శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Oct 13, 2020 , 01:36:12

మూడేండ్లలో... చిట్టడవులు

మూడేండ్లలో... చిట్టడవులు

  • అనంతగిరిలోని రెండున్నర ఎకరాల్లో పనులు ప్రారంభం
  • ఇప్పటివరకు 5 వేల మొక్కలు నాటడం పూర్తి
  • మూడేండ్లలో చిట్టడవులుగా రూపాంతరం
  • వచ్చే ఏడాది మున్సిపాలిటీల్లోనే పెంపకం
  • ఎకరాకు 4 వేల మొక్కలు నాటేందుకు  రూ.5 లక్షలు అవసరమని అంచనా
  • జిల్లాకు రూ.30 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
  • 45 రకాల ఔషధ మొక్కలను నాటుతున్న జిల్లా అటవీ శాఖ

అంతరించిపోతున్న అటవీ సాంద్రతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంతో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నది. అంతేకాకుండా చిట్టడవులు పెంచి రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. మియావాకిని స్ఫూర్తిగా తీసుకుని పైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదట అనంతగిరిలో చిట్టడవులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది యంత్రాంగం. తక్కువ విస్తీర్ణంలో రకరకాల మొక్కలు ఎక్కువ మొత్తంలో నాటి, మూడేండ్లలో వీటిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీటికోసం వికారాబాద్‌ జిల్లాకు రూ.30 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో ఎకరాకు 4వేల మొక్కలకు రూ.5 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు. అనంతగిరి, ధారూరు, తాండూరు, కొడంగల్‌ ప్రాంతాల్లో చిట్టడవులు పెంచేందుకు అటవీ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

 రోజురోజుకూ అంతరించిపోతున్న అటవీ సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హరితహారం కార్యక్రమంతో ప్రతి ఏటా పెద్దఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం అటవీ సాంద్రతను మరింత పెంచి హరిత తెలంగాణగా మార్చేందుకు కార్యాచరణను రూపొందించింది. అణు విస్ఫోటనంతో పూర్తిగా ఏడారిగా మారిన జపాన్‌ను మియావాకి అనే ప్రకృతి ప్రేమికుడు మియవాకి పేరిట చిట్టడవులను పెంచి తిరిగి వాతావరణంలో మార్పులు తీసుకురాగలగడంతో మియవాకిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చిట్టడవులను పెంచేందుకు నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాను ఎంపిక చేసి విజయవంతం కావడంతో అన్ని జిల్లాల్లో చిట్టడవులను పెంచేందుకు ప్రణాళికను రూపొందించారు.

కేవలం మూడేండ్ల్లలోనే చిట్టడవుల్లా మారే విధంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో రకరకాల మొక్కలను నాటనున్నారు, వీటిలో పొడువు జాతి మొక్కలతోపాటు చిన్నజాతి, పెద్ద జాతి మొక్కలను నాటనున్నారు. జిల్లాలో చిట్టడవులు (మియావాకి) పెంచేందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే రూ.30లక్షలను విడుదల చేసింది. అయితే జిల్లాలో మొదట నాలుగు అటవీ ప్రాంతాల్లో దట్టమైన చిట్టడవులను పెంచేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించగా, ఈ ఏడాది అనంతగిరి అటవీ ప్రాంతంలో మాత్రమే చిట్టడవులను పెంచే ప్రక్రియను చేపట్టారు. పట్టణాల పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకుగాను మున్సిపాలిటీల పరిధిలోనే చిట్టడవులను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మియావాకి పనులు షురూ...

జిల్లాలోని అనంతగిరితోపాటు ధారూర్‌ సమీపంలోని స్మృతివనంలో తాండూరు సమీపంలోని అంతారం అట వీ ప్రాంతంలో కొడంగల్‌ సమీపంలోని అప్పాయిపల్లిలోని అటవీ ప్రాంతంలో చిట్టడవులను పెంచేందుకు అటవీశాఖ అధికారులు నిర్ణయించినప్పటికీ ఈ ఏడాది కేవలం అనంతగిరి అటవీ ప్రాంతంలోనే మియావాకి పనులను ప్రారంభించారు. కేవలం మున్సిపాలిటీల పరిధిలోనే చిట్టడవులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మున్సిపాలిటీల పరిధిలో మియావాకికి అనువైన స్థలాలకై జిల్లా అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే స్థలాలను గుర్తించినప్పటికీ మిగతా మూడు మున్సిపాలిటీల్లో వచ్చే ఏడాది వేసవిలో పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు. అయితే జిల్లాకు ఇప్పటికే రూ.30లక్షలను ప్రభుత్వం విడుదల చేయగా, ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఖర్చు కానుంది. అనంతగిరి అటవీ ప్రాంతంలో చిట్టడవుల పెంపకానికి గుర్తించిన భూమిని సిద్ధం చేశారు. చిట్టడవులను పెంచేందుకు గుర్తించిన భూమిలో మూడు ఫీట్ల మేర మట్టిని తీసి, తదనంతరం ఆ ప్రాంతంలో ఎర్రమట్టిని నింపారు. అదేవిధంగా మొక్కల ఎదుగుదల త్వరితగతిన అయ్యేందుకుగాను ఎరువులు తయారీలో భాగంగా సంబంధిత ప్రాంతంలో ఆకులను, 400-500 వానపాములను వదిలిపెట్టారు. 

