గురువారం 26 నవంబర్ 2020
Vikarabad - Oct 28, 2020 , 05:47:23

అభివృద్ధిపై నిర్లక్ష్యం తగదు

అభివృద్ధిపై నిర్లక్ష్యం తగదు

  • పనులను వేగవంతం చేయాలి
  • పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలి
  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు
  • పెద్దేముల్‌ మండలం గోపాల్‌పూర్‌లో పర్యటన
  • గ్రామ పంచాయతీ నిధులతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశం

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. పెద్దేముల్‌ మండలం గోపాల్‌పూర్‌ గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వీధుల గుండా పాదయాత్ర చేస్తూ మురుగు కాల్వలు, రోడ్లు, మిషన్‌ భగీరథ పైపులైన్లను  పరిశీలించారు. సమస్యలపై స్థానికులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. నల్లాల వద్ద గ్రామపంచాయతీ నిధులతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతివనాలు తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాని ఆదేశించారు.

పెద్దేముల్‌ : వైకుంఠధామ నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని గోపాల్‌పూర్‌ గ్రామంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న రైతువేదిక, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేశారు. వైకుంఠధామ నిర్మాణానికి భూమిని పరిశీలించి, గ్రామస్తులతో కలిసి గ్రామంలోని పలు కాలనీల్లో మురుగుకాల్వలు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైపులైన్‌ లీకేజీలను పరిశీలించారు. రెండు రోజుల్లో మురుగు కాల్వలు అన్నింటిని పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. రైతువేదికను పరిశీలించి నిర్మాణ పనులు నత్తనడకన ఎందుకు సాగుతున్నాయి? నిర్మాణ మెటీరియల్‌ అన్ని ఆర్డర్‌ చేశారా? అని సంబంధిత ఏజెన్సీ వారిని ప్రశ్నించగా వారు కరెంట్‌ సమస్య ఉందని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు, అందుకు స్పందించిన ఆమె విద్యుత్‌ ఏఈని పిలిపించి వెంటనే రైతువేదికకు కరెంట్‌ సరఫరాను కల్పించాలని ఆదేశించారు. అనంతరం కంపోస్టు షెడ్డును పరిశీలించి, వైకుంఠధామం ఎక్కడ నిర్మిస్తున్నారు? స్థలాన్ని సేకరించారా? అని అడిగి తెలుసుకొని సర్వే నంబర్‌ 27 లో 5 గుంటల భూమిలో వైకుంఠధామ నిర్మాణానికి మార్క్‌వుట్‌ చేసి పనులు  ప్రారంభించాలని పీఆర్‌ ఏఈని, ఆర్‌ఐని ఆదేశించారు.

కార్యదర్శికి పోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఆదేశం

గ్రామంలో మురుగుకాల్వలు, పైపులైన్‌ లీకేజీలు వివిధ సమస్యలను ప్రజలు కలెక్టర్‌కు వివరించారు. పంచాయతీ కార్యదర్శికి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. కార్యదర్శిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మరుగుదొడ్లను, ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, అందుకు ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తుందన్నారు. నల్లా వద్ద ఓ ఇంకుడు గుంతను గ్రామ పంచాయతీ నిధులతో తప్పకుండా నిర్మించాలని సర్పంచ్‌ రాములును కలెక్టర్‌ ఆదేశించారు.  వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో  జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, డీపీవో రిజ్వానా, డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్‌, తాండూరు ఆర్డీవో అశోక్‌ కుమార్‌ , పీఆర్‌డీఈ వెంకట్‌రావు, జడ్పీటీసీ ధారాసింగ్‌, ఎంపీడీవో పవన్‌కుమార్‌, సర్పంచ్‌ రాములు, ఎంపీవో సుష్మ, ఏఈలు సందీప్‌, అఖిల్‌, సిద్ధార్థ, ఆర్‌ఐ రాజురెడ్డి, పంచాయతీ కార్యదర్శి కార్తీక్‌, వార్డు సభ్యులు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.