ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Nov 17, 2020 , 04:22:58

ఆర్టీసీలో ఆనందం...

ఆర్టీసీలో ఆనందం...

  • కరోనా సమయంలోని ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు నిర్ణయం
  • నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • వికారాబాద్‌ జిల్లాలో 1108 మంది ఉద్యోగులురూ.3.70 కోట్ల బకాయిలను చెల్లించనున్న ప్రభుత్వం
  • జిల్లాలో నెలకు రూ.4.50 కోట్ల ఆదాయం
  • కార్గో సేవల ద్వారా రూ. 10 లక్షల రాబడి
  • బకాయిల చెల్లింపుపై ఆర్టీసీ ఉద్యోగుల హర్షం  
  • సీఎం కేసీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసిన ఉద్యోగులు

ఆర్టీసీకి అండగా ఉంటూ ఉద్యోగులను కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సమయం లోని బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశాలివ్వడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో పాటు బస్సుల సంఖ్యను పెంచడం, లాభాలబాట పడుతున్న కార్గో సేవలను మరింత విస్తృతం చేయడం లాంటి నిర్ణయాలను స్వాగతిస్తూ పలుచోట్ల కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 1108 మంది ఆర్టీసీ ఉద్యోగులుండగా, వారికి బకాయిల కింద రూ.3.70 కోట్లు  చెల్లించనున్నారు. జిల్లా నుంచి నెలకు రూ.4.50 కోట్ల ఆదాయం వస్తుండగా, కార్గో సేవల నుంచి రూ.10 లక్షల రాబడి వస్తున్నది. -  వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

ప్రభుత్వం చొరవతోనే ప్రగతి పథంలోకి...

ఆర్టీసీని లాభాల బాటలో నడిపించే బాధ్యత తీసుకోవడమే కాకుండా, దానిని సమర్థవంతంగా అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. కరోనా సమయంలో కోత విధించిన జీతంలోని బకాయిలు చెల్లించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను తమ పిల్లల లాగా భావించి శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారు. బకాయిల చెల్లింపు ప్రకటనతో ఊరూ..వాడా సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. ..పి.అరుణ కండక్టర్‌, పరిగి 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్టీసీకి అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో రెండు నెలలపాటు కోత విధించిన 50 శాతం వేతనాన్ని చెల్లించేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీచేశారు. సీఎం సూచనల మేరకు బస్సుల సంఖ్య కూడా పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు బస్‌డిపోల్లో ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 

జిల్లాకు రూ.3.70 కోట్ల బకాయిలు

కొవిడ్‌ సమయంలో ఆర్టీసీ బస్సులు నడువక పోవడంతో  ఉద్యోగులకు రెండు నెలలపాటు వేతనాల్లో సగం కోత విధించారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి డిపో పరిధుల్లోని 1108 మంది ఉద్యోగులున్నారు. వీరికి రెండు నెలల బకాయిలు మొత్తం రూ.3.70 కోట్లను ప్రభుత్వం త్వరలో చెల్లించనున్నది. తాండూరు డిపోలో 403 మందికి రూ.1.44 కోట్లు, పరిగి డిపోలో 353 మందికి రూ.1.04 కోట్లు, వికారాబాద్‌ డిపోలో 352 ఉద్యోగులకు రూ.1.20 కోట్ల బకాయిలు విడుదల కానున్నాయి. కష్టాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని పెద్ద మనస్సుతో ఆదుకోవడంపై సంబంధిత ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నెలకు రూ.4.50 కోట్ల ఆదాయం...

జిల్లాలో ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతున్నది. రెండు నెలల క్రితం వరకు రూ.2 కోట్లుగా ఉన్న ఆదాయం గత నెల నుంచి పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం మూడు డిపోల ద్వారా రూ.4.55 కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరుతున్నది. వికారాబాద్‌ డిపోలో రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్లు, పరిగి డిపోలో రోజుకు రూ.6.50 లక్షల చొప్పున నెలకు రూ.1.95 కోట్లు, తాండూరు డిపో ద్వారా రోజుకు రూ.7 లక్షల చొప్పున నెలకు రూ.2.10 కోట్ల రెవెన్యూ సమకూరుతున్నది. గతంలో వికారాబాద్‌, తాండూరు, పరిగి డిపోల ద్వారా రూ.8 నుంచి రూ.10 కోట్లుగా ఉన్న ఆర్టీసీ రెవెన్యూ కొవిడ్‌తో సగానికిపైగా తగ్గింది. జిల్లావ్యాప్తంగా 123 రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, పరిగి డిపోలో 46 రూట్లు, తాండూరులో 37 రూట్లు, వికారాబాద్‌లో 40 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. పరిగి డిపోలో 24 రూట్లలో కొంతమేర లాభభాలుండగా, మిగతా రూట్లలో నష్టాలు వస్తున్నాయి. తాండూరు పరిధిలో 12 రూట్లలో లాభాలొస్తుండగా, 25 రూట్లలో నష్టాలతోనే నడిపిస్తున్నారు. వికారాబాద్‌ పరిధిలో 14 రూట్లలో మాత్రమే కొంతమేర లాభాలొస్తున్నాయి. మిగతా 26 రూట్లలో పూర్తి నష్టాలు వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఆయా డిపోల నుంచి హైదరాబాద్‌, గుల్బర్గా, మహబూబ్‌నగర్‌, కుంట, మెహిదీపట్నం, యాద్గిర్‌, మంత్రాలయం, సదాశివపేట్‌, పరిగి- వికారాబాద్‌, సదాశివపేట్‌ రూట్లలో ఆర్టీసీకి లాభాలు వస్తున్నాయి. మరోవైపు కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీకి అదనంగా ఆదాయం సమకూరుతుంది. వికారాబాద్‌, తాండూరు, పరిగి డిపోల పరిధిలోని కార్గో బస్సుల ద్వారా నెలకు సుమారు రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
VIDEOS

logo