శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Oct 31, 2020 , 03:35:53

నియోజకవర్గాల్లో రైతు వేదికలు సిద్ధం

నియోజకవర్గాల్లో రైతు వేదికలు సిద్ధం

వికారాబాద్‌:  నియోజకవర్గంలోని ధారూరులో 2, మోమిన్‌పేటలో 1, కోట్‌పల్లిలో 1 పూర్తయ్యాయి. మిగతా వికారాబాద్‌లో 4, మర్పల్లిలో 5, నవాబుపేట్‌లో 5, బంట్వారంలో 2 రైతు వేదికలు సిద్ధమౌతున్నాయి.

తాండూరులో రూ.5.28 కోట్లతో 24 రైతు వేదికల నిర్మాణం

తాండూరు: నియోజకవర్గంలో రూ.5.28 కోట్లతో 24 రైతు వేదికల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికి 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. తాండూరు మండలం అంతారం, సిరిగిరిపేట్‌, యాలాల మండలం రాస్నంలో మొత్తం మూడు పూర్తిగా పూర్తయ్యాయి. మిగితా 21 వేదికలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. మరో పది రోజుల్లో పూర్తవుతాయని పంచాయతీరాజ్‌ డీఈ వెంకట్‌రావు, గోపినాథ్‌ తెలిపారు.

పరిగి డివిజన్‌లో 20 వేదికలు 

పరిగి: డివిజన్‌లోని పరిగి మండలంలో 6, పూడూరులో 5, దోమలో 5, కులకచర్లలో 4 రైతువేదికల నిర్మాణాలు చేపట్టారు. పూడూరు మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయ్యింది. పరిగి మండలం నస్కల్‌, దోమ మండల కేంద్రంలోని రెండు రైతువేదికల నిర్మాణాలు పూర్తవగా రెండుమూడు రోజుల్లో రంగులు వేయనున్నారు.

కొడంగల్‌ నియోజకవర్గంలో..

కొడంగల్‌/బొంరాస్‌పేట/దౌల్తాబాద్‌: బొంరాస్‌పేట మండలంలో బొంరాస్‌పేట, మెట్లకుంట, తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం, దుద్యాలలో రైతు వేదికల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కొడంగల్‌ మండలంలో అప్పాయిపల్లి, టేకుల్‌కోడ్‌, రుద్రారం, హస్నాబాద్‌, రావులపల్లి, చిట్లపల్లి, అంగడిరాయిచూరు, పర్సాపూర్‌ గ్రామాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. దౌల్తాబాద్‌ మండలంలో ఎనిమిది రైతు వేదికలు మంజూరుకాగా దేవర్‌ఫస్లాబాద్‌, చెల్లాపూర్‌ గ్రామాల్లో నిర్మాణం పూర్తయ్యింది.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు చేసే పంటల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు, నియంత్రిత సాగు విధానానికి రైతులకు ఒక చర్చా వేదిక అవసరమని రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వికారాబాద్‌ జిల్లాలో 566 పంచాయతీలుండగా 97 క్లస్టర్లను ఏర్పాటు చేసి, 97 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఒక్కో వేదికకు ప్రభుత్వం రూ.22 లక్షలు ఖర్చు చేస్తున్నది. వ్యవసాయ శాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10 లక్షలు వెచ్చింస్తున్నారు. జిల్లాలో 97 రైతు వేదికల నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ.21.34 కోట్ల నిధులు విడుదల చేసింది. కొన్నింటిలో విద్యుత్‌, పెయింటింగ్‌, శానిటరీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో పది రోజుల్లో అన్ని క్లస్టర్లలోని రైతు వేదికలు పూర్తి చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు.  

అందుబాటులో అధికారులు

మండలానికి ఒక ఏఈవో, కొన్ని చోట్ల రెండు మండలాలకు కూడా ఒక ఏఈవో ఉన్న దృష్ట్యా అధిక గ్రామాలుండడంతో రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుండేది కాదు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఉండడం, ప్రతీ క్లస్టర్‌కు ఒక ఏఈవో ఉండడంతో రైతులకు మేలు జరుగనున్నది. రైతు వేదికల్లో ఏఈవో కార్యాలయం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు, అంతేకాకుండా కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు టీవీలు ఉండనున్నాయి.

వేదికల ద్వారా రైతులను ఏకం చేసి వారిలో చైతన్యం నింపేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. క్లస్టర్లవారీగా రైతులు కూర్చొని ఏ పంట వేయాలి. ఎరువులు, విత్తనాలు ఎలా సేకరించుకోవాలి. పండిన పంటలను ఎక్కడ, ఎంత ధరకు విక్రయించాలి. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్‌ ఉన్నది తదితర అంశాలపై కూలంకషంగా చర్చించు కోనున్నారు. రైతు వేదికల్లో రైతులు ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు విశాలమైన గదులు నిర్మించా రు. రైతులు, అధికారులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు సమావేశమై చర్చించేందుకు వీలుగా హాలు, అధికారుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు నిర్మించారు. ప్రతి వేదికకు ఫైబర్‌నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడంతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారం రైతులకు చేరేందుకు ఇది సహకారమవుతుంది. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సాగుకు సలహాలు, పండించిన ఉత్పత్తులను లాభసాటిగా విక్రయించుకునేలా రైతు వేదికలు వారధిలా నిలువనున్నాయి.