ఆదివారం 29 నవంబర్ 2020
Vikarabad - Oct 29, 2020 , 05:47:10

నేటి నుంచి నవశకం

నేటి నుంచి నవశకం

 • సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభించగానే రిజిస్ట్రేషన్లు షురూ
 • తహసీల్‌ కార్యాలయాల్లో పూర్తయిన ఏర్పాట్లు
 • స్లాట్‌ బుకింగ్‌తో సమయం ఆదా
 • కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు
 • భౌతికదూరం, శానిటైజేషన్‌ ఏర్పాట్లు
 • వివాదాలకు తావులేకుండా కొత్త నిబంధనలు
 • సరళంగా సరికొత్త విధానం..
 • వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యత తాసిల్దార్లదే..
 • సబ్‌ రిజిస్ట్రార్ల ఆధ్వర్యంలో వ్యవసాయేతర భూములు..
 • అధికారులకు తగ్గనున్న పనిభారం
 • వికారాబాద్‌ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు
 • ధరణి పోర్టల్‌ నిర్వహణకు ప్రతి మండలానికి రూ.10లక్షలు మంజూరు

సరళతరం, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌శాఖలో నవశకం మొదలుకానున్నది. సరికొత్త విధానంలో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తాసిల్దార్‌ కార్యాలయాల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉండగా, ధరణి పోర్టల్‌ నిర్వహణకు ప్రతి మండలానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ధరణిని సీఎం ప్రారంభించగానే అధికారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. వ్యవసాయ భూములను తాసిల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేయనుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటిలాగే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేయనున్నారు. భూముల వికేంద్రీకరణతో అధికారులకు పనిభారం తగ్గడంతోపాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందనున్నాయి. ధరణి అందుబాటులోకి వస్తుండడంతో ఇకపై అక్రమాలకు తావు ఉండదని సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పోర్టల్‌ దేశానికే మార్గదర్శకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 • వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : రిజిస్ట్రేషన్ల శాఖలో నేటి నుంచి నవశకం మొదలుకానుంది. మొన్నటి వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యత సబ్‌ రిజిస్ట్రార్లకు అప్పగించగా.. నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ మాత్రమే సబ్‌ రిజిస్ట్రార్లకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను కొత్తగా తాసిల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోనే జిల్లాలోని నవాబుపేట మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి తాసిల్దార్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను గత రెండేండ్లుగా నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తాసిల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్ల ఆధ్వర్యంలో నిర్వహించే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగనుంది. అయితే గురువారం సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ జిల్లాలో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. తదనంతరం జిల్లాలో స్లాట్‌ బుకింగ్‌, రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ వెల్లడించారు. మరోవైపు ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లను నిర్వహించేందుకు జిల్లాలోని 4 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతోపాటు 18 మండలాల తాసిల్దార్‌ కార్యాలయాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు. 
  స్లాట్‌ బుకింగ్‌ మొదలుకొని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వరకు ఎలాంటి అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన రోజులకు కాలం చెల్లింది. ఇకపై నిమిషాల వ్యవధిలోనే పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయనున్నారు. డబుల్‌ రిజిస్ట్రేషన్లకు ఇకపై తావుండదు. ధరణి పోర్టల్‌ సర్వే నెంబర్లు, ఖాతాలవారీగా పొందుపర్చడంతోపాటు ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్న దృష్ట్యా గతంలో మాదిరిగా ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీలుండదు. ఇప్పటివరకు మ్యుటేషన్‌తోపాటు తదితరాలకు సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. సంబంధిత భూపత్రాలను కూడా జతపర్చి మీ సేవలో అందజేసేవారు. మీ సేవ నిర్వాహకులు జతపర్చిన పత్రాలన్నింటిని ఇవ్వకపోవడం.. వీఆర్వోలు డబ్బులు ఆశించడం తదితర కారణాలతో తాసిల్దార్ల వద్దనే ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంటూ వస్తున్నాయి. ధరణి అందుబాటులోకి వస్తే తాసిల్దార్ల వద్దనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి నేరుగా ఆన్‌లైన్‌లో ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో తెలిసిపోతుంది. ఇకపై మ్యుటేషన్‌, సక్సెషన్స్‌, ల్యాండ్‌ వాల్యూ సర్టిఫికెట్‌ తదితరాలకు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒక్కరోజులోనే పేరు మార్పులు చేయడంతోపాటు సంబంధిత పత్రాలను జారీ చేయనున్నారు.  
  ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు కావాల్సిన అన్ని సిద్ధంగా ఉండగా, నేటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తాసిల్దార్ల కార్యాలయాల్లోనూ సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. ఐరిష్‌, బయోమెట్రిక్‌, టీవీలు, బయోమెట్రిక్‌ స్కానర్‌, డెస్క్‌టాప్‌ పాస్‌బుక్‌ ప్రింటర్‌, స్కానర్‌, స్టార్‌ టెక్‌ ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌, ఐరిష్‌, రెండు డెల్‌ డెస్క్‌టాప్స్‌, కెనాన్‌ ప్రింటర్‌, ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌, సీసీ కెమెరాలు, టీవీ, ల్యాన్‌, ఎన్‌వీఆర్‌, వెబ్‌ కెమెరాలను అన్ని తాసిల్దార్‌ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచారు. రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చేవారు శానిటైజ్‌ చేసుకున్న అనంతరమే కార్యాలయంలోకి అనుమతించనున్నారు. మాస్కులు కూడా తప్పనిసరి అని అధికారులు సూచించారు. తాసిల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లకు సంబంధించి 20 ట్రయల్స్‌ పూర్తిచేసిన దృష్ట్యా వారంతా రిజిస్ట్రేషన్ల బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. 
  • నేడే ధరణి ప్రారంభం 
  • 27 తాసిల్దార్‌ కార్యాలయాల్లో  ముమ్మర ఏర్పాట్లు 
  • పర్యవేక్షిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 
  • ప్రతి మండలానికి రూ.10లక్షల చొప్పున జిల్లాకు రూ.2.70 కోట్లు విడుదల 
  రంగారెడ్డి, నమస్తే తెలంగాణ :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ నేడు ప్రారంభం కానుంది. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు గురువారం నుంచి జిల్లాలోని 27 మండలాల తాసిల్దార్‌ కార్యాలయాల్లో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని గురువారం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో ప్రారంభించగానే రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని మండల తాసిల్దార్‌ కార్యాలయాల్లో భూ-రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. తాసిల్దార్‌ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్‌ సంబంధించి సామగ్రిని పంపిణీ అందజేశారు. అన్ని మండలాల సిబ్బంది, తాసిల్దార్ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు బుధవారం ఉదయం నుంచే మొదలయ్యాయి. ఈ పోర్టల్‌ నిర్వహణకు సంబంధించి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రతి మండలానికి రూ.10లక్షల చొప్పున రూ.57 కోట్లు విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లాకు రూ.2.70 కోట్లు విడుదలయ్యాయి. ధరణి పోర్టల్‌ నిర్వహణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూంతోపాటు, జిల్లా స్థాయిలో టెక్నికల్‌ సపోర్ట్‌ టీమ్‌లు పనిచేస్తాయి. నెట్‌ వర్క్‌ సమస్యలు రాకుండా ఉండేందుకు ఏడు సర్వర్లు ఏర్పాటు చేశారు. 
  ఇప్పటివరకు జిల్లాలో 18  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ద్వారా భూముల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగగా గురువారం నుంచి జిల్లాలోని 27 మండలాల తాసిల్దార్‌ కార్యాలయాల్లో భూ సంబంధిత రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. 

  పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌.. చేతికందనున్న పాసు పుస్తకం 

  గతంలో భూమి క్రయ విక్రయాలు జరిగిన వారం రోజుల తర్వాత డాక్యుమెంట్‌.. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల నుంచి మ్యుటేషన్‌ చేయించి పాసుపుస్తకాలు తీసుకోవడానికి రైతులకు నెలల తరబడి సమయం పడుతుండేది. ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా తాసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగనున్నందున వెంటనే పాసుపుస్తకాలు రైతుల చేతికి అందనున్నాయి. భూమి రిజిస్ట్రేషన్‌ పది నిమిషాలలోనే పూర్తవుతుంది. తాసిల్దార్‌ నేతృత్వంలో అక్కడే మ్యుటేషన్‌ చేసి పాసు బుక్కులు అందజేస్తారు. ఇక రిజిస్ట్రేషన్‌ల పక్రియ వేగంగా సులువుగా జరుగనుంది. ముందుగా స్లాట్లు అన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్ల పక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేవలం పది నుంచి పదిహేను నిమిషాలలోపే రిజిస్ట్రేషన్‌ల పక్రియ పూర్తి చేసి పాసుబుక్కులను అందించనున్నారు. రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ నేతృత్వంలో గురువారం జరిగే రిజిస్ట్రేన్ల పక్రియను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లా అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌జైన్‌, డీఆర్వో హరిప్రియ, ఇతర రెవెన్యూ అధికారులు కూడా పర్యవేక్షించనున్నారు. 
   • ధరణికి సన్నద్ధం
   • తాసిల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పరిశీలించిన 
   • అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌
   కులకచర్ల : కులకచర్ల తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేసి గురువారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. బుధవారం కులకచర్ల తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్‌ గదిని పరిశీలించారు. ధరణి పోర్టల్‌కు ప్రత్యేకించి కంప్యూటర్లు ఏర్పాటు చేసి ధరణి ఆపరేటర్‌, తాసిల్దార్‌ కూర్చొని రిజిస్ట్రేషన్లు చేసేందుకు గది అనుకూలంగా ఉండాలని అన్నారు. దీనికిగాను గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దగ్గరలో ఉన్న రైతు వేదిక భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ అశోక్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

   పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలి

   దోమ : గురువారం ప్రారంభం కానున్న ధరణి పోర్టల్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పనులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. బుధవారం దోమ తాసిల్దార్‌ కార్యాలయంలో నూతన ధరణి పోర్టల్‌ను, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పనులను జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ పరిశీలించి మాట్లాడుతూ ధరణి పోర్టల్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఉప తాసిల్దార్‌ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. తదనంతరం ఆయన తాసిల్దార్‌ కార్యాలయ ఆవరణను పరిశీలించి ఆవరణ మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్‌ రాజిరెడ్డికి, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రాజేందర్‌, లింగం పాల్గొన్నారు.