బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Aug 25, 2020 , 23:44:12

యూరియా ఫుల్‌...

యూరియా ఫుల్‌...

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో యూరియా కొరత సమస్య తలెత్తకుండా జిల్లా వ్యవసాయ శాఖ వానకాలం సీజన్‌ ప్రారంభం నుంచి పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 16,230 మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేయగా, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌, ప్రైవేట్‌ డీలర్ల వద్ద మరిన్ని మెట్రిక్‌ టన్నుల యూరియాను జిల్లా వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. గతంలో మాదిరిగా యూరియా కోసం భారీ క్యూ లైన్లు, గంటల తరబడి  ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా రైతులకు సరిపోను యూరియాను అందుబాటులో ఉంచుతున్నది. ఆగస్టు నెలలో కూడా జిల్లాకు కావాల్సిన యూరియాలో దాదాపు 90 శాతం వరకు రైతులకు సరఫరా చేసింది. అయితే, జిల్లాలోని డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ సొసైటీలకు యూరియా చేరినప్పటికీ సకాలంలో రైతులకు సరఫరా చేయడంలో అలసత్వం వహించడంతోనే కొరత సమస్య ఉత్పన్నమవుతుంది. కొన్ని మండలాల్లోని సొసైటీలు, ప్రైవేట్‌ డీలర్ల నిర్లక్ష్యపు తీరుతోనే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తున్నది. 

మరో 600 మెట్రిక్‌ టన్నులు.. 

వానకాలం సీజన్‌లో జిల్లాకు ఎంతమేర యూరియా కావాలనే దానిపై ముందస్తుగా అంచనా వేసిన జిల్లా వ్యవసాయ శాఖ ఆ దిశగా పక్కా ప్రణాళికతో సరఫరా చేస్తున్నది. జిల్లా రైతాంగం సాగు చేసే ఆయా పంటలను బట్టి జిల్లాకు 24,122 మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 19,540 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. ఇందులో 16,230 మెట్రిక్‌ టన్నుల ను సరఫరా చేయగా, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ సొసైటీల ఆధ్వర్యలో 965 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ సొసైటీల వద్ద 2345 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. మరో రెండు రోజుల్లో 600 మెట్రిక్‌ టన్నులను నగరంలోని సనత్‌నగర్‌ బ్రేక్‌ పాయింట్‌ నుంచి జిల్లాలోని ఆయా సొసైటీలకు తరలించనున్నారు. అనంతరం ఎక్కడైతే యూరియా తక్కువ మొత్తంలో ఉందో ఆ మండలాలకు సరఫరా చేయనున్నారు. ప్రధానంగా కొడంగల్‌, బొంరాసుపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో యూరియా కొరత సమస్య తీర్చడంపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో 13 పీఏసీఎస్‌, 5 డీసీఎంఎస్‌, 184 ప్రైవేట్‌ సొసైటీల ద్వారా జిల్లాలో యూరియాతో పాటు ఇతర ఎరువులను సరఫరా చేస్తున్నారు. సెప్టెంబర్‌లో 4955 మెట్రిక్‌ టన్నులు అవసరమని, ఈ నెలాఖరులోగా జిల్లాకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు. 

అధిక ధరకు విక్రయిస్తున్న ప్రైవేట్‌ డీలర్లు...

యూరియా డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఇదే అదునుగా భావించి ప్రైవేట్‌ డీలర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం యూరియా బస్తా రూ.260-270లకు విక్రయించాలని నిర్ణయించగా, ప్రైవేట్‌ డీలర్లు మాత్రం రూ.100 అదనంగా విక్రయిస్తున్నారు.  వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ ప్రైవేట్‌ డీలర్లు అధిక ధరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులకు అవసరం లేనప్పటికీ యూరియాతోపాటు ఉండే మసాలా ఎరువులను కూడా తప్పనిసరిగా తీసుకోవాలంటూ, మసాలాలు తీసుకుంటేనే యూరియాను విక్రయిస్తామంటున్నారని రైతులు వాపోతున్నారు. యూరియాకు రూ.370 నుంచి రూ.380లు, మసాలాకు అదనంగా రైతుల వద్ద వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా  కొందరు ప్రైవేట్‌ డీలర్లు యూరియాను నిల్వ చేసుకొని, కొరతను సృష్టిస్తున్నారు. తప్పనిసరిగా కావాలని అడిగిన రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి డీలర్లపై చర్యలు తీసుకోవాల్సిన ఆయా మండలాల వ్యవసాయాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. logo