బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Oct 17, 2020 , 00:34:57

భలే చాన్సులే.. ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో 15 రోజులపాటు అవకాశం

భలే చాన్సులే.. ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో 15 రోజులపాటు అవకాశం

భారీ వర్షాల నేపథ్యంలో  వెసులుబాటు

దరఖాస్తులతో ఇప్పటివరకు రూ.4 కోట్ల ఆదాయం

అత్యధికంగా తాండూర్‌ మున్సిపాలిటీలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు

ఇప్పటివరకు  వచ్చిన దరఖాస్తుల సంఖ్య  24,532  

పంచాయతీల్లో 8400 .. నాలుగు మున్సిపాలిటీల్లో 16,132 దరఖాస్తులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎల్‌ఆర్‌ఎస్‌(భూముల క్రమబద్ధీకరణ పథకం)కు విశేష స్పందన వస్తున్నది.  ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈనెలాఖరు వరకు గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈనెల 15తోనే గడువు ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన దృష్ట్యా దరఖాస్తు గడువు పెంచుతూ నిర్ణయించింది.  జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటివరకు 24,532 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు అందాయి. అత్యధికంగా తాండూర్‌ మున్సిపాలిటీ నుంచి అందినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులతో ఇప్పటివరకు సుమారు రూ.4 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో ధర ప్రకారం  చార్జీలు వసూలు చేయనున్నట్లు తీసుకున్న నిర్ణయంతో ప్రజలపై భారం తగ్గనుంది. 2013కు ముందు మార్కెట్‌ ధర తక్కువగా ఉన్న దృష్ట్యా ఆ సమయంలో భూముల రిజిస్ట్రేషన్‌ అయిన వారికి భారీ ఉపశమనం కలుగనుంది. అదేవిధంగా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనుమతిలేని లేఅవుట్లకు సంబంధించి  2020 ఆగస్టు 26కు కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు. ఆ తేదీ వరకు అక్రమ లే అవుట్లతోపాటు ప్లాట్లు రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ అయిన స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. 

ఇప్పటివరకు 24,532 దరఖాస్తులు...

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో అనధికారిక లే అవుట్ల నిర్వాహకులతోపాటు సంబంధిత లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి నుంచి భారీ స్పందన వస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలతోపాటు 18 మండలాల్లోని అనధికారిక లేఅవుట్లు, ప్లాట్లు కలిగిన 59 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 24,532 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 16,132 దరఖాస్తులు, గ్రామ పంచాయతీల్లో 8,400 దరఖాస్తులు అందినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని 59 గ్రామ పంచాయతీల్లో 221 అనధికారిక లే అవుట్లలో  14,314 ప్లాట్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 8400 ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధుల్లో 214 అనుమతిలేని లే అవుట్లు ఉండగా 16,132 మంది దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపాలిటీల్లోని 214 అనధికారిక లే అవుట్లలో  ఇప్పటివరకు గుర్తించిన ప్లాట్ల సంఖ్య 12,675..కాగా.. ఇంకా గుర్తించాల్సినవి కూడా కొన్ని చోట్ల ఉన్నట్టు  అధికారులు తెలిపారు. పరిగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైనప్పటికీ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలోనే చాలా వరకు ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వెలిశాయి. పరిగి మున్సిపాలిటీలో 117 అనుమతిలేని లే అవుట్లలో..  8,214 అనధికారిక ప్లాట్లుండగా ఇప్పటివరకు 3100 దరఖాస్తులు అందాయి. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 81 అనుమతిలేని లే అవుట్లలో 4300 అనధికారిక ప్లాట్లుండగా 3403 దరఖాస్తులు వచ్చాయి. తాండూర్‌ మున్సిపాలిటీలో 9317 దరఖాస్తులు, కొడంగల్‌ మున్సిపాలిటీలోని ఐదు అనుమతిలేని లే అవుట్లలో 480 అనధికారిక ప్లాట్లుండగా 312 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఆరు శ్లాబులు...

భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలోని మార్కెట్‌ ధరను బట్టి రెగ్యులరైజేషన్‌ చార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రిజిస్ట్రేషన్‌ చార్జీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చదరపు గజం విలువ రూ.3 వేలు గల భూమికి సంబంధించి 20 శాతం,  రూ.3001 నుంచి రూ.5000 వరకు 30 శాతం,  రూ.5001  నుంచి రూ.10,000 వరకు 40 శాతం, రూ.10,001 నుంచి రూ.20,000 వరకు 50 శాతం, రూ.20,001 నుంచి రూ.30,000 వరకు 60 శాతం,   రూ.30,001 నుంచి రూ.50,000 వరకు 80 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా చదరపు గజం విలువ రూ.50 వేలకుపైగా ఉన్నట్లయితే 100 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్లాట్ల యజమానులు, సొసైటీ సభ్యులు, కాలనీ డెవలపర్స్‌ క్రమబద్ధీకరణకు సాక్ష్యంగా సేల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అదేవిధంగా కేవలం ఒప్పందం చేసుకున్న స్థలాలను క్రమబద్దీకరించే వీలులేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

గడువులోగా 

దరఖాస్తు చేసుకోండి...

- జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

ప్రభుత్వం ఈనెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు గడువు పొడిగించింది. అనధికారిక ప్లాట్లు, లే అవుట్లు గల వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాము. గడువులోగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే భవిష్యతులో ఇంటి అను మతులు, ఇతర సౌకర్యాలు పొందడంలో ఇబ్బందులు ఉండవు.

     అనధికారిక  

మున్సిపాలిటీ           లేఅవుట్లు ప్లాట్లు    అందిన దరఖాస్తులు


పరిగి 117 8214     3100

వికారాబాద్‌ 81 4300     3403

కొడంగల్‌ 05 480       312 


logo