ఆదివారం 17 జనవరి 2021
Vikarabad - Nov 25, 2020 , 03:40:58

అటవీ సంరక్షణకు రూ.35 కోట్లు

అటవీ సంరక్షణకు రూ.35 కోట్లు

  • వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 25 బ్లాకుల్లో రక్షణ చర్యలు
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు 
  • 44 కిలోమీటర్లలో ఫెన్సింగ్‌, 100 కిలోమీటర్లలో కందకాలు తవ్వేందుకు నిర్ణయం
  • అనంతగిరి ఫారెస్ట్‌లో  రూ.4.50 కోట్లతో 17 కి.మీ కంచె..
  • ఇప్పటికే టెండర్లు పూర్తి
  • అడవిలో  చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతల నిర్మాణం
  • మార్చిలో టెండర్లు, ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు
  • అటవీ భూముల హద్దుల ఏర్పాటుకు సర్వే షురూ

వికారాబాద్‌ జిల్లాలో అటవీ సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల అడవి ఉండగా,  95 బ్లాకులు ఉన్నాయి. కబ్జాల చెర నుంచి అటవీ భూములను కాపాడేందుకు రూ.35 కోట్లతో జిల్లా అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తం 25 బ్లాకుల్లో 44 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌తోపాటు 100 కిలీమీటర్ల వరకు కందకాలు తవ్వాలని నిర్ణయించింది. అలాగే అనంతగిరి ఫారెస్ట్‌లో రూ.4.50 కోట్లతో 17 కి.మీటర్ల కంచె ఏర్పాటుకోసం అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. వన్య ప్రాణులకు నీటి వసతి కల్పించేందుకు అక్కడక్కడా చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం మార్చిలో టెండర్లను పూర్తి చేసి, ఏప్రిల్‌లో పనులు ప్రారంభించనున్నారు. ఇక అటవీ భూముల హద్దుల ఏర్పాటుకు సర్వే చేస్తున్నారు. 

వికారాబాద్‌ : జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణకుగాను ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం కబ్జాలకు గురికాకుండా ఫెన్సింగ్‌, కందకాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మరోవైపు వన్యప్రాణులు, పక్షుల కోసం ఎప్పటికీ నీటి నిల్వలు ఉండే లా చెక్‌డ్యాంలు, ఇంకుడు, నీటి ఊట గుంతలను తవ్వనున్నారు. ఇప్పటికే అనంతగిరి అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా ఒప్పంద దశలో ఉంది. త్వరలో పనులు కూడాప్రారంభం కానున్నాయి. ఇకముందు అటవీ భూములు కబ్జాకు గురికాకుండా సర్వే చేయించి, వాటికి హద్దులు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నవాబుపేట్‌ మండలంలోని ఏక్‌మామిడి గ్రామంలో ఉన్న అటవీ ప్రాంతంలో అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా తదనంతరం జిల్లా అంతటా సర్వే నిర్వహించి అటవీ భూములు ఇకపై అన్యాక్రాంతం కాకుండా హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.35 కోట్లతో ఫెన్సింగ్‌, కందకాలు

జిల్లాలోని అటవీ ప్రాంత సంరక్షణకు తగు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాలుండగా, 95 బ్లాకులు ఉన్నాయి. అయితే జిల్లా అంతటా అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఫెన్సింగ్‌తోపాటు కందకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అనంతగిరి అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్‌కు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. కాగా మరికొన్ని ఒప్పంద దశలో ఉన్నాయి. త్వరలో పనులు కూడా ప్రారంభంకానున్నాయి. అనంతగిరి అటవీ ప్రాంతంలోని 17 కిలోమీటర్లలో రూ.4.50 కోట్లతో ఫెన్సింగ్‌, కందకాల తవ్వకాలు ఏర్పాటు చేయనున్నారు. అనంతగరితోపాటు జిల్లాలోని ఇతర అటవీ ప్రాంతాల్లోనూ ఫెన్సింగ్‌, కందకాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అటవీ భూముల కబ్జాలతోపాటు వన్యప్రాణులను వేటాడుతుండడంతో అటవీ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా దామగుండం అటవీ ప్రాంతంలో నిత్యం గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణులను వేటాడుతూనే ఉంటారు. ఇటీవల వన్యప్రాణులను వేటాడడంలో భాగంగా అటవీ ప్రాంతలో మేతకు వెళ్లిన ఆవులపై కాల్పులు జరిగిన సంఘటన తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి జిల్లాలోని 95 బ్లాకుల్లో ఫెన్సింగ్‌, కందకాలు నిర్మించనున్నారు. సంబంధిత 25 బ్లాకుల్లో 44 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌, 100 కిలోమీటర్ల మేర కందకాలను తవ్వనున్నారు. ఇందుకుగాను రూ.35 కోట్లతో జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రెండు, మూడు రోజుల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను అందజేయనున్నారు. అయితే ఫెన్సింగ్‌, కందకాల ఏర్పాటుకుగాను కంపా(అడవులను మళ్లించడంతో వచ్చే నిధులు) నిధులను వినియోగించనున్నారు.

అటవీ ప్రాంతంలో చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు

అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు పెంచడంపై జిల్లా అటవీ శాఖ దృష్టి సారించింది. అటవీలోని వాగులున్న ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఇంకుడు, నీటిఊట గుంతలను నిర్మించేందుకు నిర్ణయించారు. అటవీ ప్రాంతాల్లోని వన్యప్రాణులు వేసవికాలంలో తాగునీటి కోసం వచ్చిన సంఘటలున్నాయి. కొన్ని వన్యప్రాణులు రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాయి. ఇలా ఇప్పటివరకు పదికిపైగా జింకలు ప్రమాదానికి గురై మృతిచెందిన సంఘటలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అటవీ శాఖ అధికారులు చెక్‌డ్యాంలు, నీటిఊట గుంతలు, ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. అటవీ ప్రాంతాల్లోని కాలువలపై రాతికట్టాలు, చిన్నకుంటలు, పెద్ద కుంటలను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటికిగాను ఉపాధిహామీ నిధులతో  పనులు చేపట్టనున్నారు. 

హద్దుల ఏర్పాటుకు సర్వే షురూ

జిల్లావ్యాప్తంగా అటవీ భూములకు సంబంధించి సర్వే చేపట్టారు. జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో అటవీ భూములుండగా, 40 వేల ఎకరాల అటవీ భూములు కబ్జాలో ఉన్నాయి. కబ్జాలకు పాల్పడిన వారు ప్రతిఏటా కొంత అటవీ భూభాగాన్ని దున్నుతూ సాగు భూమిగా మారుస్తూ కబ్జా చేస్తున్నారు. జిల్లాలో కబ్జాకు గురైన అటవీ భూములతోపాటు మిగతా భూములన్నింనీ సర్వే చేయనున్నారు. సర్వే అనంతరం సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అటవీ భూములు ఎంతవరకు ఉన్నాయనేది నిర్ణయించి ప్రత్యేకంగా హద్దులను ఏర్పాటు చేయనున్నారు. అయితే అటవీ భూములకు హద్దులు ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో కబ్జాలకు చెక్‌ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. జిల్లా అటవీ శాఖతోపాటు రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుంది. ప్రస్తుతం జిల్లాలోని నవాబుపేట్‌ మండలం ఎక్‌మామిడిలోని అటవీ ప్రాంతంలో సర్వే కొనసాగుతునది. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 1191 కిలోమీటర్లలో అటవీ భూములకు హద్దులున్నాయి.