సోమవారం 18 జనవరి 2021
Vikarabad - Nov 26, 2020 , 03:52:38

ఆర్గానిక్‌ పంటతో ఆరోగ్యం

ఆర్గానిక్‌ పంటతో ఆరోగ్యం

  • మేలురకం వంగడాలతో కూరగాయల  పంటల సాగు
  • మండలంలోనే మొదటి  ప్రయత్నంగా ఎకరా పొలంలో సాగు

కొడంగల్‌: ప్రతి రంగంలో లాభసాటి వ్యాపారాలకే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు కానీ ఆరోగ్య పరిరక్షణను గుర్తించడం లేదు. వ్యవసాయ రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పంటల అవసరం మేరకు కాకుండా అధిక దిగుబడి లక్ష్యంతో భారీగా క్రిమి సంహాకర మందులు వాడుతూ వ్యవసాయం చేస్తున్నారు. కొంత వరకు రైతు ఆర్థికంగా పెట్టుబడులతో పాటు ఆదాయం లభించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కృత్రిమ వ్యవసాయంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. విత్తనం సహజంగా మొలకెత్తడానికి ఆలస్యం అవుతుందని, నాటిన నాటి నుంచి మొలకెత్తి, ఏపుగా పెరిగి, పూత దశ, కాయ రాలకుండా పూర్తి స్థాయిలో పండే వరకు క్రిమి సంహారక మందులపైనే ఆధారపడుతున్నారు. సాధారణంగా నేడు అన్ని ధరలు పెరిగిపోయాయి. వాటికి అనుగుణంగా పోటీ పడుతూ ఈవిధంగా పండించుకోవాల్సి వస్తుంది. మోతాదుకు మించి మందులు వాడితే పొలం నిస్సారం అవుతుందనే అవగాహన ఉన్నప్పటికీ పెట్టుబడులతో పాటు లాభాలు ఆర్జించేందుకు తప్పడంలేదని పేర్కొంటున్నారు కొంతమంది రైతులు. ప్రస్తుత రోజుల్లో ఆర్గానిక్‌ సాగుపై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు మరికొందరు రైతులు. క్రిమి సంహారక మందుల వాడకం వల్ల అధికంగా ఆదాయాలు ఆర్జించినప్పటికీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటుంన్నామనే అవగాహన కొంత వరకు ఏర్పడింది. ఆర్గానిక్‌ సాగుపై అవగాహన ఏర్పడితే దాదాపు ఆ దిశగా పంటలు పండించుకునేందుకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశాన్ని ఎవరూ చేజార్చుకోరని, అవగాహన లేక అధిక దిగుబడులు పొందాలనే ఉద్దేశంతో కృత్రిమ సాగు వైపు రైతులు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు.

ఆర్గానిక్‌ సాగులో కూరగాయ పంటలు

మండలంలోని అంగడిరైచూర్‌ గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన నర్సింహారెడ్డి, ఆర్గానిక్‌ సాగు ద్వారా కూరగాయలను పండించేందుకు ఆసక్తి కనబరిచి, మొదటి సారి సాగు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఆర్గానిక్‌ సాగు చేయడం ప్రప్రథమంగా చెప్పుకోచ్చు. క్రిమి సంహారక మందు అవసరం లేకుండా నాణ్యతతో కూడిన కూరగాయలను పండించాలనే లక్ష్యంతో సాగు  చేస్తున్నట్లు రైతు తెలిపారు. వ్యవసాయంతో పాటు దాదాపు 15 ఏండ్ల వరకు ఇతరాత్ర వ్యాపారాలను కొనసాగించి, ఈ ఏడాది వ్యవసాయంలో నూతన ఒరవడిని తీసుకురావాలనే ఆకాంక్షతో సాగు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏ ఒక్కరైనా ఈ విధంగా సాగును ప్రారంభిస్తే కొంత మందిలో మార్పు వచ్చి ఆర్గానిక్‌ సాగు వైపునకు మొగ్గుచూపే అవకాశం ఉంటుందని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత రోజుల్లో పట్టణాల్లో ఆర్గానిక్‌ ఆహార వస్తువులపై వినియోగదారులు అధికంగా ఆసక్తిని చూపుతున్నారని, ధరలు కాస్త అధికంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఈ ఆహార వస్తువులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్గానిక్‌ దుకాణాలు ఏర్పాటు కాబడుతున్నట్లు తెలిపారు.  సాగు కోసం ప్రత్యేకంగా విత్తనాలను కొనుగోలు చేసి, పద్ధతి ప్రకారం వాటిని నాటినట్లు తెలిపారు. 

ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు.. 

ఆర్గానిక్‌ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రథమ ప్రయత్నంగా ఒక ఎకరా పొలాన్ని కేటాయించి ఆర్గానిక్‌ పంట సాగు చేస్తున్నాను. అవగాహన లేనప్పటికీ మొదటిసారిగా కొద్దిగా వంకాయ, టమాటా, ఉల్లిగడ్డ, మిరప పంటలు పండిస్తున్నాను. ప్రస్తుతం టామాట కాత కాస్తున్నది. కాసిన టమాటా నేలకు తాకి పాడవకుండా ప్రత్యేకంగా మొక్కలకు సపోర్టుగా కట్టెలు ఏర్పాటు చేశాను. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నది. మరో 10 నుంచి 15 రోజుల్లో టమాటా అమ్మకానికి చేతికి వస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి క్రిమి సంహారక మందుల వాడలేదు. కాగా అక్కడ అక్కడ కాయ కాస్త పాడవుతుంది. ఈ సారి పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడితే పెద్ద మొత్తంలో సాగు చేస్తాను. - నర్సింహారెడ్డి, రైతు, అంగడిరైచూర్‌. కొడంగల్‌