సోమవారం 30 నవంబర్ 2020
Vikarabad - Oct 25, 2020 , 08:08:09

పండుగను ప్రశాంతగా జరుపుకోవాలి.. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

పండుగను ప్రశాంతగా  జరుపుకోవాలి.. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

వికారాబాద్‌ : ప్రజలు పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ఉన్న మంచిని, ప్రజల శాంతిని కాపాడుకునే క్రమంలో రాక్షసత్వాన్ని రూపు మాపేందుకు మనుషులంతా ఏకం కావాలన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సమాజ పరిరక్షణ అన్నవి పోలీస్‌ బలగాల ప్రధాన కర్తవ్యమన్నారు. విధి నిర్వహణలో ప్రతి రోజు పోలీసులకు ఆయుధాలు, వాహనాలు తోడుగా ఉంటాయన్నారు. జిల్లా ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.  పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొని పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ అచ్చుతరావు, ఆర్‌ఐ రత్నం, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.