శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Oct 27, 2020 , 06:06:26

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి

బొంరాస్‌పేట : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.4.98లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు కార్పొరేట్‌ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్‌ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఆర్థిక సహాయం మంజూరైందని ఎమ్మెల్యే చెప్పారు. తాండూరులోని కాగ్నా నది నుంచి గతంలో ఉన్న నీటి సరఫరా పైపులైన్‌ ద్వారా కొడంగల్‌లోని మిషన్‌ భగీరథ ట్రీట్‌మెంట్‌ ప్లాంటుకు నీటిని చేరవేసి కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల ప్రజలకు మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు త్వరలో మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపన చేయిస్తామన్నారు. బొంరాస్‌పేట మండలానికి ఏకలవ్య పాఠశాలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదన పంపామని, పాఠశాల మంజూరైతే రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరై మండలం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, తాలుకా సేవాలాల్‌ మహరాజ్‌ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్‌, మండల యూత్‌ అధ్యక్షుడు మహేందర్‌, ఎంపీటీసీలు శ్రవణ్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, ఎల్లప్ప సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేయాలి

త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గ్రామాల్లో అర్హులైన పట్టభద్రులను గుర్తించి వారిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, తాలుకా సేవాలాల్‌ మహారాజ్‌ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్‌, మండల యూత్‌ అధ్యక్షుడు మహేందర్‌, ఎంపీటీసీలు శ్రవణ్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి, ఎల్లప్ప సర్పంచ్‌లు, పార్టీ నాయకులు టీటీ రాములు, బసిరెడ్డి, యూనుస్‌ పాల్గొన్నారు.