శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Sep 01, 2020 , 23:57:48

మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌..!

మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌..!

అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి అయోమయంలో ఉన్నవారికి ఊరటనిస్తూ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశాన్నిచ్చింది. ఇప్పటికే అనధికారిక ప్లాట్లలో  కొనుగోళ్లు, అమ్మకాలను నిలిపివేయగా, ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నది. వంద గజాల లోపు జాగ ఉన్నవారు కేవలం గజానికి రూ.200 చెల్లించి రెగ్యులరైజ్‌ చేసుకోవచ్చు. 100 నుంచి 300 వరకు ఉన్నవారు గజానికి రూ.400, 300 నుంచి 600 వరకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అనేకమందికి లబ్ధి చేకూరడంతో పాటు.. ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం రానున్నది. అయితే గతనెల 26కు ముందు ఉన్న లేఅవుట్లలో మాత్రమే క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చింది. 111 జీవో పరిధిలో క్రమబద్ధీకరణకు  అనుమతి నిరాకరించింది. వచ్చే నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌ : అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియ ప్రారంభించినట్టు జీవో నంబరు 131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్‌లోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు సర్కార్‌ రిజిస్ట్రేషన్‌ నిలిపివేసిన సంగతి విదితమే. లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్ల్లయింది. 26 ఆగస్టు 2020లోపు చేసిన లే అవుట్‌ ఓనర్లకు, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న (సేల్‌ డీడ్‌) ప్లాట్‌ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్‌శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లకు రెగ్యులర్‌ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అక్టోబరు 15వ తేదీ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల పరిధిలోని గ్రామాలకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కాంటిటెంట్‌ అథారిటీగా స్పష్టం చేసింది. ఈ సారి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో కాంపిటెంట్‌ అథారిటీగా ప్రభుత్వం పొందుపర్చలేదు. సాధ్యమైనంత మేరలో ఈ పథకాన్ని పూర్తిచేసి వచ్చిన నిధులను సర్కారు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఖర్చు చేయనున్నది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ జాతర కొనసాగనున్నది. కాగా ఇదివరకు 2015లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించగా హెచ్‌ఎండీఏ పరిధిలో 1.75 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా లక్షకు పైగా దరఖాస్తులకు క్రమబద్ధీకరణ పత్రాలను హెచ్‌ఎండీఏ అందజేసింది. తద్వారా రూ. 1050కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలోకి సమకూర్చుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1, 30 లక్ష దరఖాస్తులను స్వీకరించగా, 70 వేల దరఖాస్తుల అనుమతులు మంజూరు చేశారు. 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రూ. 1000కోట్లు ఆదాయం వచ్చింది. ఏండ్ల తరబడి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోని వారికి మరోసారి అవకాశం కల్పించడం గమనార్హం. అక్రమ నిర్మాణాలకు శాశ్వత చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నది. 

అక్రమ లేఅవుట్లతో ఖజానాకు చిల్లు..

 రంగారెడ్డి జిల్లాలో అక్రమ వెంచర్లను అధికారులు ఎప్పటికప్పుడు కూల్చివేస్తున్నారు.  నిబంధనల ప్రకారం ప్లాట్లు చేస్తున్నవారు కొందరే ఉండగా..అత్యధికులు అక్రమంగానే స్థిరాస్తి వ్యాపారం సాగిస్తున్నారు.  గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి అక్రమ వెంచర్లపై కఠినంగా వ్యవహరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 841 అక్రమ వెంచర్లను పంచాయతీ అధికారులు కూల్చివేశారు. జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో దాదాపుగా 4వేలకు పైగా అక్రమ వెంచర్లు ఉన్నట్లు సమాచారం. 

వికారాబాద్‌ జిల్లాలో 294 అక్రమ లే అవుట్లు..        

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో 214 అనుమతి లేని లే అవుట్లు ఉండగా, గ్రామ పంచాయతీల పరిధిలో 80 అనుమతి లేని లే అవుట్లు ఉన్నట్లు ఆయా మున్సిపల్‌, పంచాయతీ అధికారులు గుర్తించారు. పరిగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైనప్పటికీ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలోనే చాలా వరకు అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేయగా, ఇక్కడ అత్యధికంగా 117 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 81, తాండూరులో 11, కొడంగల్‌ మున్సిపాలిటీలో 5 లేఅవుట్లలో మొత్తం 12675 ప్లాట్లను అనధికారికమైనవిగా గుర్తించారు. ఈ లే అవుట్లలో కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పరిగి మున్సిపాలిటీ 8214, వికారాబాద్‌లో 3081, తాండూరులో 900, కొడంగల్‌లో 480 అక్రమ ప్లాట్లు ఉన్నాయి.    

జీవో ఏం చెబుతున్నది? 

అమలులోకి వచ్చిన జీవో 131 ప్రకారం గతనెల ఆగస్టు 26వ తేదీ వరకు మాత్రమే అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు (సేల్‌ డీడ్‌ అయిన) చేసిన రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు, లే అవుట్లను అభివృద్ధి చేసిన వారు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. లే అవుట్లను మంజూరు చేసే అధికారిక సంస్థల నుంచి అనుమతిలేని లే అవుట్లకు, ఆ లే అవుట్లలోని ప్లాట్లకు, రోడ్లు అభివృద్ధి లేని, ఖాళీ ప్రదేశాలు వదలని, మౌలిక సౌకర్యాలు కల్పన లేని లే అవుట్లలోని ప్లాట్లకు క్రమబద్ధీకరణ జీవో వర్తిస్తుంది. హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు ఈ నియమాలు వర్తిస్తాయి. సేల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ ఉన్న ప్లాట్లకు,  లే అవుట్లకు మాత్రమే కానీ, జీపీఓ డీడ్‌లకు వర్తించదని తేల్చి చెప్పింది. 26 ఆగస్టు తర్వాత రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు వర్తించదని జీవో స్పష్టం చేసింది.