గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Oct 06, 2020 , 00:14:17

కరువుదీరా వానలు..

కరువుదీరా వానలు..

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లా రైతాంగానికి ఈ ఏడాది వానకాలం సీజన్‌ ఆశలను మరింత పెంచింది. గత నాలుగేళ్లుగా లోటు వర్షపాతంతో నిరాశలో ఉన్న రైతన్నలకు ఈ ఏడాది కురి సిన భారీ వర్షాలతో పంటలకు, భూగర్భజలాలకు మరో రెండేళ్లు ఢోకా లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం ప్రారం భం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాలో వానలు దంచి కొట్టాయి. ఈ నాలుగు నెలల్లోనూ సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. జిల్లాలో ప్రధానమైన కాగ్నా, మూసీ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి.  కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, లక్నాపూర్‌ ప్రాజెక్టులు  అలుగుపారగా, జిల్లాలోని సగం చెరువులు  పొంగిపొర్లడంతో ప్రాజెక్టులకు, చెరువులకు జలకళ సంతరించుకుంది. అన్ని మండలాల్లో కూడా అధిక వర్షపాతం నమోదుకావడం విశేషం.  గతేడాది ప్రారంభంలో వానలు కురిసి తదనంతరం మొహం చాటేయడంతో చాలా వరకు రైతులు పంటలను సాగు చేయలేని పరిస్థితి నెలకొన్నది.ఈ ఏడాది మాత్రం మొదట్నుంచి సరిపోను వర్షాలు కురవడంతో పత్తి, మొక్కజొన్నతోపాటు అన్ని పంటలు మంచి దిగుబడినిచ్చే దశలో ఉన్నాయి.  

 44.29 శాతం అధిక వర్షపాతం నమోదు...

జిల్లాలో  44.29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణానికి మించి కొంతమేర అధిక వర్షపాతం నమోదు కాగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో  భారీ వర్షాలతో నాలుగేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.  మూసీకి  ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో భారీగా వరద వచ్చి ప్ర మాదకరంగా ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించాయి. తాండూరులో కాగ్నా కూడా ఉప్పొం  గింది. కాగ్నాలో భారీ వరద ధాటికి కొడంగల్‌కు వెళ్లే రోడ్డు కొట్టుకుపోవడంతో ఒక్కరోజు తాండూరు-మహబూబ్‌నగర్‌ మధ్య రాకపోకలు స్తంభించాయి.  కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, జుం టుపల్లి, లక్నాపూర్‌, కావేరి ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఇప్పటికీ అలుగు పారుతున్నాయి. మరోవైపు కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి వచ్చే అలుగు నీటితో పెద్దేముల్‌ మండలం మాన్‌సాన్‌పల్లి వద్ద, ధారూర్‌ మండలం నాగసముందర్‌ వద్ద తాత్కాలిక రోడ్లు మూడు సార్లు కొట్టుకుపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇ బ్బందులు పడడంతోపాటు రాకపోకలు స్తంభించాయి. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 108.3 మి.మీటర్లుకాగా 149.9 మి.మీటర్ల వర్షపాతంతో 41.6 మి.మీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.  జులై లో సాధారణ వర్షపాతం 203.4 మి.మీటర్ల కాగా 91.7 మి.మీటర్ల అధిక వర్షపాతంతో 295.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్టులో సాధారణ వర్షపాతం 180.2 మి.మీటర్లు  కాగా 44 మి.మీటర్ల అధికంతో  224.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ మాసంపై జిల్లా రైతాంగం పెట్టుకున్న ఆశలకు మంచి వానలు కురిశాయి. రెండు అల్పపీడన ప్రభావంతో వరుసగా  పది రోజులపాటు కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 141.2 మి.మీటర్లు కాగా రికార్డు స్థాయి  లో 103.2 మి.మీటర్లతో 244.4 మి.మీటర్ల వర్షపాతం నమో  దైంది.  జిల్లాలోని 18 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అయితే 2019 సం వత్సరంలో 16.1 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా జూన్‌ లో 87.9 మి.మీటర్లు, జులైలో 84 మి.మీటర్లు, ఆగస్టులో 203.1 మి.మీటర్లు, సెప్టెంబర్‌లో 156.6 మి.మీటర్ల వర్షపా తం నమోదైంది.  

ఆశాజనకంగా పంటలు...

ఈ ఏడాది ఆయా పంటలు సాధారణం కంటే అధికంగానే  సాగయ్యాయి. వానాకాలం ప్రారంభం నుంచి వర్షాలు ఉండ డంతో పంటలకు మేలు జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో కురిసిన వర్షాలకు కొంతమేర పంటలకు నష్టం జరగడంతో పెసర, మినుములు,  జొన్న పంటలు నీట మునిగాయి. జిల్లా  లోని అన్ని మండలాల్లో పత్తి, కంది, వరి పంటలతోపాటు మిగతా అన్ని పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది అధిక దిగుబడి వస్తుందని జిల్లా రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 4.76 లక్షల ఎకరాలుకాగా 5.93 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది అత్యధి కంగా పత్తి 2.60 లక్షల ఎకరాలు, కంది పంట 1.80 లక్షల ఎక రాలు, వరి 75 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అదే విధంగా జిల్లాలో 1126 చెరువులుండగా 549 చెరువులు పూర్తిగా నిండి అలుగుపారాయి. మరో 380 చెరువులు 100 శాతం నిండగా, 115 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీరు, 49 చెరువుల్లో 50 శాతం, 33 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలున్నాయి.

మరో రెండేళ్లు ఢోకా లేదు...- జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌

ఈ ఏడాది జిల్లా అంతటా కురిసిన భారీ వర్షాలతో మరో రెండేళ్లు భూ గర్భజలాలకు ఎలాంటి ఢోకా లేదని జిల్లా వ్యవ సాయాధికారి గోపాల్‌ తెలపారు. రానున్న రెండేళ్లు అడ పాదడపా వర్షాలు కురిసిన పంటలకు సరిపోతుందన్నారు. అయితే గత నాలుగేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయని, ఈ ఏడాది పంటలు పూర్తి ఆశాజనకంగా ఉన్నాయన్నారు. అదే విధంగా ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు కురవడంతో వానాకాలం సీజన్‌లో సాధారణానికి మించి పంటలు సాగయ్యాయని జిల్లా వ్యవ సాయాధికారి వెల్లడించారు.  logo