బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Oct 10, 2020 , 01:46:21

బాలికల రక్షణకు కృషి

బాలికల రక్షణకు కృషి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : బాలికల రక్షణ, న్యాయ సలహా సహాయం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని రంగారెడ్డి జిల్లా న్యాయ అధికారి సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారి మోతీ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అవార్డుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయ అధికారి సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ... జనాభాలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండటానికి సమాజంలో అసమానతలు, స్త్రీలపైన జరిగే దాడులే కారణమన్నారు. వాటి నిర్మూలనకు అనేక చట్టాలు తీసుకువచ్చినప్పటికీ సమాజం దృక్పథంలో మార్పు రావాలని చెప్పారు. బాలికలు, స్త్రీల రక్షణ, న్యాయ సలహా కోసం తాము నిరంతరం అందుబాటులో ఉంటామని చెప్పారు. జిల్లా సంక్షేమాధికారి మోతి మాట్లాడుతూ... బేటి బచావో... బేటి పడావో కార్యక్రమాన్ని 2018 నుంచి జిల్లాలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు బాలికల, స్త్రీల అభివృద్ధి రక్షణ కోసం స్త్రీ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో అనేక చట్టాలు అమలవుతున్నాయన్నారు. పుట్టిన పసికందు రక్షణ కోసం బాల్యవివాహాలు, వరకట్నం, గృహహింస, లైంగిక వేధింపులు, పనిచేసిన ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, తప్పనిసరి పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాధితుల పరిహారం కోసం రూ. 20లక్షలు కలెక్టర్‌ విడుదల చేసినట్లు చెప్పారు. ప్రతి తల్లి ఆడపిల్లలపై ప్రత్యేక బాధ్యత తీసుకుని చదివించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యా శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, రాచకొండ అదనపు డీసీపీ సలీం, చైర్‌పర్సన్‌ పద్మావతి, జిల్లా సమన్వయ కార్యదర్శి విజయ్‌భాస్కర్‌, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.


logo