మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Nov 13, 2020 , 03:52:11

ధరణికి విశేష స్పందన

ధరణికి విశేష స్పందన

  • నిన్న ఒక్కరోజు రంగారెడ్డి జిల్లాలో 126, వికారాబాద్‌ జిల్లాలో 84 రిజిస్ట్రేషన్లు
  • అరగంటలోనే ప్రక్రియ పూర్తి
  • సందడిగా తాసిల్దార్‌ కార్యాలయాలు
  • రోజురోజుకూ రెట్టింపవుతున్న స్లాట్‌ బుకింగ్‌లు 

షాబాద్‌: రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో భూముల రిజిస్ట్రేషన్లు సులువుగా, సులభంగా జరుగుతున్నాయి. రోజులు, నెలల తరబడి అయ్యే పనులన్నీ నిమిషాల వ్యవధిలో పూర్తవుతున్నాయి. గతంలో మాదిరి భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కార్యాలయాల చుట్టూ, వ్యక్తుల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రైతులు, పేదలు, అందరూ లబ్ధిపొందుతునన్నారు. ఒక రోజు ముందుగానే మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు సంబంధిత జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ (తాసిల్దార్‌) కార్యాలయానికి వచ్చి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పని ముగించుకుని వెళ్తున్నారు. గురువారం రంగారెడ్డిజిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 126 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. చేవెళ్ల డివిజన్‌లోని షాబాద్‌లో 8, చేవెళ్ల 10, మొయినాబాద్‌లో 6, శంకర్‌పల్లిలో 8, షాద్‌నగర్‌ డివిజన్‌లోని ఫరూఖ్‌నగర్‌లో 8, కేశంపేట్‌లో 4, నందిగామలో 8, కొందుర్గు 10, చౌదరిగూడ 5, కొత్తూర్‌ 2, ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని ఇబ్రహీంపట్నంలో 6, మంచాల 1, యాచారం 12, అబ్దుల్లాపూర్‌మేట్‌ 7, కందుకూర్‌ డివిజన్‌ పరిధిలోని ఆమన్‌గల్‌లో 5, మాడ్గుల 10, తలకొండపల్లి 8, కడ్తాల్‌ 8 చొప్పున రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. 

వికారాబాద్‌ జిల్లాలో  84 రిజిస్ట్రేషన్లు

వికారాబాద్‌: జిల్లా వ్యాప్తంగా గురువారం ధరణి పోర్టల్‌లో 84 రిజిస్ట్రేషన్లు అయినట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా బంట్వారంలో 1, బషీరాబాద్‌లో 6, బొంరాస్‌పేటలో 5, ధారూరులో 5, దోమలో 1, దౌలతాబాద్‌లో 3, కొడంగల్‌లో 6, కోటపల్లిలో 4, కులకచర్లలో 6, మర్పల్లిలో 8, మోమిన్‌పేటలో 6, నవాబుపేటలో 2, పరిగిలో 5, పెద్దేముల్‌లో 4, పూడూరులో 6, తాండూరులో 7, వికారాబాద్‌లో 8, యాలాలలో 1 రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేశారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు సులువుగా, సులభంగా జరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రైతులకు ఎంతో మేలు 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి తిరుగాల్సిన పరిస్థితులు ఉండేది. డాక్యుమెంట్‌ రైటర్ల సాయంతో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకునేవాళ్లం. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ఎంతో ప్రజాదరణ పొందుతున్నది. దీంతో ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని, మరుసటి రోజు తాసిల్దార్‌ కార్యాలయానికి వెళితే 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ఆవకాశం కల్పించడం సంతోషకరం. రైతులందరూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. - గాదం సత్తయ్య, రైతు, షాబాద్‌

సమస్య పరిష్కారం

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో మా రిజిస్ట్రేషన్‌ సమస్య పరిష్కారమైంది. తాసిల్దార్‌ కార్యాలయంలో పనుల సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధరణి పోర్టల్‌ను ఒక వరంలా అందించింది. ఎటువంటి భూ సమస్య లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిమిషాల్లోనే నమూనా పాస్‌ బుక్‌ అందిస్తున్నారు. 4.19 ఎకరాల భూమిని ముగ్గురం కలిసి కొనుగోలు చేశాం. ముందురోజు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం. ఆ తర్వాత రోజు  గురువారం ఒక్కొక్కరి పేరుపై సమానంగా కొన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాం. ఇంత సులువుగా రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుందనుకోలేదు. - మణికంఠ, అత్తాపూర్‌, హైదరాబాద్‌

