సోమవారం 19 అక్టోబర్ 2020
Vikarabad - Aug 27, 2020 , 04:32:58

యూరియా కోసం ఆందోళన వద్దుq

యూరియా కోసం ఆందోళన వద్దుq

  • కావాల్సినంత నిల్వలు ఉన్నాయి 
  • రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలి
  • జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌
  • పెద్దేముల్‌లో ఎరువుల  దుకాణాలు,  రైతు సేవా సహకార సంఘం తనిఖీ

పెద్దేముల్‌ :  యురియా కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గోపాల్‌ పూర్‌, పెద్దేముల్‌ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను పరిశీలించి, స్థానిక రైతు సేవా సహకార సంఘంలో యూరియా నిల్వలతో పాటు  మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని తనిఖీ చేసి తాండూరు ఏడీఏ, మండల ఏవోలతో కలిసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల మేలు కోసం ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను సంబంధిత నిర్మాణ ఏజెన్సీలు పనులు వేగవంతంగా చేపట్టి వీలైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులకు కావల్సినంత యురియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు.

యురియా కావల్సిన రైతులు పట్టా పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లను తప్పనిసరిగా  వెంట తీసుకుని రావాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫర్టిలైజర్ల దుకాణ యజమానులు  అన్ని రకాల రికార్డులను ఎప్పటికప్పుడు వెంటవెంటనే నమోదు చేసుకోవాలని, రైతులకు ఎవరికీ కూడా అధిక ధరలకు ఎరువులను, మందులను విక్రయించొద్దని కోరారు. ఆయన వెంట తాండూరు ఏడీఏ శంకర్‌ రాథోడ్‌, మండల ఏవో షేక్‌ నజీరొద్దీన్‌, రైతు వేదికల నిర్మాణ పనుల పరిశీలన సమయంలో పెద్దేముల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ద్యావరి విష్ణువర్ధన్‌ రెడ్డి, గోపాల్‌ పూర్‌ సర్పంచ్‌ బ్యాగరి రాములు, ఏఈవో వినయ్‌ ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.


logo