అంతేకాకుండా రోజు విడిచి రోజు నీరు పట్టారు. తదనంతరం 15 రోజుల తర్వాత సంబంధిత భూమిని దున్ని, తదనంతరం మొక్కలను నాటే ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో 45 రోజుల్లో మియావాకికి అనుగుణంగా సంబంధిత భూమిని సిద్ధం చేసి మొక్కలను నాటుతున్నారు. మీటరుకు ఒక మొక్క చొప్పున చిన్న, పెద్ద జాతి మొక్కలతోపాటు పొడువు జాతి మొక్కలను నాటుతున్నారు. అయితే నాటే మొక్కల్లో వరుస క్రమంగా ఒకే రకమైన మొక్కలను నాటకుండా మొదట చిన్నజాతి మొక్క మరో మీటరుకు పెద్ద జాతి మొక్క, మరో మీటరుకు పొడవు జాతి మొక్క ఉండే విధంగా మొక్కలను నాటుతున్నారు.

ఎకరానికి 4 వేల మొక్కల చొప్పు న రెండున్నరెకరాల్లో 10 వేల మొక్కలను నాటనున్నారు. ఇప్పటివరకు మియావాకికి గుర్తించిన అనంతగిరిలో 5 వేల మొక్కలను నాటారు. మరో వారంలో మిగతా 5 వేల మొక్కలను నాటనున్నారు. తదనంతరం ట్యాంకర్ల ద్వారా మూడేండ్లపాటు మొక్కలకు అటవీశాఖ ఆధ్వర్యం లో నీటిని అందించనున్నారు. మియవాకిలో భాగంగా 45 రకాల ఔషధ మొక్కలను నాటుతున్నారు. ఔషధ మొక్కల్లో వేప, కాచు, దర్శనం, అల్లనేరేడు, వేరుమద్ది, ఉసిరి, రావి, నెమలినార, కానుగ, తెల్ల విరుగుడు, మర్రి, మేడి, నారవేప, చిన్నంగి, ఇప్పా, మామిడి, జీడి, దొరిసేన, గన్నేరు, చిల్లగింజ, చింత, టేకు, తెల్లమద్ది, కరక్కాయ, ఇనుముద్ది, అంకుడు చెట్టు, పెద్ద రేగు, పరాకి, ముష్టిగంగా, పెద్ద గుమ్ముడు టేకు, అజఘ్నము, అడ్డాకు, కలేచెట్టు, పసుపు, పెద్ద మాను, చిందుగ, చిరుమాను, చారుమామిడి, మోదుగ, జిల్లేడు తదితర ఔషధ మొక్కలను నాటుతున్నారు. అయితే మూడేండ్లలో దట్టమైన చిట్టడవిగా మారనుంది. మియావాకితో అడవుల పెరుగుదలతోపాటు పక్షులకు ఆవాసం ఏర్పడుతుంది. వాతావరణంలో చాలా మార్పులు రానున్నాయి, అటవీ సాంద్రత పెద్ద ఎత్తున పెరుగుతుంది. పట్టణాల్లోనూ మియావాకితో కాలుష్యమయంగా మారిన పట్టణాల్లో మంచి వాతావరణం అందుబాటులోకి రానుంది.

మూడేండ్లలో ప్రయోజనం... డీఎఫ్‌వో వేణుమాధవ్‌

మియావాకి విధానంతో మూడేండ్లలో ప్రయోజనం చేకూరనుందని జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్‌ తెలిపారు. ఈ ఏడాది వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో చిట్టడవుల పెంపకం ప్రక్రియను ప్రారంభించామన్నారు. వచ్చే ఏడాది మిగతా మున్సిపాలిటీల్లో కూడా శ్రీకారం చుట్టేందుకు త్వరలో అనువైన స్థలాన్ని గుర్తిస్తామన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం, పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడమే మియావాకి విధానం యొక్క ముఖ్యోద్దేశమని డీఎఫ్‌వో పేర్కొన్నారు.


logo