ధరణి ధనాధన్..

- సులభంగా, సజావుగా రిజిస్ట్రేషన్లు
- నిమిషాల్లోనే పూర్తవుతున్న ప్రక్రియ
- ఆ వెంటనే మ్యుటేషన్, ప్రొసీడింగ్
- సోమవారం రంగారెడ్డిలో 134, వికారాబాద్‌లో 76 రిజిస్ట్రేషన్లు
- ఊపందుకుంటున్న కార్యకలాపాలు
- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధరణి రిజిస్ట్రేషన్లు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. తాసిల్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజలు, రైతులు నిమిషాల వ్యవధిలో తమ రిజిస్ట్రేషన్లు పూర్తి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ అయి, మ్యుటేషన్, ప్రొసీడింగ్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే రంగారెడ్డి జిల్లాలో 134, వికారాబాద్ జిల్లాలో 76 రిజిస్ట్రేషన్లు జరిగాయి. లబ్ధిదారులు నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. వారికి వీలైన కాలాన్ని అందులో నమోదు చేసి, ఆ సమయానికే వెళ్లి నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుంటున్నారు. ఇలా అన్నీ ఒకేసారి కావడం తో ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి రిజిస్ట్రేషన్లకు రైతులు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
వికారాబాద్ /రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి. సోమవారం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 76 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వీటిలో బషీరాబాద్‌లో 1, బొంరాస్‌పేట్‌లో 6, ధారూరులో 2, దోమలో 2, దౌల్తాబాద్‌లో 9, కొడంగల్‌లో 10, కోట్‌పల్లిలో 3, కుల్కచర్లలో 5, మర్పల్లిలో 5, మోమిన్‌పేట్‌లో 4, నవాబుపేట్‌లో 10, పరిగిలో 4, పెద్దేముల్లో 1, పూడురులో 5, తాండూరులో 1, వికారాబాద్‌లో 4, యాలాల్లో 4 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ మనోఫలకం నుంచి ఉద్భవించిన ధరణి పోర్టల్ రైతన్న తలరాతను మార్చేస్తున్నది. భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనున్నది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో ధరణి పోర్టల్‌కు ముందు...తర్వాత అని చెప్పుకునే పరిస్థితి భవిష్యత్‌లో సాక్షాత్కరించబోతున్నది. మొన్నటి దాకా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అనే ప్రక్రియ గ్రామీణ ప్రాంత రైతులకు పెద్ద సమస్యగా ఉండేది. చాలా మంది రైతులు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లలో జరిగే ఇబ్బందుల నేపథ్యంలో తమ భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, సాదాబైనామాలతోనే కాలం గడిపారనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కాలయాపన, మ్యుటేషన్ వ్యవహారంలో అధికారుల లంచగొండి తనం గ్రామీణ రైతాంగాన్ని పూర్తిగా నిరాశ నిస్పృహలోకి నెట్టివేశాయి. మ్యుటేషన్ ప్రక్రియలో జరిగిన కాలయాపన, అవకతవకల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపైనే నమ్మకంపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణిపై రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. తాసిల్దార్ కార్యాలయాలను సబ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మార్చి, అత్యంత సులభమైన పద్ధతిలో సేవలందిస్తున్నది. ప్రజలకు ఏం కావాలి.. ఎలాంటి కార్యక్రమాలు చేపడితే వారికి లబ్ధి చేకూరుతుందనేది తెలుసుకొని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ అనాదిగా అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశారు. దీంతో ప్రధానంగా రైతులకు కలుగుతున్న లబ్ధి అంతా ఇంతా కాదు. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టగా తాజాగా అమలవుతున్న ధరణి పోర్టల్‌తో వారి ఆనందం రెట్టింపయింది. ఒక్క రిజిస్ట్రేషన్ కోసం అనేక కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. డాక్యుమెంట్లు తయారు చేయడం, చలానా కట్టడం లాంటి వాటితో పాటు ఇద్దరు సాక్షులను రిజిస్ట్రేషన్‌కు వెంట తీసుకుపోయేవారు. పొద్దుగాళ్ల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే సాయంత్రం అయినా పనయ్యేది కాదు.. మరుసటి రోజు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లేవారు. ఇలా అనేక వ్యయ ప్రయాసలకోర్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్లీ మ్యుటేషన్ కోసం, పాస్ పుస్తకాల కోసం ఇవ్వాల్సిన మామూళ్లు, పడిన తిప్పలు తలుచుకంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందని పలువురు రైతులు వాపోతున్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయిస్తున్న ధరణి పోర్టల్ ద్వారా ప్రతి మండల కేంద్రంలో రిజిస్ట్రేషన్లు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ల జోరు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధరణి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. మండల తాసిల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్పీడ్ అందుకున్నది. తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలు, రైతులు నిమిషాల వ్యవధిలో తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుంటున్నారు. వెంట వెంటనే భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదని రైతులు వెల్లడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో సోమవారం 134 రిజిస్ట్రేషన్లు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 516 ధరణి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ధరణి ప్రక్రియలో వేగం పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు రైతులు, ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. వ్యవసాయ భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జిల్లాలోని 27 మండలాల తాసిల్దార్ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి.
మండలాల వారీగా..
జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం 1, మంచాల 5, యాచారం 5, కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు 6, మాడ్గుల10, కడ్తాల 4, తలకొండపల్లి 7, ఫరూఖ్‌నగర్ 7, కేశంపేట 7, శంకర్పల్లి 5, షాబాద్ 6, చేవెళ్ల 8, మొయినాబాద్ 6 చొప్పున గ్రామీణ మండలాల్లో 77 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగతా 58 రిజిస్ట్రేషన్లు అర్బన్ మండలాల్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా 516 రిజిస్ట్రేషన్లు..
జిల్లాలో 27 తాసిల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, మీసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్ చేసుకున్న వారు అందులో పేర్కొన్న రోజున తాసిల్దార్ ఆఫీసుకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. జిల్లాలో 27 తాసిల్దార్ ఆఫీసుల్లో మొత్తం 600లకు పైగా స్లాట్లు బుక్ అయినట్లు సమాచారం. సోమవారం వరకు జిల్లా వ్యాప్తంగా 516 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ధరణి రిజిస్ట్రేషన్లలో మొదటి స్థానంలో కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉండగా.. రెండో స్థానంలో ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ ఉంది. ధరణి రిజిస్ట్రేషన్ల కోసం చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్ డివిజన్లు పోటీ పడుతున్నాయి.
తాజావార్తలు
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన