మంగళవారం 01 డిసెంబర్ 2020
Vikarabad - Oct 22, 2020 , 05:42:43

రైతు సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

రైతు సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

తాండూరు : పట్టణంలో బుధవారం డీసీసీ బ్యాంకు, పీఏసీఎస్‌ నూతన భవనాన్ని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అప్పులు తీసుకోవడం నుంచి సహకార బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే స్థాయికి ఎదుగాలని అభిలషించారు. రైతులకు అప్పులు లేకుండా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. రైతుల మేలు కోసం ప్రభుత్వం ప్రతి నిత్యం అండగా ఉంటుందని తెలిపారు. 

డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో డీసీసీబీ ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు, రైతుల సహకారంతో బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ముఖ్యంగా రైతులకు 24 నుంచి 48 గంటల్లో కమర్షియల్‌ బ్యాంకులకు దీటుగా రుణాలు అందిస్తామన్నారు. పదవీ బాద్యతలు తీసుకున్న రోజున బ్యాంకు లావాదేవీలు రూ.450 కోట్లు ఉంటే బ్యాంకును అభివృద్ధి చేసేందుకు ఎన్నో విధాలుగా ఆలోచించి అందరి సహకారంతో ప్రసుత్తం రూ.1200 కోట్లతో లావాదేవీలు చేస్తూ అభివృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. నాబార్డు సహకారంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రూ.100 కోట్లతో పీఏసీఎస్‌కు ఒకటి చొప్పున 2500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కోనుగోలు చేసిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు. పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని.. ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ సత్తయ్య, సీఈవో శ్రీనివాస్‌, తాండూరు జడ్పీటీసీ మంజుల, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, తాండూరు వైస్‌ ఎంపీపీ స్వరూప, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ తాండూరు చైర్మన్‌ రవిగౌడ్‌, యాలాల చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, బషీరాబాద్‌ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, పెద్దేముల్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పురుషోత్తంరావు, అబ్దుల్‌ రవూఫ్‌, రాజుగౌడ్‌, శ్రీనివాస్‌, విఠల్‌నాయక్‌, అక్బర్‌బాబా ఉన్నారు. 

చేపల పెంపకంతో మత్స్యకారులకు ఆర్థికంగా లబ్ధి

చెరువులు, కుంటల్లో ప్రభుత్వం చేపల పెంపకంతో మత్స్యకారులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం జుంటుపల్లి డ్యాంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ చేస్తున్న కృషితో చెరువులు, చెక్‌డ్యాంల్లో జలకళ నెలకొందని పేర్కొన్నారు. చేపలు, రొయ్యల పెంపకానికి జాతీయం చేయబడిన బ్యాంకులతోపాటు జిల్లా సహకార బ్యాంకులు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్నా, సన్నకారు రైతులకు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు ఫిష్‌ ఫార్మర్స్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఇస్తున్న సబ్సిడీని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.