శనివారం 23 జనవరి 2021
Vikarabad - Nov 27, 2020 , 03:59:56

అంగన్‌వాడీల్లో ఆధార్‌...

అంగన్‌వాడీల్లో ఆధార్‌...

  • చిన్నారుల కోసం కేంద్రాల్లోనే ఏర్పాట్లు 
  • నమోదుపై ఇప్పటికే సూపర్‌వైజర్లకు శిక్షణ
  • ట్యాబ్‌ల పంపిణీ పూర్తి
  • ఆన్‌లైన్‌లో లబ్ధ్ధిదారుల వివరాలు 
  • పక్కాగా పౌష్టికాహారం పంపిణీ 
  • మరో వారంలో ప్రారంభించేందుకు చర్యలు 

అంగన్‌వాడీల్లోని చిన్నారులకు కేంద్రంలోనే ఆధార్‌ నమోదు చేసేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.  ఇప్పటికే పలు సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఆధార్‌ వివరాల నమోదు తప్పనిసరి కాగా,  పిల్లలకు పౌష్టికాహారం పంపిణీలోనూ ఈ విధానం అమలు చేసేందుకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఆధార్‌ నమోదుకు నిర్ణయించింది.  ఇప్పటికే సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చి ట్యాబ్‌లు కూడా అందజేసింది.  ఇక నుంచి లబ్ధిదారుల వివరాలు  ఆన్‌లైన్‌లో పొందుపర్చనుండడంతో అవకతవకలకు అడ్డుకట్ట పడనున్నది. రంగారెడ్డి జిల్లాలో మరో వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, జిల్లాలో 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1380 ప్రధాన, 220  మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 7 నెలల నుంచి 3 ఏండ్ల చిన్నారులు 88,987 మంది, 3-6 వయస్సుగల పిల్లలు 73,329 మంది విద్యనభ్యసిస్తున్నారు.  

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్‌ నమోదు చేపట్టింది. అంగన్‌వాడీల్లోనే నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం సూపర్‌ వైజర్లకు శిక్షణ ఇచ్చి ట్యాబ్‌లు అందజేశారు. దీని ద్వారా ఎంతమందికి ఆధార్‌ కార్డులు ఉన్నాయో తెలియడంతో పాటు పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పడనున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల అనంతరం రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో వారంలోపు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

పథకాల అమలులో ఆధార్‌ నమోదు

రంగారెడ్డి జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేండ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు.. విద్యా బుద్ధులు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటున్నది. స్త్రీ, శిశు సంక్షేమ పథకాల అమలులో ఆధార్‌ వివరాల నమోదు తప్పనిసరి చేయడంతో చిన్నారులకూ ఆధార్‌ అనివార్యమైంది. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఆధార్‌ నమోదు శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పక్కాదారి పట్టకుండా..

అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న చిన్నారులు, పాఠశాలలో చేరినా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వీరి పేర్లు, వివరాలు తొలగించడం లేదని తెలుస్తున్నది. అలాగే కొంతమంది గర్భిణుల వివరాలు అటు అత్తవారి దగ్గర, ఇటు తల్లిగారి ఇంటి దగ్గర నమోదు చేయించుకుంటున్నారు. ఒకరి పేరు రెండు ప్రాంతాల్లో ఉంటున్నది. దీంతో గర్భిణులు, బాలింతల లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉండే చాలా మంది పిల్లలకు ఆధార్‌ కార్డులు లేవు. దీంతో వీరి సంఖ్య పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పౌష్టికాహార పంపిణీలో స్పష్టత లేకుండా పోతున్నది. ఈ క్రమంలో పౌష్టికాహారం పక్కాదారి పట్టకుండా నివారణ చర్యలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ నేథప్యంలోనే పిల్లలందరికీ ఆధార్‌ నమోదు చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 

సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తి 

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆధార్‌ కార్డులు నమోదు చేయడానికి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, శేరిలింగంపల్లి, ఆమనగల్లు, మహేశ్వరం ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లకు ఇటీవల శిక్షణ ఇచ్చారు. అనంతరం వీరికి ప్రత్యేక ట్యాబ్‌లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసిన సూపర్‌వైజర్లు తమ తమ ప్రాజెక్టుల పరిధిలోని కేంద్రాలకు వెళ్లి ప్రతి రోజు 45 మంది పిల్లల ఆధార్‌ను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల ఫొటోలు తీయడంతో పాటు తల్లిదండ్రుల వేలిముద్రలను ఆధార్‌లో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చిన్నారులకు ఆధార్‌ నమోదు తప్పనిసరి

అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలందరికీ ఆధార్‌ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రాజెక్టుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాం. ప్రాజెక్టులోని ఆయా సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చాం. వీరు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి పిల్లల ఆధార్‌ను నమోదు చేయనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల తర్వాత మరో వారంలో ప్రారంభించనున్నాం. - మోతీ, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి


logo