ఆదివారం 17 జనవరి 2021
Vikarabad - Nov 28, 2020 , 04:10:29

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

తాండూరు రూరల్‌ : పేదల కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాలను విస్తృతంగా అధికారులు తీసుకుపోవాలని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏజెండాలోని 15 అంశాలను శాఖలవారీగా సమీక్ష చేశారు. కొత్లాపూర్‌ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ కట్ట లేకపోవడం వల్ల పశువులు ట్రాన్స్‌ఫార్మర్‌కు తాకి మృతి చెందుతున్నాయని సర్పంచ్‌ బుడెల్లి సాయిలు సమావేశం దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో వైర్లు వేలాడుతున్నాయని, వాటిని వెంటనే సరిచేయాలన్నా రు. కరణ్‌కోట గ్రామానికి గతంలో రూర్బన్‌ స్కీం కింద ఇండోర్‌ స్టేడి యం మంజూరైందని, ఎంపీటీసీ సభ్యులు వసంత్‌కుమార్‌ తెలిపారు. స్టేడియాన్ని అల్లాపూర్‌ గ్రామానికి ఎలా తరలిస్తున్నారని డీఈఈ వెంకట్‌రావును అడిగారు. మిషన్‌ భగీరథ పథకం కింద పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు కావాల్సి ఉందని చెంగోల్‌ సర్పంచ్‌ మల్లేశ్వరీగౌడ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ప్రశ్నించారు. అంగన్‌వాడీ భవనాలు ఏయే గ్రామాల్లో లేవో, ఆయా గ్రామాలవారీగా జాబితా తయారు చేయాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మూడు నెలల క్రితం జరిగిన సర్వసభ్య సమాశంలో ప్రస్తావించిన అంశాలను మళ్లీ సమావేశంలో ప్రస్తావించరాదని, వాటికి పరిష్కారం చూయించాలన్నారు. 

సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలను అధికారులు నోట్‌ చేసుకొని, వచ్చే సమావేశం నాటికి పూర్తి చేయించాలన్నారు. జినుగుర్తి పీహెచ్‌సీ పరిధిలోని 9 సబ్‌సెంటర్ల నిర్మాణాలకు రూర్బన్‌ స్కీం కింద నిధులు మంజూరయ్యారని, కేవలం మల్కాపూర్‌ గ్రామంలో మాత్రమే భవన నిర్మాణం పూర్తయిందని, మిగుతా 8 గ్రా మాల్లో ఇప్పటివరకు స్థలాలు చూయించలేదని డాక్టర్‌ అపూర్వ సమావేశం దృష్టికి తెచ్చారు. రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో స్థలాలు చూయించాలని ఎంపీపీ సంబంధిత అధికారులను కోరారు. ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు మంజుల మాట్లాడుతూ   సీఎం కేసీఆర్‌ ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ స్వరూప, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్‌ ధనుంజయ్‌, డీఈఈ వెంకట్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.