గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Aug 21, 2020 , 01:54:05

ఊట పోటెత్తిం ది..

ఊట పోటెత్తిం ది..

  • వికారాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 11.94 మీటర్లుపెరిగిన భూగర్భజలాలు
  • బంట్వారం మండలంలో కేవలం 1.79 మీటర్ల లోతులోనే...
  • పరిగి, దోమ, వికారాబాద్‌, మర్పల్లి మండలాల్లో 20మీటర్లు కిందికి
  • భూగర్భజలాలు పెంచేందుకు అధికారుల ప్రత్యామ్నాయ చర్యలు
  • ఈ ఏడాది సాధారణానికి మించి వర్షపాతం 

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడం.. ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర కారణాలతో గత నాలుగేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వికారాబాద్‌ జిల్లాలో భూగర్భజలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఓవైపు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా.. మరోవైపు నీటి మట్టాలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మండలాలు మినహా మిగతా అన్ని  మండలాల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. బంట్వారం మండలంలో కేవలం 1.79 మీటర్లు, కోట్‌పల్లి మండలంలో 2.88 మీటర్లలోతులోనే నీటి నిల్వలు ఉన్నాయి. గతేడాది జూలై మాసంలో 19.95 మీటర్ల లోతులో నీరు ఉండగా, ఈ ఏడాది 11.94మీటర్లు పైకి వచ్చాయి. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో  సాధారణానికి మించి 110 మి.మీటర్లకుపైగా అధికంగా వర్షపాతం నమోదవడంతో బోర్లు, బావులు జలకళను సంతరించుకున్నాయి.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఈ ఏడాది వానకాలం ప్రారంభం నుంచి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గత నాలుగేండ్లలో ఎప్పుడు లేనంతగా భూగర్భజలాలు రికార్డు స్థాయిలో పైకి చేరుకున్నాయి. నాలుగు  మినహా అన్ని మండలాల్లో  ఈ ఏడాది భూగర్భజలాలు పెరగడం గమనార్హం. బంట్వారంలో కేవలం 1.79 మీటర్లలోతులో నీరు ఉండగా, కోట్‌పల్లి మండలంలో 2.88 మీటర్ల లోతులో ఉన్నాయి. భూగర్భజలాలు అడుగంటిన మండలాల్లో నీటి మట్టాన్ని పెంపొందించేందుకు అధికార యంత్రాంగం ఇంకుడు గుంతల నిర్మాణం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అయితే, జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో ఇప్పటివరకు సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలు, కొత్త చెక్‌డ్యాంలు.. పాత వాటికి మరమ్మతులు తదితర కారణాలు భూగర్భజలాలు పెంపొందేందుకు దోహదపడుతున్నాయి. 

11.94 మీటర్లు పెరుగుదల...

జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో   11.94 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. గతేడాది జూలై మాసంలో 19.95 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ఈ ఏడాది మే నెలలో 16.40 మీటర్లు, జూన్‌లో 15.35 మీటర్లు, జూలైలో 11.94 మీటర్ల పైకి వచ్చాయి. అయితే,  పరిగి, దోమ, వికారాబాద్‌, మర్పల్లి మండలాల్లో 20 మీటర్లకు నీటి మట్టం పడిపోగా, మిగతా 14 మండలాల్లో 15 మీటర్లకు చేరుకున్నాయి. అయితే   జూన్‌ నుంచి ఇప్పటివరకు జిల్లా అంతటా  సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై, ఆగస్టుల్లో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతంతో పోలిస్తే 110 మి.మీటర్లకుపైగా అధికంగా కురిసింది. జూన్‌లో 108.3 మి.మీటర్లకు 149.9 మి.మీటర్లు, జూలైలో 203 మి.మీటర్లకు 295.1 మి.మీటర్ల వర్షం పడింది. జిల్లాలోని 11 మండలాల్లో సాధారణానికి మించి, మరో 5 మండలాల్లో సాధారణ, మరో 2 మండలాల్లో మాత్రమే తక్కువ కురిసిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆగస్టు మాసంలో సాధారణం కంటే ఎక్కువగా ఇప్పటివరకు 95 మి.మీటర్లు పడింది.  మరోవైపు  జూన్‌, జూలై మాసాల్లో 425 మి.మీటర్లకు 539 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 

మండలం భూగర్భ జలాల 
లోతు మీటర్లలో..

బంట్వారం 1.79 
కోట్‌పల్లి 2.88
కొడంగల్‌ 4.10
మోమిన్‌పేట్‌ 5.35
దౌల్తాబాద్‌ 6.95
తాండూరు 4.05
నవాబుపేట్‌ 6.73
పూడూరు 7.50
కులకచర్ల 11.64
యాలాల 12.10
బషీరాబాద్‌ 12.16
పెద్దేముల్‌ 12.69
బొంరాసుపేట్‌ 13.64
ధారూర్‌ 15.31
మర్పల్లి 20.54
వికారాబాద్‌ 20.77 
దోమ 23.50
పరిగి 25.02

జిల్లా అంతటా పెరిగిన భూగర్భజలాలు


భారీ వర్షాలతో జిల్లా అంతటా భూగర్భజలాలు పెరిగాయి. పరిగి, వికారాబాద్‌, దోమ, మర్పల్లి మండలాల్లో మాత్రమే భూగర్భ నీటి మట్టం పడిపోయింది. బంట్వారం మండలంలో 1.79 మీటర్ల లోతులోనే  నీళ్లు ఉన్నాయి.  అడుగంటిన మండలాల్లో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టే విధంగా చర్యలు చేపడుతాం.
-జిల్లా భూగర్భజలశాఖాధికారి రామారావు