ఆదివారం 29 నవంబర్ 2020
Vikarabad - Oct 24, 2020 , 05:56:27

అభివృద్ధే లక్ష్యం

అభివృద్ధే లక్ష్యం

  • తాండూరు నియోజకవర్గానికి ఇప్పటివరకు జడ్పీ నుంచి రూ.30 కోట్లు కేటాయించాం
  • వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి 
  • అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

తాండూరు రూరల్‌ : అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ లక్ష్యమని, ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదుకుంటారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం తాండూరు మండలంలోని కొత్లాపూర్‌, సంగంకలాన్‌, మల్కాపూర్‌, నారాయణపూర్‌, వీర్‌శెట్టిపల్లి, బిజ్వార్‌ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జడ్పీ  నుంచి ఇప్పటివరకు తాండూరు నియోజకర్గంలోని పలు గ్రామాల అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. జిల్లాలో సుమారు రూ.60 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి జడ్పీకి రూ.80 కోట్ల నిధులు రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను విధిగా నిర్మించుకోవాలన్నారు.  దశల వారీగా ప్రభుత్వ నిధులు అన్ని గ్రామాలకు కేటాయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. సీఎం కేసీఆర్‌ ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఎంపీపీ అనితాగౌడ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు  గౌడి మంజుల మాట్లాడుతూ ఆడపడుచులకు పండుగ కానుకగా బతుకమ్మ చీరెలు పంపిణీ  జరుగుతున్నదన్నారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌ మాట్లాడుతూ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, నారాయణ్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌, సర్పంచ్‌లు మేఘనాథ్‌గౌడ్‌, విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.