శనివారం 23 జనవరి 2021
Vikarabad - Nov 27, 2020 , 04:25:38

పత్తి రైతులకు కూలీల కొరత

పత్తి రైతులకు కూలీల కొరత

పూడూరు : పత్తి పంట సాగు రైతులకు ఏటేటా కూలీల కొరతతో కష్టాలు తప్పడం లేదు. కురిసిన వర్షాలకు పత్తికాయలు కుల్లిపోయి పంట నష్టం వాటిల్లగా, ప్రస్తుతం కూలీల కొరత రైతులను వేదిస్తుంది. స్థానికంగా కూలీలు రాకపోవడంతో కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి కూలీలను రైతు లు తీసుకువస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావడంతో ప్రయాణ ఖర్చులు రైతులే చెల్లించాల్సి వస్తుంది. కిలో పత్తి తీసేందుకు కూలీలకు రూ.10నుంచి రూ.11 చెల్లిస్తే గాని పనికి రావడంలేదు. పత్తి పంట సాగుకు భూమిని చదును చేసినప్పనుంచి పత్తి కోత వరకు రైతులకు కష్టంతోపాటు పరేషాన్‌ తప్పడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సాగు చేసే పంటలకు ప్రతి ఏటేటా అధికంగా పెట్టుబడులు అవుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 

మండల పరిధిలో అధికంగా రైతులు పత్తి, మక్కజొన్న, కంది పంటలనే సాగుచేస్తున్నారు. మక్కజొన్న పంట సాగు రైతులకు యంత్రాల ద్వారా మక్క బుట్టల గింజలను తీసేందుకు అవకాశం ఉంది. నిరంతరం కష్టపడే పత్తిసాగు రైతులకు మాత్రం పత్తి తీసేందుకు కూలీలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. సకాలంలో పత్తి తీసేందుకు కూలీలు పనికి రాకపోవడంతో పొలంలో పత్తి నేలరాలిపోతుంది. పగిలిన పత్తిని సకాలంలో తీయకపోవడంతో పత్తి తూకం కూడా తగుతుందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం స్థానిక కూలీలు రాకపోవడంతో రైతులకు అధిక బారం పడుతుంది. ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులో కొంత ఆత్మవిశ్వాసం పెంచింది. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా వ్యవసాయ  పనులు చేయిస్తే కొంత రైతులకు కూలీల కొరత తగ్గుతుందని పేర్కొంటున్నారు. అలాగే కూలీల కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పత్తి కోత మిషన్లను సబ్సిడీపై రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.

పత్తి తీసే యంత్రాలు అందుబాటులోకి తేవాలి

కూలీల కొరత అధిగమించేలా పత్తి తీసే యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు సబ్సిడీపై అందజేయాలి. పత్తి సాగు రైతులు కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావడంతో అదనపు ఖర్చులతో పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. ఉపాధిహామీ కూలీలను రైతు వ్యవసాయానికి అనుసందానం చేయాలి. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాల మాదిరిగానే, పత్తి కోత మిషన్లను అందుబాటులోకి తెచ్చి సబ్సిడీపై ఇవ్వాలి. - ఎం.రాములు రైతు


logo