుల వారు కస్టమ్ మిల్లింగ్ అనంతరం గోదాములకు చేరవేసే బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు సైతం కలెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలలోని అధికారులు తరచూ గోదాములను సందర్శించి, ఆయా రైస్‌మిల్లుల నుంచి వచ్చిన బియ్యం నాణ్యతను పరిశీలించి ధ్రువీకరిస్తారు. తద్వారా బియ్యం మరింత నాణ్యమైనవి ప్రజలకు అందించడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఏదిఏమైనా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతాంగానికి మేలు చేకూరగా, త్వరలోనే కొనుగోలు ఊపందుకోనున్నాయని చెప్పవచ్చు.