దళారులకు చెక్‌

తాసిల్దార్‌ కార్యాలయంలో భూముల కొనుగోలు, అమ్మకాలు చేపట్టేందుకు తీసుకొచ్చిన నూతన విధానం ధరణి పోర్టల్‌ చాలా బాగున్నది.
ఈ పోర్టల్‌ ద్వారా మా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. గతంలో భూముల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగేవి. ఇందుకు నెలలు గడిచేవి. అంతేకాకుండా దళారులు లేకుండా రిజిస్ట్రేషన్‌ అయ్యేది కాదు. రైటర్‌కు, మధ్యవర్తులకు ముట్టజెప్పందే పని జరిగేది కాదు. ఇప్పుడు మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దళారులకు చెక్‌ పడింది. దీంతో రైతులకు మేలు జరుగుతోంది.- బెల్కటూరు రమేశ్‌, తాండూరు

రైతులకు మేలు

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌తో రైతులకు మేలు జరుగుతున్నది. కార్యాలయంలో తగువులు, వివాదాలు, కోర్టు కేసులు ఉన్న భూములను అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడంలేదు. క్లియర్‌ టైటిల్‌ ఉన్న భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నేను కాకునూరు పరిధిలో కొనుగోలు చేసిన 4 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ చాలా పారదర్శకంగా జరిగింది. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు పూర్తైన తరువాత పాసుబుక్కులు రిజిష్టర్‌ పోస్టులో రైతు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏమైనా కేసీఆర్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతున్నది. - అల్లం చిన్నపరెడ్డి, రైతు, సుందరాపురం, కేశంపేట మండలం

సులువుగా క్రయవిక్రయాలు

భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు సులువుగా, సులభంగా చేసుకునేందుకు ధరణి పోర్టల్‌తో మంచి అవకాశం లభించింది. గతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం పరిగికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్తుండేవాళ్లం. నెలల తరబడి తిరిగెటోళ్లం. కాని సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఇలాంటి మంచి నిర్ణయం వల్ల సొంత మండలంలోనే భూముల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాం. అన్ని లావాదేవీలు నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే చేస్తున్నారు. మధ్యవర్తి లేకపోవడంతో ఎవరికీ డబ్బులివ్వాల్సిన పనిలేదు.  మాలాంటి రైతుకు ధరణి ఎంతగానో ఉపయోగపడుతుంది. - నక్క నర్సింలు రైతు, పీరంపల్లి, కులకచర్ల మండలం

సేవలు మంచిగున్నాయి

ధరణి సేవలు మంచిగున్నాయి. గతంలో భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే ఎంతో ఇబ్బంది పడేటోళ్లం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరిగి, అలిసిపోయినా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు పనులు వేగంగా పూర్తవుతున్నాయి. తాసిల్దార్‌ కార్యాలయాలకు వెళ్లిన అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతున్నది. వెంటనే సంబంధిత పత్రాలు అందజేస్తున్నారు. ఇంత తొందరగా పట్టాపాసు పుస్తకంలో రాసివ్వడం గతంలో లేదు. ప్రస్తుతం వ్యవసాయ భూములకు సంబంధించి పూర్తి వివరాలు మొబైల్‌లో చూసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వంకు, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రైతులకు తెలంగాణ సర్కార్‌ చేస్తున్న మేలు జన్మలో మరవనిది. - పగిడ్యాల్‌ నర్సింహులు,  తాండూరు

రైతు కండ్లలో ఆనందం

తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వల్ల రైతుల కండ్లలో ఆనందం కనిపిస్తున్నది. కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ఒకచోటే, ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కావడం వల్ల ఇబ్బందులు తప్పాయి. గతంలో ఎవరైనా భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే పాసుబుక్కుల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతున్నది. అంతేకాకుండా మ్యుటేషన్‌, తదితర కాగితాలన్నీ వెంటనే ఇచేస్తున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నోళ్లకు జిరాక్స్‌ కాపీలు ఇచ్చి, వారి ఇంటికే పట్టాదారు పాస్‌బుక్‌ పంపుతాం. ఇంత సులువుగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. - మహేందర్‌రెడ్డి, తాసిల్దార్‌, కడ్తాల్‌ మండలం

అందరూ అంటుంటే నమ్మలేదు

గతంలో భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే మధ్యవర్తుల ప్రమేయం తప్పనిసరి. ఇప్పుడు ధరణి పోర్టల్‌ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా రిజిస్టేషన్లు, మ్యుటేషన్‌ పూర్తి చేసి పట్టా పాసుపుస్తకం కాపీ జిరాక్స్‌ అందజేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ధరణి పోర్టల్‌పై అందరూ మాట్లాడుకుంటుంటే విని నమ్మలేదు. ఈ రోజు నిజంగానే కండ్లారా చూశాను. క్షణాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో నాకు చాలా సంతోషం అనిపించింది.  రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఇలాంటి మంచి పనులు ఎంతో  ప్రజాదరణ పొందుతాయి. - చింతల వినోద్‌, ఊట్‌పల్లి, దోమ మండలం 

20 నిమిషాల్లోనే..

భూమి రిజిస్ర్టేషన్‌ అయిన 20 నిమిషాల్లోనే అధికారులు డాక్యుమెంట్లు ఇచ్చేశారు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారం రోజుల తర్వాత మళ్లీ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి పోయి ఓటీపీ నెంబర్‌ చెప్పి డాక్యుమెంట్లు తీసుకోవాల్సి వచ్చేది. డాక్యుమెంట్‌ తీసుకున్నాక ఎమ్మార్వో ఆఫీస్‌లో ఆన్‌లైన్‌లో ఎక్కించుకునేందుకు, పట్టాదారు పాస్‌బుక్‌ తీసుకునేందుకు ఇంకొన్ని రోజులు తిరగాల్సి వచ్చేది. ఇన్ని ఇబ్బందులు పడుతూ.. ఇదంతా శరామామూలే అనుకునే వాళ్లం. కాని ధరణి   పోర్టల్‌ వల్ల భూమి రిజిష్ర్టేషన్‌ పని ఇంత సులువుగా అయితదని అనుకోలేదు. కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. అధికారుల పనితీరు చాలా బాగుంది. -రాజేశ్‌రెడ్డి, రైతు, గూడూరు, కొత్తూరు మండలం.    

విరాసత్‌కు నెలలు గడిసేది

అప్పట్లో విరాసత్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అది పూర్తయ్యే సరికి నెలలు, సంవత్సరం కూడా గడిచేది. అధికారుల చట్టూ తిరిగి అలిసిపోయేది. దరఖాస్తు చేసుకున్న తరువాత గిర్ధవర్‌ పంచనామా చేసేందుకు ఆయన చుట్టూ తిరిగి, సాక్షాత్కారం చేసుకోవాలంటే ఆ తిప్పలు చెప్పేవి కావు. అధికారులు మారితే మళ్లీ కథ మొదటికి వచ్చేది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేవు. మా తల్లి గువ్వ అనంతమ్మ చనిపోవడంతో ఆమె పేరుపై ఉన్న 22 గుంటల భూమిని ముగ్గురు అన్నదమ్ములం ఎటువంటి ఇబ్బంది లేకుండా సరి సమాన భాగంగా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాం. ఎక్కువ సమయం పట్టలేదు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న మరుసటి రోజే రిజిస్ట్రేషన్‌, విరాసత్‌ వచ్చింది. - గువ్వ రాఘవేందర్‌, హస్నాబాద్‌, కొడంగల్‌ మండలం

తిరిగే తిప్పలు తప్పినవి.. 

భూమి రిజిష్ర్టేషన్‌ కోసం షాద్‌నగర్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌ చుట్టూ ఎంతగానో తిరుగాల్సి వస్తుందని చాలా భయపడ్డా. సీఎం కేసీఆర్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసులను తాసిల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభించడంతో వాటి చుట్టూ తిరిగే తిప్పలు తప్పినవి. రిజిస్ర్టేషన్‌ కోసం ఒక రోజు ముందు ఆన్‌లైన్‌లో సమయాన్ని బుక్‌ చేసుకున్నాం. ఇద్దరు సాక్షులతో పాటు ఎమ్మార్వో ఆఫీస్‌కు పోయి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాం. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణితో మా మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్‌లోనే కేవలం అద్ద గంట సేపటిలోనే రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌, ఆన్‌లైన్‌, పట్టాదారు పాస్‌బుక్‌ వంటి ప్రక్రియ అంతా పూర్తి అయ్యింది. -ఊరడి వెంకటేశ్‌, యువరైతు, గూడూరు, కొత్తూరు మండలం.

నిమిషాల్లోనే ఈ పాస్‌ పుస్తకం

ధరణి పోర్టల్‌ వచ్చినంక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో అధికారుల పని తీరు నిజంగా అద్భుతం. కార్యాలయానికి వెళ్లిన 20 నిమిషాల్లోనే కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్‌ చేసి ఈ పాస్‌ పుస్తకాన్ని అందజేశారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తిచేసి వారి అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇటువంటి సులువైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.  రైతులకు, పేదలకు మంచి చేస్తున్న ధరణి ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు మంచి గుర్తింపు వస్తుంది. అందరూ ధరణితో కచ్చితంగా లబ్ధి పొందుతారు. - రాజేంద్రప్రసాద్‌, బిల్‌కల్‌,  మర్పల్లి మండలం

VIDEOS

logo