శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Oct 27, 2020 , 05:56:47

రిజిస్ట్రేషన్లకు కసరత్తు చేస్తున్న రెవెన్యూ అధికారులు

రిజిస్ట్రేషన్లకు కసరత్తు చేస్తున్న రెవెన్యూ అధికారులు

కందుకూరు : ప్రభుత్వం ఈ నెల 29న ధరణి పోర్టల్‌ను ప్రారంభించే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరుగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు, ఫర్నిచర్‌ మొదలైన వసతులను కల్పించారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలనే ధృడ సంకల్పంతో నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ మండలస్థాయిలో సబ్‌రిజిస్ట్రార్‌ వ్యవస్థ ఏర్పాటుకు వసతులు సమకూరుస్తున్నారు. కందుకూరు మండల పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాలను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా వసతులను కల్పిస్తున్నారు. మండలస్థాయి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రతి  తాసిల్దార్‌ కార్యాలయానికి ఒకరిద్దరు డాక్యుమెంట్‌ రైటర్లను నియమించే అవకాశం ఉంది. 

సులభతరం : జ్యోతి, తాసిల్దార్‌, కందుకూరు

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తాం. వ్యవసాయ భూములను తాసిల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. అందుకు కావాల్సిన స్కానర్లు, ప్రింటర్లు, కంప్యూటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను చేపడుతున్నాం. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించడం రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ధరణి పోర్టల్‌ సులభతరంగా ఉంది. రైతులకు ఒకేసారి రిజిస్ట్రేషన్‌, పాసుబుక్కు అందజేస్తాం. ఇకమీదట రైతులకు ఇబ్బందులు లేకుండా రెవెన్యూ పనులు సవ్యంగా జరుగుతాయి.