శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Oct 04, 2020 , 00:17:31

వేగంగా ..వేదిక

వేగంగా ..వేదిక

  • జోరుగా  రైతు వేదికల  నిర్మాణ పనులు
  • 83 వ్యవసాయ క్లస్టర్లలో ఏర్పాటు
  • మహేశ్వరంలో ఒకటి సిద్ధం
  • రెండు మూడు రోజుల్లో మరో 15 పూర్తి.. 
  • మిగతా 67 ఈ నెల 15 లోపు  పూర్తి చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశం
  • రూ.18.26 కోట్ల వ్యయం
  • 2లక్షల 7వేల 500 మంది రైతులకు ఉపయోగం

రైతులందరిని ఒక చోట సమావేశపరిచి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై శిక్షణ, మెళకులవపై అవగాహన పెంచడం, కొత్త పథకాల గురించి వివరించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 83 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 83 ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్వరంలో తొలి వేదిక సిద్ధమవ్వగా, మరో 15 రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. మిగిలిన 67 చోట్ల అక్టోబర్‌ 15లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, గతంలో రైతుల కోసం వ్యవసాయ శాఖ ఏ కార్యక్రమం చేసినా పంచాయతీ కార్యాలయంలోనో, ఏ చెట్టుకిందో లేదంటే కమ్యూనిటీ హాల్‌లోనో, ఎవరి పొలంలోనో నిర్వహించాల్సి వచ్చేదని, దీంతో ప్రతిసారి సమావేశం ఎక్కడో తెలియక ఇబ్బంది కలిగేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్‌ రైతు వేదికలకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని అభిప్రాయపడుతున్నారు.

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రైతులకు అవగాహన కల్పించేందుకు పల్లెల్లో  రైతు వేదికల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ..పంట సాగు విధానంపై శిక్షణ, అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న రైతు వేదికల నిర్మాణాలకు ‘తొలి ఏకాదశి’ రోజు భూమి పూజలు చేశారు. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ..క్లస్టర్‌కో వేదిక చొప్పున రంగారెడ్డి జిల్లాలో 83 రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ వేదికల నిర్మాణాలకు సంబంధించి రూ.18.26 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్నాయి. జిల్లాలో 83 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదించారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి రైతు వేదిక నిర్మాణం మహేశ్వరం క్లస్టర్లో పూర్తి కాగా.. మరో 15 రైతు వేదికల నిర్మాణాలు రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. మిగిలిన 67 రైతు వేదికల నిర్మాణాన్ని అక్టోబర్‌ 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశించారు. వీటిలో 46 వేదికలు లెంటల్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి. మరో 15 రూఫ్‌ వరకు పూర్తి కాగా, 20 వరకు పెయింటింగ్‌, ఎలక్ట్రికల్‌, ఫ్లోరింగ్‌, శానిటరీ లాంటి తుది పనులు కావాల్సిఉంది.

24 మండలాల్లో నిర్మాణాలు

  జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. పంటల సాగు ఉన్న 24 మండలాల్లో వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 5 వేల ఎకరాలకు 2,500 మంది, 83 క్లస్టర్లలో 2,07,500 మంది రైతులు ఇది వినియోగించుకోనున్నారు. కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసే విధంగా భవనం నిర్మించనున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1, ఇబ్రహీంపట్నం 2, మంచాల 3, యాచారం 4, బాలాపూర్‌1, కందుకూరు 6, మహేశ్వరం 3, చేవెళ్ల 5, మొయినాబాద్‌ 2, షాబాద్‌ 6, శంకర్‌పల్లి 4, గండిపేట 1, శంషాబాద్‌ 2, రాజేంద్రగనర్‌ 1 , చౌదరిగూడ 3, ఫరూఖ్‌నగర్‌ 5, కేశంపేట 6, కొందుర్గు 4, కొత్తూరు 2, నందిగామ 2, తలకొండపల్లి 6, కడ్తాల్‌ 4, మాడ్గుల 6, ఆమనగల్లులో 4 చొప్పున వేదికల నిర్మాణాలు జరుగుతున్నాయి.

ప్రయోజనాలివే..

 రైతు వేదికలతో వ్యవసాయ అధికారుల పాలన వికేంద్రీకరించినట్లు అవుతుంది. రైతులకు వ్యవసాయశాఖ మరింత చేరువవుతుంది. రైతు వేదికలో ఏఈవోలకు ప్రత్యేక గదిని కేటాయిస్తారు. ఒక్కో వేదిక పరిధిలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉండడంతో రైతులు తమకు సమీపంలోని రైతు వేదికల వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పంటలకు సంబంధించిన వివరాలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ పథకాలు, కార్యక్రమాలు, సూచనలు, సలహాలను మండల కేంద్రానికి వెళ్లకుండా తమకు చేరువలో ఉన్న రైతు వేదిక వద్దకు వెళ్లి తెలుసుకోవచ్చు. అలాగే ఇన్నాళ్లు ఏఈవోలు గ్రామాల్లో ఉండేందుకు ఎక్కడ ప్రత్యేక ఏర్పాటుగానీ, రైతులతో మాట్లాడేందుకు వేదికగానీ లేదు. ఆరుబయటనే సమావేశాలను నిర్వహించాల్సి వచ్చేది. రైతులను కలిసేందుకు వారి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాల్సి వచ్చేది. లేకపోతే చెట్ల కింద, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దకు పోవాల్సి వచ్చేది. రైతు వేదికలో (సమావేశ మందిరం, వంట గది, సమావేశ మందిరం, మరుగుదొడ్డి, మైక్‌ సౌకర్యం)ఏర్పాటు చేయనున్నారు. ఆయా క్లస్టర్ల వారీగా మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేసేందుకు రైతు వేదికల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 

అక్టోబర్‌ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం

     రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించడంతో జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలననుసరించి జిల్లా వ్యవసాయ శాఖాధికారులు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రైతు వేదికల నిర్మాణంపై దృష్టి సారించారు. క్లస్టర్‌కు ఒక వేదిక చొప్పున నిర్మించేందుకు భూసేకరణను రెవెన్యూ అధికారులు చేపట్టి ఇచ్చారు. జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్టు అంచనా. ఈ లెక్కన జిల్లాలో 83 రైతు వేదికల నిర్మాణాలను రూ.18.26 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఒక్కో వేదికను 20 గుంటల స్థలంలో నిర్మిస్తున్నారు. logo