బుధవారం 02 డిసెంబర్ 2020
Vikarabad - Oct 22, 2020 , 05:25:15

పత్తి రైతుకు మద్దతు

పత్తి రైతుకు మద్దతు

  • పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు ముమ్మరం
  • తడిస్తే ఆరబెట్టి తీసుకు రావాలని సూచన
  • తేమశాతాన్ని బట్టి రేటు నిర్ణయం
  • ఏ గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.5825.. సాధారణ రకానికి రూ.5515
  • వచ్చేనెలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
  • వికారాబాద్‌ జిల్లాలో 7 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా కొనుగోలు
  • ఈ ఏడాది 2,71,192 ఎకరాల్లో సాగైన పత్తి
  • 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా

వర్షానికి నష్టపోయిన పత్తి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తడిసిన పత్తిని ఆరబెట్టి తీసుకొస్తే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తేమశాతాన్ని బట్టి ధర నిర్ణయించనున్నది. 8శాతం తేమ ఉన్న పత్తికి కనీస మద్దతు ధర చెల్లించనున్నది. ఏ గ్రేడ్‌ పత్తిని క్వింటాలుకు రూ.5825, సాధారణ రకాన్ని క్వింటాలుకు రూ.5515 చొప్పున కొనుగోలు చేయనున్నది. వచ్చేనెలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 7 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా కొనుగోళ్లు జరుపనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 2,71,192 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, 15లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 50 శాతానికిపైగా పత్తి పంటకు నష్టం చేకూరింది. తడిచిపోయిన పత్తిని కూడా కొనుగోలు చేయనున్నారు, అయితే తడిచిన పత్తిని ఆరబెట్టిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కలిగేలా కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పత్తిలో తేమ 8 శాతం ఉన్నట్లయితే నిర్ణయించిన మద్దతు ధర మేరకు కొనుగోలు చేయనున్నారు. రంగు మారిన పత్తిని మాత్రం రైతులు తీసుకురావద్దని, మద్దతు ధర వచ్చే అవకాశం లేదని సంబంధిత అధికారులు రైతులకు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతేడాది 12,28,175 క్వింటాళ్ల పత్తిని 7 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా కొనుగోలు చేశారు. 

వచ్చే నెలలో పత్తి కొనుగోలు కేంద్రాలు

పత్తి కొనుగోలు కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 7 జిన్నింగ్‌ మిల్లుల ఆధ్వర్యంలో పత్తిని కొనుగోలు చేయనున్నారు. వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ పరిధిలో రెండు జిన్నింగ్‌ మిల్లులు, పరిగి మార్కెట్‌ కమిటీ పరిధిలో ఒకటి, కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ పరిధిలో ఒకటి, తాండూర్‌ మార్కెట్‌ కమిటీ పరిధిలో 3 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేయనున్నారు. అయితే పత్తి కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది క్వింటాలుకు రూ.5825, సాధారణ రకం క్వింటాలుకు రూ.5515 చెల్లించనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏ గ్రేడ్‌కు రూ.275, సాధారణానికి రూ.260 మద్దతు ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు పత్తికి సంబంధించి వారం రోజుల్లో రైతులకు చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పత్తిలో 12 శాతం వరకు తేమ ఉన్నట్లయితే సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని మద్దతు ధర తగ్గిస్తూ సేకరించనున్నారు. 12 శాతం కంటే అధికంగా తేమ ఉన్నట్లయితే కొనుగోలు చేసేందుకు వీలుండదని అధికారులు చెబుతున్నారు. 

86,421 ఎకరాల్లో పత్తి పంట నష్టం

జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 5,93,442 ఎకరాల్లో ఆయా పంటలను జిల్లా రైతాంగం సాగు చేయగా, 2,71,192 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. మొత్తం లక్షా 30వేల మంది రైతులు పత్తి సాగు చేయగా, 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు.  అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా గత నెలరోజులుగా 86,421 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పంట నష్టంతో జిల్లాలోని 18 మండలాలకు చెందిన 41,842 మంది రైతులు నష్టపోయారు. పత్తితోపాటు కందులు, పెసలు, మినుములు, సోయాబీన్‌, జొన్న, వరి, మొక్కజొన్న, చెరుకు పంటలు కలిపి 1,42,118 ఎకరాల్లో నష్టపోగా, కేవలం పత్తి పంట 86,421 ఎకరాల్లో నష్టపోయింది. తాండూర్‌ మండలంలో 3570 ఎకరాలు, బషీరాబాద్‌లో 10378, యాలాలలో 4778, పెద్దేముల్‌లో 7936, బంట్వారంలో 9165, ధారూర్‌లో 4675, కోట్‌పల్లిలో 7457, మర్పల్లిలో 5298, మోమిన్‌పేట్‌లో 3890, వికారాబాద్‌లో 12745, నవాబుపేటలో 5716, దౌల్తాబాద్‌లో 198, కొడంగల్‌లో 7800, బొంరాసుపేట్‌లో 1492, దోమలో 300, కుల్కచర్లలో 253, పూడూర్‌లో 320, పరిగి మండలంలో 450 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన పత్తికి సంబంధించి తడిచిన పత్తిని ఆరబెట్టి తీసుకువెళ్లినట్లయితే కొనుగోలు చేయనున్నారు.  

పొడి పత్తినే తీసుకురండి : జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సబిత

పత్తి తడిచినట్లయితే ఆరబెట్టి పొడి పత్తిగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. తడి పత్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకురావద్దు. పొడి పత్తిని తీసుకురావడంతో మంచి ధర రైతులకు దక్కుతుంది. పత్తిలో తేమ శాతాన్ని బట్టి సీసీఐ మద్దతు ధర నిర్ణయిస్తుంది. జిల్లాలో 7 జిన్నింగ్‌ మిల్లుల ఆధ్వర్యంలో పత్తిని కొనుగోలు చేయనున్నాం.