బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Nov 01, 2020 , 04:35:26

ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం

ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం

  • వారంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 
  • వికారాబాద్‌ జిల్లాలో 120 సెంటర్లు 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అంచనా
  • రోజుకు 800 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు 
  • టోకెన్‌ పద్ధతిలో సేకరణ
  • ఏ గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.1888 మద్దతు ధర
  • మక్కజొన్న కోసం జిల్లావ్యాప్తంగా 10  కేంద్రాలు 
  • ఇప్పటికే మూడు చోట్ల ప్రారంభం

ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.  మరో వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 120 సెంటర్ల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎంసీ, ఐకేపీ, డీసీఎంస్‌, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఈ సీజన్‌లో 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు..   ఆ దిశగా చర్యలు చేపట్టారు.  రోజుకు 800 క్వింటాళ్ల ధాన్యం సేకరించనుండగా,  ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1858 మద్దతు ధర నిర్ణయించారు. రైతులందరూ  ఒకేసారి ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు పడకుండా రెండు రోజుల్లో ఏఈవోలు టోకెన్లు పంపిణీ చేసి,  వాటి ప్రకారం కొనుగోళ్లు చేయనున్నారు. ఇక  మక్కజొన్నల కొనుగోలుకు 10 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే మూడింటిని ప్రారంభించారు. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: వారంలోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే పది రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున  కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, ఐకేపీ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. గతేడాది 44 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ దఫా సీజన్‌లో నియంత్రిత పంటల సాగు విధానంలో భాగంగా పత్తి, కందులు, వరి పంటలనే అధికంగా సాగు చేసిన దృష్ట్యా రికార్డు స్థాయిలో ధాన్యం రానుంది, ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేర దిగుబడి తగ్గినప్పటికీ గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లావ్యాప్తంగా 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది వానకాలం సీజన్‌లో 74,460 ఎకరాల్లో 40 వేల మంది రైతులు వరి పంటను సాగు చేశారు. అదేవిధంగా వరి, మొక్కజొన్న పంటలను సాగు చేసిన రైతులెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరంలేకుండా ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. కొవిడ్‌ దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు   సామాజిక దూరం పాటించే విధంగా, నీటితోపాటు సబ్బు, శానిటైజర్‌ను ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 35 లక్షల గన్నీ సంచులు అవసరమని గుర్తించగా, ప్రస్తుతం 12 లక్షల గన్నీ సంచులు అందుబాటులోఉండగా, మరో 11 లక్షల  సంచులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు, మిగిలిన మరో 12 లక్షల గన్నీ సంచులకు త్వరలో ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ధాన్యం, మక్కజొన్న, వేరుశనగలను విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులను జమ చేయనుంది.

120 ధాన్యం కొనుగోలు కేంద్రాలు...

జిల్లాలో వరి ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టిన నేపథ్యంలో నవంబర్‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని ఆలోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు.అయితే జిల్లావ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనుమతినిచ్చారు. అయితే వీటిలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల(తాండూర్‌, కొడంగల్‌, ధారూర్‌, బషీరాబాద్‌, పరిగి) ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 36 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 26 కేంద్రాలు, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 53 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.   ఏ గ్రామాల్లో అయితే వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉందో సంబంధిత గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. తక్కువ విస్తీర్ణంలో సాగైన గ్రామాల రైతులు పక్క గ్రామానికి ధాన్యాన్ని తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సంబంధిత అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు 800 క్వింటాళ్లు ధాన్యాన్ని సేకరించే విధంగా అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో రైతులకు టోకెన్లను ఏఈవోలు గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. టోకెన్లపై కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాల్సిన తేదీతోపాటు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన గ్రామం పేరు, ధాన్యంలో ఉండాల్సిన తేమ శాతంతోపాటు సామాజిక దూరం పాటించాలనే తదితర సూచనలు టోకెన్‌ వెనుక భాగంలో ఉండేలా వ్యవసాయాధికారులు ముద్రించారు.  వరి ధాన్యాన్ని క్వింటాలుకు ఏ గ్రేడ్‌ రూ.1888, సాధారణ రకం క్వింటాలుకు రూ.1858లను కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి కొనుగోలు చేయనున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 10 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే దోమ, పూడూర్‌, పరిగిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా మిగతా కొనుగోలు కేంద్రాలను మరో రెండు రోజుల్లో రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతీ రైతుకు మద్దతు ధర... - జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

జిల్లాలో వరి, మొక్కజొన్న పండించిన ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బందులు కలుగకుండా, ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటాము. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంలో తేమ శాతం 17 శాతం కంటే తక్కువ ఉండాలి. కొవిడ్‌ దృష్ట్యా  రైతులు సామాజిక దూరం పాటించాలి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం. 

VIDEOS

logo