శుక్రవారం 30 అక్టోబర్ 2020
Vikarabad - Oct 15, 2020 , 02:03:49

సహాయక చర్యలు ముమ్మరం చేయండి

సహాయక చర్యలు ముమ్మరం చేయండి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

వికారాబాద్‌ : ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి గాలివాన బీభత్సానికి పట్టణంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల పట్టణంలో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట రాత్రి కురిసిన గాలివానకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో మున్సిపల్‌ సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా నేలకొరిగిన చెట్లను వెంటనే తొలిగించాలని ఆమె మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి విద్యుత్‌ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈమె వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు రమేశ్‌, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు. 

కంట్రోల్‌ రూం ఏర్పాటు

విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే 7702079917 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 24 గంటల పాటు అత్యవసర సమాచార కేంద్రం పని చేస్తుందన్నారు. అత్యవసర పనులు ఉంటే తప్పా బయటకు రావద్దని, శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలడం, అనుకోని ఘటనలు జరిగితే మున్సిపల్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూంకు సమాచారం ఇవ్వాలన్నారు.