గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Aug 30, 2020 , 00:09:05

విస్తీర్ణాన్ని బట్టి మొక్కలు నాటాలి

విస్తీర్ణాన్ని బట్టి మొక్కలు నాటాలి

  • రైతు వేదికలను త్వరగా పూర్తిచేయాలి
  • ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను వెంటనే పరిష్కరించాలి
  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌: అక్టోబర్‌ 2 వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్‌ మండల పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లిలో జిల్లా పంచాయతీ రిసోర్స్‌ భవనంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు వేదిక భవన నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా అటవీశాఖ కేటాయించిన అర ఎకరా భూమిలో కనీసం 2000 మొక్కలను నాటాలన్నారు. భూమి విస్తీర్ణాన్ని బట్టి మొక్కలు నాటాలని సూచించారు. ఒక్క రోజు కనీసం 1000కి పైగా మొక్కలు నాటాలని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అక్టోబర్‌ 2 గాంధీ జయంతి వరకు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనాలకు ఫెన్సింగ్‌ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

భూ సర్వేను పక్కాగా నిర్వహించాలి

జిల్లాలో భూ సర్వేను పక్కాగా నిర్వహించి, భూవివాదాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు సర్వే విభాగం అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో సర్వే డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నూతనంగా రూ.12.25 లక్షలతో కొనుగోలు చేసిన సర్వే యంత్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పౌసుమిబసు సర్వే యంత్రం పని తీరును సంబంధిత అధికారులకు అడిగి తెలుసుకున్నారు. సర్వే యంత్రం సహాయంతో భూ సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. కలెక్టర్‌ వెంట సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగం అధికారులు ఉన్నారు. 


logo