శుక్రవారం 30 అక్టోబర్ 2020
Vikarabad - Oct 13, 2020 , 01:36:13

ఎడతెరిపిగా..

ఎడతెరిపిగా..

  • వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట, ధారూరు, దౌల్తాబాద్‌లో మోస్తరు
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • వరద నీటితో కళకళలాడుతున్న చెరువులు

ధారూరు : మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం మండలంలోని స్టేషన్‌ ధారూరు,  ధారూ రు, కుక్కింద, అవుసుపల్లి, అల్లీపూర్‌, కేరెళ్లి, ఎబ్బనూర్‌, చింతకుంట, హరిదాస్‌పల్లి, గురుదోట్ల, నాగారం, నాగసముందర్‌, దోర్నాల్‌ గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దౌల్తాబాద్‌లో ...

మూడు రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ముసురు వాన కురువడంతో ఆయా గ్రామాల్లోని కుంటలు, చెరువులకు వర్షపు నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీటి మట్టం పెరుగుతుందని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడుతల్లో మిషన్‌ కాకతీయ పథకంతో పూర్తి చేసిన చెరువులు, కుంటలకు భారీగా నీరు చేరింది. ఇప్పటికే మండలంలోని పలుచోట్ల ఈదురుగాలులతో పాటు వర్షపు జల్లులు కురిశాయి.

మోమిన్‌పేట్‌లో...

మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏకదాటిగా వర్షం పడింది. దీంతో పత్తి పంటకు నష్టం వాటిల్లుతుందని గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పత్తి పంటకు రోగాలు వచ్చి పూత రాలి సగం పంట పాడైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని నందివాగు ప్రాజెక్టు పొంగిపొర్లడంతోపాటు, గ్రామాల్లోని చెరువులు, బావులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.