గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 11, 2020 , 00:19:43

పాఠాల కోసం ఊరికో టీవీ

పాఠాల కోసం ఊరికో టీవీ

  పేద విద్యార్థుల చదువుకు బాసటగా స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న  చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి 

పరిగి/కులకచర్ల : డిజిటల్‌ తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరవ్వాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి సూచించారు. డిజిటల్‌ పాఠాలు ఏ ఒక్కరూ మిస్‌ కావొద్దనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామపంచాయతీకి ఒక టీవీ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పరిగి, కులకచర్ల మండల పరిధిలోని సర్పంచ్‌లకు స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి స్వంత డబ్బులతో టీవీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక రంగం, ఆరోగ్యం, ఇతర రంగాలు అతలాకుతలమయ్యాయని అన్నారు. గత విద్యా సంవత్సరం పరీక్షలు లేకుండానే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అందరినీ పాస్‌ చేసిందన్నారు. కోవిద్‌ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యం జరగకుండా విద్యా శాఖ డిజిటల్‌ తరగతులు ప్రారంభించిందని అన్నారు. ఈ మేరకు డిజిటల్‌ తరగతులు చూసేందుకు టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు ఎంతమంది వద్ద ఉన్నాయని సర్వే చేపట్టారని, 8శాతం పిల్లల వద్ద స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు లేవని సర్వేలో తేలిందని చెప్పారు. వారందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు  గ్రామపంచాయతీలకు టీవీలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి డిజిటల్‌ తరగుతులు మిస్‌ కావొద్దనే ఉద్దేశంతో టీవీలు అందజేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులంతా డిజిటల్‌ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. రెండుమూడు రోజులలో ప్రతి గ్రామపంచాయతీకి టీవీలను పూర్తిస్థాయిలో అందజేస్తామని, సర్పంచ్‌లు వెంటనే ఇంటర్‌నెట్‌, కేబుల్‌ కనెక్షన్‌ ఇప్పించి విద్యార్థులు డిజిటల్‌ పాఠాలు వినేలా చూడాలన్నారు. 85శాతం మంది విద్యార్థులు డిజిటల్‌ తరగతులకు హాజరవడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. వంద శాతం విద్యార్థులు డిజిటల్‌ తరగతులకు హాజరయ్యేలా ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంపీ సూచించారు. డిజిటల్‌ తరగతుల తర్వాత ఈ టీవీలను వీడియో కాన్ఫరెన్స్‌ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చని చెప్పారు. రెండు మూడు నెలల్లో కొవిడ్‌ నుంచి బయట పడుతామని, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, తప్పనిసరిగా అభివృద్ధ్ది చేద్దామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా డిజిటల్‌ పాఠాలు వినాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా డిజిటల్‌ పాఠాలు బోధిస్తున్నారని, విద్యార్థులకు నష్టం కలగరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం డిజిటల్‌ తరగతులు ప్రారంభించిందని చెప్పారు. విద్యార్థులు తప్పనిసరిగా డిజిటల్‌ తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అన్ని గ్రామాలలో వెంటనే దండోరా వేయించి టీవీలు, సెల్‌ఫోన్‌లు లేని విద్యార్థులు డిజిటల్‌ తరగతులు వినేందుకు ఏర్పాట్లు చేయడంపై తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలలో డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, జిల్లా విధ్యాధికారి రేణుకాదేవి, ఎంపీపీలు అరవిందరావు, సత్యమ్మ, జడ్పీటీసీలు హరిప్రియ, రాందాస్‌నాయక్‌, పరిగి పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్‌, పీరంపల్లి రాజు, కులకచర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింలు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌లు ఎస్‌.భాస్కర్‌, నాగరాజు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, సారా శ్రీనివాస్‌, మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, సురేందర్‌కుమార్‌, హరికృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

    పెరుగనున్న పచ్చదనం

ప్రకృతి వనాల ఏర్పాటుతో పచ్చదనం పెరగనుందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తెలిపారు. గురు వారం పరిగి మండలం రాఘవాపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి పల్లె ప్రకృతివనాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వనాలలో మొక్కలు నాటడంతోపాటు, ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. తద్వారా రాబోయే రెండు మూడు సంవత్సరాలలో గ్రామాలలో మరింత పచ్చదనం పెరుగుతుందని, మంచి గాలి అందుతుందని అన్నారు. ఇళ్ల ఆవరణలోను మొక్కలు నాటాలని చెప్పారు. 

 చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

చాకలి ఐలమ్మ వర్దంతి సందర్భంగా గురువారం పరిగిలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ ధీర వనిత అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎస్పీ బాబయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు, రజక సంఘం నాయకులు లాల్‌క్రిష్ణప్రసాద్‌, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 


logo