ఆదివారం 17 జనవరి 2021
Vikarabad - Nov 28, 2020 , 03:55:21

పన్ను రాబట్టడంలో వికారాబాద్‌ జిల్లా ముందంజ

పన్ను రాబట్టడంలో వికారాబాద్‌ జిల్లా ముందంజ

  • ఈ ఆర్థిక సంవత్సరం రూ.7.45 కోట్ల లక్ష్యం
  • ఇప్పటివరకు వసూలైంది రూ.7.33 కోట్లు
  • పన్ను రూపంలో రూ.6.58 కోట్లు, పన్నేతర రూ.47.43 లక్షలు
  • టార్గెట్‌లో 98శాతం పూర్తి
  • జిల్లావ్యాప్తంగా 1,78,226 కుటుంబాలు

ఆస్తి పన్ను వసూళ్లలో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జిల్లా పంచాయతీ శాఖ మే నెలలో పన్ను వసూలు ప్రారంభించగా.. ఇప్పటివరకు 98శాతం పన్నును రాబట్టి టాప్‌లో నిలిచింది. రూ.7.45కోట్ల లక్ష్యంతో రంగంలోకి దిగిన అధికారులు రూ.7.33కోట్లు వసూలు చేశారు. ఇందులో ఇంటి పన్ను రూ.6.58కోట్లు ఉండగా, పన్నేతర(నీటి, ఇంటి అనుమతి, ఆస్తి మార్పిడి, దుకాణ అనుమతి)కు సంబంధించి రూ.47.43లక్షలు ఉన్నాయి. 12 మండలాల్లో వందశాతం పన్ను వసూలైంది. అయితే జిల్లాలో  566 గ్రామ పంచాయతీలుండగా మొత్తం 1,78,226 కుటుంబాలు నివాసముంటున్నాయి. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆస్తి పన్ను వసూళ్లలో వికారాబాద్‌ జిల్లా దూసుకుపోతున్నది. రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలిచింది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతీ ఆర్థిక సంవత్సరంలోని మేలోనే సంబంధిత వసూలు చేయాల్సిన డిమాండ్‌ను తయారు చేసి అదే నెల నుంచి జూన్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ గడువులోగా ఆస్తి పన్ను వసూలు చేసి టాప్‌లో నిలిచింది. గతంలో ప్రతీ ఏడాది ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మాత్రమే పన్ను వసూలు చేసేవారు. అయితే నూతన చట్టం అమల్లోకి రావడం, ప్రతీ గ్రామానికి సరిపోనూ పంచాయతీ కార్యదర్శులను భర్తీ చేయడంతో రెండేండ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా ముందంజలో నిలుస్తున్నది. జిల్లాలో 6 మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో అక్టోబర్‌ నాటికే వంద శాతం ఆస్తి పన్ను వసూలు కావడం గమనార్హం. జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లాలో ఈ ఏడాది 98 శాతం ఇంటి పన్ను వసూలైంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.8.50 కోట్ల పన్ను బకాయిలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.8.04 కోట్ల పన్ను బకాయిలను వసూలు చేశారు. 

98 శాతం పన్ను వసూలు

జిల్లాలోని పంచాయతీల్లో 98 శాతం ఇంటి పన్ను వసూలైంది. జిల్లాలో 566 గ్రామ పంచాయతీలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7.45 కోట్ల పన్ను, పన్నేతర బకాయిలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇప్పటివరకు రూ.7.33 కోట్ల పన్ను బకాయిలను వసూలు చేయగా, మరో రూ.10 లక్షల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పన్ను బకాయిలకు సంబంధించి మొత్తం రూ.7.45 కోట్లుకాగా వీటిలో పన్ను బకాయిల లక్ష్యం రూ.6.61 కోట్లు, పన్నేతర బకాయిలు రూ.55.28 లక్షలుగా నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు ఇంటి పన్ను బకాయిలు రూ.6.58 కోట్లు, పన్నేతర(నీటి పన్ను, ఇంటి అనుమతి పన్ను, ఆస్తి మార్పిడి పన్ను, దుకాణ అనుమతి పన్ను తదితరాలు) బకాయిలు రూ.47.43 లక్షలు వసూలుచేశారు. జిల్లాలోని పరిగి, నవాబుపేట్‌, దౌల్తాబాద్‌, దోమ, మర్పల్లి, తాండూరు, బొంరాసుపేట్‌, పెద్దేముల్‌, బంట్వారం, కోట్‌పల్లి, వికారాబాద్‌, కొడంగల్‌ మండలాల్లో 100 శాతం ఇంటి పన్ను వసూలైంది. యాలాల్‌, ధారూరు, పూడూరు, మోమిన్‌పేట్‌, కులకచర్ల, బషీరాబాద్‌ మండలాల్లో 90 శాతానికి పైగా వసూలైనట్లు అధికారులు తెలిపారు. 

వసూలైన పన్నుల వివరాలు

పరిగి మండలంలో రూ.52.87 లక్షలు, నవాబుపేట మండలంలో రూ.42.06 లక్షలు, దౌల్తాబాద్‌ మండలంలో రూ.24.37 లక్షలు, దోమ మండలంలో రూ.33.37 లక్షలు, మర్పల్లి మండలంలో రూ.48.25 లక్షలు, తాండూరు మండలంలో రూ.94.07 లక్షలు, బొంరాసుపేట్‌ మండలంలో రూ.24.52 లక్షలు, పెద్దేముల్‌ మండలంలో రూ.36.97 లక్షలు, బంట్వారం మండలంలో రూ.17.48 లక్షలు, కోట్‌పల్లి మండలంలో రూ.23.27 లక్షలు, వికారాబాద్‌ మండలంలో రూ.31.61 లక్షలు, కొడంగల్‌ మండలంలో రూ.26.68 లక్షలు, యాలాల మండలంలో రూ.48.19 లక్షలు, ధారూర్‌ మండలంలో రూ.33.52 లక్షలు, పూడూర్‌ మండలంలో రూ.59.67 లక్షలు, మోమిన్‌పేట మండలంలో రూ.68.11 లక్షలు, కుల్కచర్ల మండలంలో రూ.40.97 లక్షలు, బషీరాబాద్‌ మండలంలో రూ.27.78 లక్షల పన్ను వసూళ్లయ్యింది. 

జిల్లానే టాప్‌...

ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా టాప్‌లో ఉంది. రెండేండ్లు గా జిల్లాలో దాదాపు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూలు పూర్తి చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం మరో సుమా రు రూ.10 లక్షల మేర వసూళ్లు పెండింగ్‌లో ఉన్నా యి. మరో 15 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నూతన పంచాయతీరాజ్‌ చట్టంతోపాటు అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించిన దృష్ట్యా గతంలో ఎన్నడూలేని విధంగా పన్ను బకాయిలు వసూలు అయ్యాయి.  - రిజ్వానా, డీపీవో, వికారాబాద్‌