శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Oct 14, 2020 , 01:47:51

వెలుగులు విరజిమ్మేలా..

వెలుగులు విరజిమ్మేలా..

  • పంచాయతీల్లో విద్యుత్‌ దుబారా నివారణకు సర్కార్‌ చర్యలు
  • వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి
  • నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగింత

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : పంచాయతీల్లో విద్యుత్‌ ఆదా కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్‌ సప్లయిలో ఎంత ముందు వరుసలో ఉన్నామో.. ఆదాలోనూ అంతే ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా విద్యుత్‌ దుబారాను నివారించి .. నిర్వహణ సక్రమంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లోని ఓ వీధి దీపాల బాధ్యతలు, నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించనుంది. పల్లెల్లో గత కొన్నేండ్లుగా వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలు చేపట్టాయి. కాగా.. ఇప్పటికీ వీధిదీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే వాటి నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీనిపై పంచాయతీలవారీగా తీర్మానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

రంగారెడ్డి జిల్లా 21మండలాలవ్యాప్తంగా 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 3 పంచాయతీలకు సంబంధించి ఓ సంస్థ ట్రస్ట్‌ విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుంది. మిగుతా 557 పంచాయతీల విద్యుత్‌ బిల్లులకు సంబంధించి గ్రామ పంచాయతీ బిల్లులు చేస్తున్నది. రాత్రివేళ ప్రధాన చౌరస్తాలు, రహదారులు, కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌శాఖ లెక్కల ప్రకారం 5369 మీటర్‌ సర్వీస్‌లు ఉన్నాయి. దాదాపుగా లక్షకుపైగా వీధి దీపాలు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా దాదాపు రూ.3కోట్ల వరకు విద్యుత్‌ బిల్లు వస్తుంది. కాగా.. పల్లెలో విద్యుత్‌ దీపాల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదని గుర్తించారు. మరి కొన్నిచోట్ల బల్బులు పోయినా పట్టించుకోవడంలేదని, మరికొన్ని చోట్ల పట్టపగలే వెలుగుతున్నట్లు నివేదికలు అందాయి. అనుమతి లేకుండా పలుచోట్ల విద్యుత్‌ బల్బులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యుత్‌ దీపాల నిర్వహణ బాధ్యత ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించడం వల్ల మెరుగైన సేవలు... ఫలితాలు ఉంటాయని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఏడేండ్ల పాటు...

ప్రైవేట్‌ ఏజెన్సీ ఏడేండ్లపాటు విద్యుత్‌ దీపాల నిర్వహణ చేపట్టనుంది. ముందుగా ఎన్ని అమర్చాలనే లెక్కపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఏజెన్సీ పెట్టుబడి పెట్టి దీపాలను ఏర్పాటు చేసి.. ప్రతి నెలా నిర్వహణ ఖర్చును పంచాయతీల నుంచి వసూలు చేయనున్నారు.

ఏ వీధిలో దీపాలు వెలుగకపోయినా ..

పల్లెల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఉనికిని కాపాడేది వీధి దీపాలే. ఏ వీధిలో దీపాలు వెలుగకపోయినా గ్రామస్తులు వారి దృష్టికి తీసుకువచ్చి బల్బులు వేయించేవారు. ఈ నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించడంతో వారి ఉనికి దెబ్బతింటుందని కొందరు సర్పంచ్‌లు తీర్మానాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. పంచాయతీలకు వచ్చే విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తూ.. నిర్వహణను మరింత పటిష్టపర్చాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్‌కు

గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్‌ సంస్థకు అప్పగిస్తూ ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది. దీనివల్ల పంచాయతీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతినెలా ఖర్చును పంచాయతీలు భరిస్తాయి. నిర్వహణ మాత్రం ఏజెన్సీ పర్యవేక్షణ చూస్తుంది.

- శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి


logo