సోమవారం 30 నవంబర్ 2020
Vikarabad - Oct 24, 2020 , 05:46:57

ఆన్‌లైన్‌ సక్సెస్‌

ఆన్‌లైన్‌ సక్సెస్‌

  • ముగిసిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ
  • వికారాబాద్‌ జిల్లాలో 94 శాతం పూర్తి
  • మిగిలినవి మీసేవ, వెబ్‌సైట్‌ ద్వారా చేసుకునేందుకు అవకాశం
  • 566 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,18,445 ఆస్తులు.. ఆన్‌లైన్‌ చేసినవి 2,04,136 
  • మున్సిపాలిటీల్లో 36,515 ఉండగా..  35,217 ఎంట్రీ..
  • పెండింగ్‌లో ఫాంహౌస్‌లు, వలసవెళ్లినవారి ఆస్తులు 
  • రంగారెడ్డి జిల్లాలో 93శాతం 
  • 2,78,319 ఆస్తులు గుర్తింపు 

వికారాబాద్‌ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ ముగిసింది. 94 శాతం ఆస్తులను విజయవంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. మిగిలినవాటి వివరాలను యజమానులే మీసేవ లేదా  వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 566 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,18,445 ఆస్తులుండగా, ఇప్పటివరకు 2,04,136 ఆన్‌లైన్‌ చేశారు. మున్సిపాలిటీల్లో 36,515కి గాను 35,217  ఆస్తులను నమోదు చేశారు. ఎక్కువగా ఫాంహౌస్‌లు, వలసవెళ్లినవారి ఆస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఆస్తులను  ఆన్‌లైన్‌లో  నమోదు చేసుకున్నవారికి త్వరలో మెరున్‌ కలర్‌ పాస్‌బుక్‌లు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 93శాతం అంటే 2,78,319 ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 

వికారాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ ముగిసింది. వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 94 శాతం మేర వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదులో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. దాదాపు నెలరోజులపాటు జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో, నాలుగు మున్సిపాలిటీల్లో  వివరాలు సేకరించారు. ప్రస్తుతం కేవలం వ్యవసాయ భూముల్లోని ఫాంహౌస్‌లు, వలసవెళ్లిన వారి వివరాల సేకరణ మాత్రమే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉంది.  ఈ ఆస్తులకు సంబంధించి యజమానులు సొంతంగా కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. www.npb. telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తమ ఆస్తులను నమోదు చేసుకోవచ్చు. మీ సేవ ద్వారా కూడా ఎలాంటి చార్జీలు లేకుండా వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆన్‌లైన్‌ పూర్తైన వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి త్వరలో దేశంలోనే తొలిసారిగా పాసు పుస్తకాలను జారీ చేయనున్నారు. వీటికి ప్రత్యేకంగా మెరున్‌ కలర్‌ పాసు పుస్తకాలను అందజేయనున్నారు. 

94 శాతం పూర్తి...

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌కు సంబంధించి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జిల్లాలో వ్యవసాయేతర భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ 94 శాతం పూర్తైంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదులో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, జిల్లా 3వ స్థానంలో ఉంది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో 2,18,445 వ్యవసాయేతర ఆస్తులు ఉండగా 2,04,136 వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ  పూర్తిచేశారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లోని వ్యవసాయే తర ఆస్తులకు(ఇండ్లు, ప్లాట్లు, ఫాంహౌస్‌లు) సంబంధించి 95 శాతం ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తైంది. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 14,504 వ్యవసాయేతర ఆస్తులుండగా.. ఇప్పటివరకు 13,894 ఆస్తులను ఆన్‌లైన్‌ చేశారు. తాండూర్‌ మున్సిపాలిటీలో 12,636 వ్యవసాయేతర ఆస్తులుండగా ఇప్పటివరకు 12,019 ఆస్తుల వివరాలను, పరిగి మున్సిపాలిటీలో 5,505 వ్యవసాయేతర ఆస్తులుండగా.. వీటిలో ఇప్పటివరకు 5342 ఆస్తులను, కొడంగల్‌లో 3,872 ఉండగా.. 100 శాతం ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేశారు.  కోర్టు కేసుల్లో ఉన్న, పూర్తిగా శిథిలమైన వ్యవసాయేతర ఆస్తులు కూడా ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. జిల్లాలోని పూడూర్‌, వికారాబాద్‌, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌ తదితర మండలాల్లో హైదరాబాద్‌కు చెందిన వారి వ్యవసాయ భూముల్లో ఫౌంహౌస్‌లు ఉన్నాయి. వీరందరి వివరాలను కూడా పంచాయతీ కార్యదర్శులు సేకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 25 వేల వరకు ఫాంహౌస్‌లు ఉండగా వీటిలో కొంతమంది వివరాలు అందించగా, మరికొందరు మాత్రం ఆన్‌లైన్‌ నమోదుకు ఇంకా ముందుకు రాలేదని అధికారులు తెలిపారు. 

ఆన్‌లైన్‌లోనూ  నమోదుకు అవకాశం- డీపీవో రిజ్వానాబేగం

జిల్లాలోని గ్రామ పంచాయతీ ల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణతోపాటు ఆన్‌లైన్‌ ప్రక్రియ 94 శాతం పూర్తయ్యింది. గ్రామ పంచాయతీల్లో ఇండ్ల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా వ్యవసాయ భూముల్లో నిర్మించిన ఇండ్లు, ఫాంహౌస్‌ల వివరాల సేకరణ, కోర్టు కేసులోని ఆస్తుల వివరాల సేకరణ, వలసవెళ్లిన వారి వివరాల నమోదు కొంతమేర పెండింగ్‌లో ఉంది.  జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కొంతమంది తమ ఆస్తుల వివరాలను అందజేసేందుకు ముందుకు రాకపోవడంతో కొంత శాతం వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది..వీరు ఆన్‌లైన్‌లో లేదా మీ సేవ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 

రంగారెడ్డి జిల్లాలో 93 శాతం పూర్తి

  రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ విజయవంతమైంది.పాఠశాల,దేవాలయం,చర్చి,మసీదు ఇతరత్రా కట్టడాలతో పాటు పొలాల్లో నిర్మించిన ఫాంహౌస్‌లు,ఇళ్లు,ప్రభుత్వ,ప్రైవేట్‌ భూముల్లో ఎలాంటి నిర్మాణం చేసిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల డోర్‌ లాక్‌ ఉండడం, ఫాంహౌజ్‌  యాజమనులు అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోయారు.  జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. ఇందులో 21 మండలాల పరిధిలోని 560 గ్రామ పంచాయతీలు, 2కార్పొరేషన్లు,12 మున్సిపాలిటీల పరిధిలో ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగించారు. జిల్లాలో 93 శాతం ఆస్తుల నమోదు చేశారు. 2,78,319 వ్యవసాయేతర ఆస్తులను గుర్తించారు. 

50రకాల వివరాల సేకరణ..

  పంచాయతీ కార్యదర్శులకు వాట్సాప్‌ నంబర్లకు ప్రత్యేకంగా లింక్‌ ద్వారా ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగింది. టీఎస్‌ ఎన్‌పీబీ(నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌ ఆప్‌ డేషన్‌) యాప్‌ ద్వారా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామాల్లో ప్రజలంతా ఆస్తుల ఆన్‌లైన్‌కు ముందుకు వచ్చారు. ఇందులో ఇంటి నంబర్‌,యజమాని, తల్లి,తండ్రి పేర్లు,బ్యాంకు ఖాతా నంబర్‌, రేషన్‌,ఆధార్‌ కార్డు నంబర్లు,ఇంటి పన్ను,నల్లా పన్ను, చెల్లింపు తదితర వివరాలతో ఈ ఆస్తికి సంపూర్ణ యాజమాన్య హక్కులు నావి అని,అవాస్తవ సమాచార ఇస్తే శిక్షార్హుడననే సంతకంతో  ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. గ్రామాల్లో ప్రజలంతా ఆస్తుల ఆన్‌లైన్‌కు ముందుకు వచ్చారు. ఇంటి సభ్యులకు సంబంధించి మొత్తం 50 రకాల వివరాలు ధరణి ఫోర్టల్‌లో నిక్షిప్తం చేయడం జరిగింది. వ్యవసాయేతర ఆస్తులు 2.53 లక్షలు ఆన్‌లైన్‌ చేశారు

నమోదుకోసం సర్వే పూర్తి  -శ్రీనివాస్‌రెడ్డి,పంచాయతీ అధికారి, రంగారెడ్డి జిల్లా  

  రంగారెడ్డి జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ ఆస్తుల వివరాల నమోదుకు సంబంధించి సర్వే పూర్తైంది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణతోపాటు ఆన్‌లైన్‌ ప్రక్రియ 93% గృహ యజమానులు పూర్తి స్థాయిలో అందించారు.  పంచాయతీల్లో ఉన్న ఇళ్ల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. వ్యవసాయ భూముల్లో నిర్మించిన ఇండ్లు, ఫాంహౌస్‌ల వివరాల సేకరణ, కోర్టు కేసులోని ఆస్తుల వివరాల సేకరణ, డోర్‌లాక్‌ వెళ్లిన వారి సమాచారం నమోదు పెండింగ్‌లో ఉంది.