గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 01, 2020 , 01:50:14

నీటిని ఒడిసిపట్టేందుకే చెక్‌డ్యాంలు

 నీటిని ఒడిసిపట్టేందుకే చెక్‌డ్యాంలు

  • రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్మాణానికి  రూ.78 కోట్లు మంజూరు
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో  రైతుల కల సాకారం
  • రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగు నీరు 
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి
  • వెంకటాపూర్‌ వద్ద ఈసీ వాగుపై చెక్‌ డ్యాం   నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • పాల్గొన్న  జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకే వాగులు, కాల్వలపై చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండలం వెంకటాపూర్‌లో ఈసీ వాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.78కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల సాగునీటి కల సాకారమైందన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. 

-మొయినాబాద్‌


మొయినాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల కల సాకారమైందని, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా ప్రజలకు సాగు నీరు అందించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామ సమీపంలోని ఈసీ వాగుపై రూ.2.75 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాంకు సోమవారం మంత్రి సబితారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ నక్షత్రంజయవంత్‌, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, స్థానిక సర్పంచ్‌ మనోజ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అతి ఎత్తులో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. అతి తక్కువ సమయం మూడేండ్లలో ప్రాజెక్టు నిర్మించి రైతాంగానికి సాగు నీరు అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటల్లో నీళ్లు నింపి ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందన్నారు. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు సాగు నీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం చేసినట్లుగా రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును విజయవంతం చేస్తామన్నారు. అందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషి చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లోని పురాతన చెరువులను పునరుద్ధరించాలనే ఆలోచనతో మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి చెరువులు, కుంటలను అభివృద్ధి చేశారన్నారు. ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలనే గొప్ప సంకల్పంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మంచినీళ్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 

చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.78 కోట్లు ..

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్న వరద కాల్వలపై చెక్‌ డ్యాంలు నిర్మించడానికి రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.78 కోట్లు మంజూరు చేశారన్నారు. అందులో చేవెళ్ల నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయన్నారు. అందులో భాగంగానే వెంకటాపూర్‌ సమీపంలో ఉన్న ఈసీ వాగు మీద చెక్‌ డ్యాం నిర్మించడం కోసం రూ.2.75 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే యాదయ్య ప్రత్యేక చొరవతీసుకుని చేవెళ్ల నియోజకవర్గంలో మరో నాలుగు చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారని, త్వరలోనే వాటిని నిర్మించడానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 639 చెక్‌డ్యాంలు నిర్మించడానికి రాష్ట్రం ప్రభుత్వం రూ.2,850 కోట్లు మంజూరు చేసిందన్నారు.  భవిష్యత్తు తరాలు సంతోషంగా ఉండాలంటే ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ శాఖ ఈఈ రంగారెడ్డి, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, తహసీల్దార్‌ అనిత, ఏవో రాగమ్మ, ఆర్‌ఐ రోజా, పీఆర్‌ డీఈ విజయ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డి మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జయవంత్‌, సుధాకర్‌యాదవ్‌, మాణిక్‌రెడ్డి, బాలరాజు, మాజీ పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు నర్సింహారెడ్డి, దారెడ్డికృష్ణారెడ్డి, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల, మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు డప్పు రాజు, సర్పంచ్‌లు గడ్డం లావణ్య అంజిరెడ్డి, కుమార్‌, ఎంపీటీసీలు రాంరెడ్డి, రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవి యాదవ్‌, సురేందర్‌గౌడ్‌, శంకర్‌, రమేశ్‌, కృష్ణమాచారి, పరమేశ్‌, భరత్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపికృష్ణారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. 

రైతుబీమా బాండు అందజేత..

మండలంలోని అమ్డాపూర్‌ గ్రామానికి చెందిన రైతు  నర్సింహారెడ్డి ఇటీవల మృతిచెందాడు. దీంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రైతు బీమా పథకం బాండును మంత్రి సబితారెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు.


logo