గురువారం 03 డిసెంబర్ 2020
Vikarabad - Nov 22, 2020 , 04:05:32

ఉపాధి హామీ పనుల కోసం ప్రణాళిక

ఉపాధి  హామీ పనుల కోసం  ప్రణాళిక

  • 2021-22 ఆర్థిక సంవత్సరానికి 1.03 కోట్ల పనిదినాలు కల్పించడమే లక్ష్యం
  • కూలీలందరికీ వంద రోజుల పని కల్పించేందుకు డీఆర్‌డీఏ చర్యలు
  • వికారాబాద్‌ జిల్లాలో 1,84,455 జాబ్‌కార్డులు.. 2,16,349 మంది ఉపాధి హామీ కూలీలు
  • ఈ ఆర్థిక సంవత్సరం కోటి పని దినాలు టార్గెట్‌
  • ఇప్పటివరకు 60.80లక్షలు పూర్తి 
  • వందరోజులు పని చేసిన కుటుంబాలు 7,642 

2021-22 ఆర్థిక సంవత్సరానికి  ఉపాధి హామీ పనుల కోసం  వికారాబాద్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో 1,84,455 జాబ్‌ కార్డులుండగా..  2,16,349 కూలీలు ఉన్నారు.  వీరందరికి కలిపి వచ్చే ఏడాది మొత్తం 1.03కోట్ల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేశారు. ఉపాధి ప్లాన్‌ ఆమోదం నిమిత్తం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు అందజేయనున్నారు.  ఈ ఆర్థిక సంవత్సరం కోటి పని దినాలు టార్గెట్‌ పెట్టుకోగా..  ఇప్పటివరకు 60.80లక్షలు పూర్తి చేశారు. 7,642 కుటుంబాలు వందరోజుల పనిని సద్వినియోగం చేసుకున్నాయి.   ఉపాధి పనిలో  జిల్లా ఆరోస్థానంలో నిలిచింది.  

వికారాబాద్‌ : 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఉపాధిహామీ పనులకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం పని దినాలను పెంచుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేశారు. ఈ ఏడాది కోటి పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, వచ్చే సంవత్సరానికి 3 వేల పని దినాలను పెంచుతూ కోటి 3వేల పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. అయితే ఉపాధి ప్లాన్‌ ఆమోదం నిమిత్తం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు ఈనెలాఖరులోగా అందజేయనున్నారు. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతీ ఒక్క కూలీకి వందరోజులపాటు పని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు వంద రోజుల పని కల్పనలో జిల్లాను టాప్‌-5లో ఉండే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం కోటి పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 60.80 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క కూలీకి వందరోజులపాటు పని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా,..వంద రోజుల పని కల్పించడంలోనూ జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. ఉపాధిహామీ పనులకు హాజరయ్యే కూలీలకు అదనంగా కూలీ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ ఉపాధిహామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.237లను అందజేస్తున్నారు.

కోటి 3 వేల పనిదినాలు టార్గెట్‌...

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కోటి 3 వేల పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌గా నిర్ణయించింది. ఈ ఏడాది కోటి పనిదినాలను కల్పించాలని టార్గెట్‌గా నిర్ణయించగా,...వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం 3 వేల పనిదినాలను పెంచడం గమనార్హం. మూడేళ్లుగా జిల్లాలో ఉపాధిహామీ పనులకు హాజరు అవుతున్న కూలీల సంఖ్యను, పనులను బట్టి ప్రభుత్వం జిల్లాలో పని దినాల టార్గెట్‌ను పెంచుతూ నిర్ణయించింది. ముఖ్యంగా రెండేళ్లుగా వంద రోజుల పని పూర్తి చేసుకున్న అనంతరం అదనంగా పని దినాలను కల్పించడంతో పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని పనిదినాలను పెంచుతూ నిర్ణయించారు. అదేవిధంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు సంబంధించి కూలీలందరికీ వందరోజుల పనిదినాలను కల్పించాలని డీఆర్‌డీఏ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను కోటి పనిదినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌గా నిర్ణయించగా ఇప్పటివరకు 60.80 లక్షల పనిదినాలను కల్పించడం జరిగింది. అత్యధికంగా ధారూర్‌ మండలంలో ఉపాధిహామీ కూలీలకు పనిని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.151.70 కోట్లను ఖర్చు చేశారు, వీటిలో కూలీల వేతనాలకు సంబంధించి రూ.109.67కోట్లను ఖర్చు చేయగా, మెటీరియల్‌ నిమిత్తం రూ.37.40 కోట్లను వెచ్చించడం జరిగింది. 

7642 మందికి వందరోజుల పని ...

ఈ ఆర్థిక సంవత్సరం జిల్లావ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు వంద రోజుల పనిని కల్పించారు. జిల్లాలో ఇప్పటివరకు 7642 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న కుటుంబాల్లో అత్యధికంగా ధారూర్‌ మండలంలో 942 కుటుంబాలు, మర్పల్లి మండలంలో 788,  కుటుంబాలు, నవాబుపేట్‌ మండలంలో 624 కుటుంబాలు, వికారాబాద్‌ మండలంలో 582 కుటుంబాలు, మోమిన్‌పేట్‌ మండలంలో 364 కుటుంబాలు, పెద్దేముల్‌ మండలంలో 408 కుటుంబాలు, బషీరాబాద్‌ మండలంలో 439 కుటంబాలు, బంట్వారం మండలంలో 340 కుటుంబాలు, పరిగి మండలంలో 403 కుటుంబాలు, కొడంగల్‌ మండలంలో 460 కుటంబాలు, యాలాల మండలంలో 354 కుటుంబాలు, కోట్‌పల్లి మండలంలో 340, కుల్కచర్ల మండలంలో 311, పూడూర్‌ మండలంలో 293, తాండూరు మండలంలో 211, దౌలతాబాద్‌ మండలంలో 233, దోమ మండలంలో 279, బొంరాసుపేట్‌ మండలంలో 279 కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించారు. అదేవిధంగా జిల్లాలో ఈ ఏడాది ఉపాధిహామీ పథకం ద్వారా ప్రధానంగా ప్రకృతి వనాలు, హరితహారంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అంతేకాకుండా అసైన్డ్‌ భూముల్లోని రాళ్లను తీయడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం చేపట్టనున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, అజాల్ల పశువుల మేత పెంపకం, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ కాలువలో పూడికతీత పనులు చేస్తున్నారు.

అందరికీ ఉపాధి...

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలందరికీ ఉపాధి కల్పించడమే ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది ప్రధానంగా ప్రకృతి వనాల పనులతోపాటు తెలంగాణకు హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనులకు ప్రాధాన్యతనివ్వనున్నాం. అంతేకాకుండా అర్హులైన ప్రతీ ఒక్క కూలీకి 100రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.- కృష్ణన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి