మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Oct 18, 2020 , 00:35:12

నియోజకవర్గంలో రూ.5.28 కోట్లతో 24 రైతు వేదికలు

నియోజకవర్గంలో రూ.5.28 కోట్లతో 24 రైతు వేదికలు

దసరాకు ప్రారంభించేందుకు సర్కార్‌ కసరత్తు

తాండూరు : పుడమి బిడ్డల సేవ కోసం సర్కార్‌ పల్లెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు దసరాకు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో రూ.5.28 కోట్లతో నిర్మిస్తున్న 24 రైతు వేదికల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికి 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. ఈ నెల చివరి నాటికి రైతు వేదికల పనులు పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌ డీఈ వెంకట్‌రావు, గోపీనాథ్‌ శనివారం ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు.

తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో 24 రైతు వేదికలు ఉన్నాయి. తాండూరు మండలంలో అంతారం, సిరిగిరిపేట్‌, ఐనెల్లి, కరణ్‌కోట్‌, చెంగోల్‌, బెల్కటూర్‌, నారాయణపూర్‌, యాలాల మండలంలో యాలాల, కోకట్‌, రాస్నం, అగ్గనూరు, జుంటుపల్లి, బషీరాబాద్‌ మండలంలో బషీరాబాద్‌, కాశీంపూర్‌, మంతటి, నావల్గ, ఎక్మాయి, నీల్లపల్లి, పెద్దేముల్‌ మండలంలో పెద్దేముల్‌, గోపాల్‌పూర్‌, ఇందూరు, తట్టెపల్లి, కందనెల్లి, మంబాపూర్‌ ఉన్నాయి. ప్రతి వేదికలో ఏఈవో, రైతు వేదిక కో-ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్‌, 200కు పైగా రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్‌, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి చుట్టూ ప్రహరీతోపాటు గార్డెన్‌ ఏర్పాటు చేసేందుకు సర్కార్‌ యోచిస్తున్నదని సమాచారం. నియోజకవర్గంలోని ఒక వేదికలో భూసార పరీక్షల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 


దసరాకు పూర్తవుతాయి : వెంకట్‌రావు, పంచాయతీరాజ్‌ డీఈ

తాండూరు నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా నాటికి అన్ని వేదికలు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాం. కాంట్రాక్టర్లు నాణ్యతతో చక్కగా పనులు చేస్తున్నారు. రైతులకు అన్నివిధాల ఉపయోగపడేరీతిలో రైతు వేదికలున్నాయి. 

రైతు వేదికలు అన్నదాతలకు వరం 

విష్ణువర్ధన్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ పెద్దేముల్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు అన్నదాతలకు వరంగా మారనున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లో రూ.5.28 కోట్లతో 24 రైతు వేదికలు నిర్మించడం అభినందనీయం. దీంతో నిరంతర సమావేశాలతో వ్యవసాయంలో మంచి మార్పు వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు వీలుంటుంది. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయడంలో రైతులకు చాలా మేలు జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రైతుల అభ్యున్నతికి ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయం. 


logo